భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు, రాహుల్ అన‌ర్హ‌త వేటుపై ఫైర్… ఫైర్… ఫైర్…

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ పాల‌న ఎమ‌ర్జెన్సీ ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. నేర‌స్తులు, ద‌గాకోరుల కోసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై అన‌ర్హ‌త వేటు వేసి మోదీ ప‌త‌నాన్ని కొని తెచ్చుకుంటున్నార‌ని కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై కేసీఆర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కేసీఆర్ పత్రికా ప్రకటన

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు, ఖండించిన మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దును బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం.. రాజ్యాంగాన్ని దుర్వినియోగ‌ప‌ర‌చ‌డ‌మే అని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యంత అప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిలో రాహుల్‌పై వేటు వేశార‌ని, ఇది తొంద‌ర‌పాటు చ‌ర్య అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్రెంచ్ త‌త్వ‌వేత్త వాల్‌టేర్, జ‌ర్మ‌న్ థియాల‌జిస్ట్ మార్టిన్ నిమాల‌ర్ కోట్స్‌ను కేటీఆర్ త‌న ట్వీట్‌లో షేర్ చేశారు.

రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు మార్చి 23వ తేదీ నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ తెలిపారు. ప్ర‌ధాని మోదీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూర‌త్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాహుల్ గాంధీపై వేటు ప‌డింది. నేర‌పూరిత ప‌రువున‌ష్టం కేసులో దోషిగా తేలినందు వ‌ల్లే రాహుల్‌కు అన‌ర్హ‌త త‌ప్ప‌లేదు. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం సెక్ష‌న్ 8 ప్ర‌కారం ఈ చ‌ర్య తీసుకున్న‌ట్లు లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ త‌న లేఖ‌లో తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ 8 ఏళ్ల పాటు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయారు.

నిజాలు మాట్లాడితే సభ నుంచి గెంటేస్తారు, రాహుల్‌ సభ్యత్వం రద్దుపై ఖర్గే వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌స‌భ సెక్రటేరియట్ అన‌ర్హత వేటు విధించారు. లోక్‌స‌భ నుంచి ఆయ‌న్ను డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాహుల్‌ లోక్‌స‌భ స‌భ్యత్వం ర‌ద్దు అయ్యింది. మార్చి 23వ తేదీ నుంచి అన‌ర్హత వేటు అమ‌లులోకి వ‌స్తుంద‌ని లోక్‌స‌భ సెక్రటేరియట్ తెలిపారు. కాగా, రాహుల్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్పందించారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేశారు. వారు (బీజేపీని ఉద్దేశిస్తూ) నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరినీ సభ నుంచి గెంటేస్తారు. కానీ, మేము నిజాలు మాట్లాడుతూనే ఉంటాం. హిండెన్‌బ‌ర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్‌ చేస్తున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బెదిరింపులకు భయపడము.. మౌనంగా ఉండము. మా డిమాండ్లు కొనసాగిస్తూనే ఉంటాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అని’ అని ఖర్గే స్పష్టం చేశారు.

రాహుల్‌ గాంధీ బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే ముద్ర చాలా దారుణం అని ఖర్గే అన్నారు. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ.. వీళ్లంతా బలహీన వర్గాల వారా..? అని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ అంశంలో న్యాయపరంగా, రాజకీయంగా ముందుకెళ్తామని చెప్పారు.

ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటక లో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..?’ ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కోర్టుకు వెళ్లింది. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో గురువారం విచారణ జరిపిన సూరత్‌ కోర్టు (Surat Court) రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రెండేండ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలోనే నిబంధనల ప్రకారం.. లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌పై అనర్హత వేటు విధించారు.

నేర నిరూపణ రుజువైతే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేండ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే తీర్పు వచ్చిన క్షణం నుంచి వారు ఆ పదవికి అనర్హులవుతారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఆరేండ్లపాటు అనర్హులుగా ప్రకటిస్తారు.

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం దుర్మార్గం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని… అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని ధ్వజమెత్తారు. దేశం అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని అన్నారు. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందని.. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని ప్రశ్నించారు. మోదీ కాల గర్భంలో కలిసిపోతారని శాపనార్థాలు పెట్టారు. రాహుల్‌కు తాము అంతా అండగా ఉంటామని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారని.. దాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మోదీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదానీ – మోదీ చీకటి స్నేహంపై రాహుల్ గాంధీ నిలదీశారన్నారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీపై కుట్ర… ఎంపీ కోమటిరెడ్డి

ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ బ్లాక్ డే. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు బీజేపీ కుట్ర. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గారి ఇమేజ్ మరింత పెరిగింది. జోడో యాత్రలో ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజలందరూ రాహుల్ కు అండగా ఉంటారు. ఆయనపై అనర్హత వేటు రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమే. ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే.
కేంద్ర వైఫల్యాలను ప్రశ్నిస్తే కుట్రలకు పాల్పడడం సబబు కాదు. అదానీ ఇష్యూని డైవర్ట్ చేసేందుకే రాహుల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్షాలను అణచివేయడం బీజేపీ వల్ల కాదు. రాహుల్ గాంధీ కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఆయనో శక్తి. కాంగ్రెస్ శ్రేణులు దీనిపై పోరాటం సాగించాలి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X