భవిష్యత్తు లో మరిన్ని పతకాలను సాధించాలి
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్
హైదరాబాద్: విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఐపీఎస్ చేతులమీదుగా పోలీస్ సేవా పతకాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సేవా పతకాలను అందుకున్న వారిని అభినందించారు. ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబరిచిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పతకాలను ఇస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, కొత్త సంవత్సరంలో ఈ పతకాలను అందజేస్తుందన్నారు. 2023 సంవత్సరానికి గాను సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో 138 మంది పోలీసు సిబ్బందికి పతకాలు అందచేశామన్నారు. ఇందులో, 58 ఉత్కృష్ట, 80 సేవా పతకాలు అందచేశామన్నారు. వీరిలో కానిస్టేబుల్ నుంచి ఏడీసీపీ ర్యాంక్ వరకూ ఉన్నారన్నారు.
పోలీసు శాఖలో విధులు నిర్వహించడం, అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎటువంటి రిమార్కులు లేకుండా పతకాలు స్వీకరించడం ఆనందదాయకమని, ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకితభావం, మంచి ప్రతిభ కనబరిచి, ప్రజలకు పోలీసు వారి సేవలను అందించాలని, అదేవిధంగా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా విధులు నిర్వహించాలని సీపీ గారు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా బాగా పనిచేసి ప్రజలకు మెరుగైనా సేవలు అందించి ప్రభుత్వము నుంచి మరిన్ని పతకాలు సాధించాలన్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పతకాలను అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., మాట్లాడుతూ.. సేవా పతకాలను అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. సేవా పతకాలను అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తోటి వారికి ఆదర్శంగా తీసుకుంటారన్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పతకాలను అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. అవార్డు అందుకున్న వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం లేనిది విధుల్లో ఉత్తమ పనితీరు కనబర్చడం సాధ్యం కాదన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్, సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్, డీసీపీ అడ్మిన్ రవి చందన్ రెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, ఏసీపీలు, సీఏఓ అడ్మిన్ గీత, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, సెక్షన్ల సిబ్బంది, మరియు మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.