‘సుస్థిర అభివృద్ధికి వ్యాపార పరివర్తన’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం

నాణ్యమైన ఉపాధి ఆధారిత విద్య అవసరం : ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్ట రెడ్డి
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామి : ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్
ఏప్రిల్ 14న ‘డిజిటల్ సాధికారత’ దినోత్సవం : అంబేద్కర్ వర్శీటి వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి

హైదరాబాద్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి నాణ్యమైన, సమ్మిళిత విద్యను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విద్యను ఉన్నత విద్యా సంస్థలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కెరియర్ అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో పలు నైపుణ్య, ఉపాధి ఆధారిత కోర్సులు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ‘సుస్థిర అభివృద్ధి కి వ్యాపార పరివర్తన’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా మార్పులు జరుగుతున్నాయన్నారు. ఇ-కామర్స్, మొబైల్ కామర్స్, డిజిటల్ ప్లాట్ఫారమ్ల వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార పద్ధతులను, వినియోగదారుల ఆలోచనా విధానాలను మారుస్తున్నాయన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దశలు ఇప్పుడు డిజిటలైజేషన్, కోవిడ్ మహమ్మారి తరువాత పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో కొత్త శకానికి దారితీసిందని వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఉన్నత విద్యా సంస్థలు నాణ్యమైన, ఉపాధి ఆధారిత విద్యను అందించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో నైపుణ్య ఆధారిత, ఉపాధి ఆధారిత కోర్సులు ప్రవేశపెట్టామని ఆయన వివరించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించి మాట్లాడుతూ డా. బి. ఆర్. అంబేద్కర్ సామాజిక సంస్కర్త మాత్రమే కాదని సమ్మిళితమైన, సమానమైన ఆర్థిక వ్యవస్థను ఊహించిన ప్రముఖ ఆర్థికవేత్త అని అభివర్ణించారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో ఆర్థిక అవకాశాలకు పెంపొందించడానికి విద్యా బోధనలో సరికొత్త వ్యూహాలను పునరాలోచించుకోవాలని ప్రొ. ఘంటా చక్రపాణి సూచించారు. డా. బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న విశ్వవిద్యాలయం ‘డిజిటల్ సాధికారత’ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్షా 20 వేలకు పైగా విద్యార్థులు చేరుతున్నారన్నారు. ఉపాధి-ఆధారిత పాఠ్యాంశాల రూపకల్పన, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను యూనివర్సిటీ అందిస్తోందని వివరించారు. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘సమత’ వంటి కార్యక్రమాలని ప్రారంభించామన్నారు. తమ విధ్యార్ధులను కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులుగా చూడాలనే లక్ష్యంతో టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

Also Read-

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జయేష్ రంజన్, ఐఏఎస్, మాట్లాడుతూ తలసరి ఆదాయం పరంగా దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఉందని, గ్రామీణ ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలు “కోటీశ్వరులు”గా మారడానికి వీలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా సాధికారపరచడంపై దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి “వికసిత భారత్” నిర్మించాలనే నరేంద్ర మోడీ జాతీయ దార్శనికతను ప్రస్తావిస్తూ భారతదేశం 2047 నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుందని, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని పేర్కొన్నారు. హైదరాబాద్ను ప్రధాన ఆర్థిక, ఆవిష్కరణ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కనెక్టివిటీని బలోపేతం చేస్తున్నామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మౌళిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా వినూత్న అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించారు. 2047 నాటికి కార్బన్ ఉద్గార రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (కోజికోడ్) డీన్ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) ప్రొఫెసర్ సుదర్శన్ కుంట్లూరు సదస్సులో కీలకోపన్యాసం చేస్తూ పోటీతత్వం, సామాజిక బాధ్యతను కొనసాగించడానికి సుస్థిర-ఆధారిత పరివర్తన వ్యూహాలను అవలంబించాలని సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్, ఎన్విరాన్మెంటల్, సోషల్ గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్లతో సహా అనేక అంశాలను వివరించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ప్లాట్ఫారమ్ లు పోషిస్తున్న పాత్రను వివరించారు. వనరులను తగ్గించడం, పునర్ వినియోగం, రీసైక్లింగ్ చేయడంపై దృష్టి సారించాలని యువ పరిశోధకులకు సూచించారు. సమస్యలను, సవాళ్లను పరిష్కరించడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తూ, ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు మారాలని సూచించారు.

అంతకుముందు జాతీయ సదస్సు లక్ష్యాలను కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ డీన్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్ వివరించారు. వ్యాపార ఆవిష్కరణ, స్థిరమైన అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, ఆర్థిక వృద్ధిపై చర్చలు జరిపి మంచి అంశాలను సేకరించి సుస్థిర అభివృద్ధికి బాటలు వేయడమే ఈ సదస్సు లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల సమావేశంలో పలు ప్యానెల్ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సెమినార్ కో డైరెక్టర్ ప్రొ. డి. రబింద్రనాథ్ సోలమన్ రెండు రోజుల సదస్సు నిర్వహణా ఆవశ్యకతను వివరించారు. అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్స్, డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి; రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, కాన్ఫరెన్స్ కో-డైరెక్టర్ ప్రొ. వై.ఎస్. కిరణ్మయి; కాన్ఫరెన్స్ సెక్రటరీ డాక్టర్ పి. రాధా కృష్ణ; కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్ బర్ల; ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. పల్లవి కబ్డే, ప్రొ. చంద్రకళ, డైరెక్టర్లు, డీన్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన టెక్నికల్ సెషన్లలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ వైస్-ఛాన్సలర్ కె. వి. రావు; నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, (కోల్‌కతా) అధ్యాపకులు ప్రొ.అనిర్బణ్ ఘోష్; జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ప్రొ. బి. సింధు; పై ఇంటర్నేషనల్ నుండి ప్రశాంత్ కుమార్ దాస్; హెల్త్‌కేర్ & లైఫ్ సైన్సెస్ విభాగం నుంచి డేవిడ్ రాజు మన్నే; బెకం ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కిషోర్ నూతలపాటి; వివిధ యూనివర్సిటీల అధికారులు, డీన్లు, పరిశోధకులలు తదితరులు పాల్గొనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X