విద్యార్థులు లేరంటూ 1,864 స్కూళ్లను మూసేసే కుట్ర
పేద, మధ్య తరగతి విద్యార్థులను ప్రభుత్వ విద్య కు దూరం చేసే ప్రయత్నం
టీచర్ల నియామకం, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించటంలో విఫలం
ప్రమాదం అంచున ప్రభుత్వ విద్య. తెలంగాణకు మంచిది కాదన్న కేటీఆర్
ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలి, విద్యాశాఖ కు మంత్రిని నియమించాలి
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కమిటీ ని ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేసిన కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపు గా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసి వేయాలని భావిస్తుండటం సిగ్గుచేటన్నారు. 2024 లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గింది. ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు.
ప్రధానంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్య లేకపోవటంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపుగా 25 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేయటం, టీచర్లను డిప్యూటేషన్ మీద ఇతర స్కూళ్లకు పంపించటంతో చాలా చోట్ల విద్యార్థులకు ప్రభుత్వ విద్య దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి తోడు సరైన మౌలిక వసతులు లేకపోవటం, నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవటం, స్కూళ్లలో, సంక్షేమ వసతి గృహాల్లో శుభ్రత, భద్రత లేని పరిస్థితి నెలకొనటంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటేనే తల్లితండ్రులు భయపడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు.
Also Read-
గత కొన్ని రోజులుగా గురుకుల స్కూళ్లలో జరుగుతున్న సంఘటనలు, వసతి గృహాల్లో విష ఆహారం, భద్రత లేని పరిస్థితులు, విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని కేటీఆర్ అన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ కుంటి సాకులు వెతుక్కుంటుందని విమర్శించారు.
కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను ప్రారంభించటం తో పాటు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించామన్నామన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్, మీడియాన్ని ప్రవేశ పెట్టి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా విద్యా భోదన చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అంతే కాకుండా మన ఊరు- మన బడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్యను అందిచేందుకు దాదాపు రూ. 7,289 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ (సీఎస్ఆర్) ఫండ్స్ ద్వారా కూడా పాఠశాలకు పక్కా బిల్డింగ్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు వ్యవస్థగతంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలపై కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. స్కూళ్లలో డ్రాఫౌట్స్ ను నివారించేందుకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా తెచ్చామన్నారు. ఫలితంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పోటీ పడే పరిస్థితి వచ్చిందన్నారు.
కేసీఆర్ గారు వేసిన బాటను మరింత పటిష్టం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సోయి లేకుండా ప్రవర్తిస్తోందన్నారు. స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గి పోవటానికి కారణాలను అన్వేషించి వాటి నివారణపై దృష్టి పెట్టకుండా స్కూళ్లను మూసివేయటమేమిటనీ ప్రశ్నించారు. అంటే పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు కోవటం రేవంత్ రెడ్డి సర్కార్ కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను సృష్టించి తద్వారా విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేయాలని భావిస్తున్నారా అని కేటీఆర్ నిలదీశారు. అత్యంత ప్రాధాన్యమైన ఈ అంశాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రి కి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ సీఎం కు రాజకీయాలు, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప ప్రజల సమస్యలపై సోయి ఉందా అని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించి సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటానికి కారణాలు, ప్రభుత్వ విద్య ను బలోపేతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కూడిన కమిటీ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలపై దృష్టి సారించకపోతే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ప్రభుత్వం అందించే విద్య పైనే ఆధారపడిన నిరుపేద లక్షలాది విద్యార్థుల తల్లితండ్రులకు అన్యాయం చేస్తామంటే వారే ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని కేటీఆర్ అన్నారు.