మీ అవినీతిని కప్పిపుచ్చేందుకు గవర్నర్ చేత అబద్దాలు పలికిస్తారా?
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని పచ్చి బూటకం
రైతు బంధు పేరుతో సబ్సిడీలన్నీ బంద్
దళిత బంధు విపల పథకం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ : ఇన్నాళ్లు గవర్నర్ గారిని, రాజ్యాంగాన్ని అవమానపర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి నోటితో అసత్యాలు చెప్పించడం బాధాకరం. విఫలమైన పథకాలను గవర్నర్ గారి ప్రసంగంలో గొప్పవిగా చూపుతూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేయడం సిగ్గు చేటు.
• రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. విద్య, వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. నిండా అవినీతిలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు గవర్నర్ గారి నోటితో అబద్దాలు చదివించడం దుర్మార్గం.
• ముఖ్యంగా రైతులకు త్రీ ఫేజ్ కరెంట్ ను 24 గంటలపాటు సరఫరా చేశామనడం పచ్చి అబద్దం. వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ సరఫరా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని నేను గతంలోనే సవాల్ చేసినా స్పందించని ముఖ్యమంత్రి ఈరోజు గవర్నర్ నోటితో కూడా అబద్దం చెప్పించడం బాధాకరం.
• రాష్ట్రంలో రూ.లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం నిర్మించినా ఆయకట్టు ఏమాత్రం పెరగనప్పటికీ 73.33 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం పెరిగిందని పేర్కొనడం దుర్మార్గం.
• రైతు బంధు మినహా కేంద్రం నుండి వస్తున్న సబ్సిడీలను రైతులకు అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే తెలంగాణలో వ్యవసాయ అభివ్రుద్ధి గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతోందని అసత్యాలు గవర్నర్ నోటితో చెప్పించడం సిగ్గు చేటు.
• ఈ ప్రభుత్వ మూర్ఖపు విధానాలతో విద్యుత్ రంగం వేల కోట్ల నష్టాలపాలైంది. ఏ రోజు డిస్కంలు కుప్పకూలుతాయో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని దాచిపెట్టి వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నట్లు ప్రసంగంలో పేర్కొనడం దుర్మార్గం.
• మిగులు ఆదాయంతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పులపాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్ దే. దానిని వక్రీకరించి తలసరి ఆదాయం పెరిగిందని, అన్ని రంగాల్లో రెట్టింపు స్థాయిలో అభివ్రుద్ధి జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అన్యాయం.
• ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నేటికీ ఒక్క శాతం మంది దళితులకు అమలు కాలేదు. అయినప్పటికీ ఈ పథకం ద్వారా దళితులంతా లబ్ది పొందుతున్నట్లుగా చూపడం యావత్ దళిత సమాజాన్ని మోసం చేయడమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీల సంక్షేమానికి సంబంధించి అసత్యాలను గవర్నర్ ప్రసంగంలో చేర్చి ఆయా వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం అవమానపర్చింది.