హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖను గురువారం దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం వద్ద విడుదల చేశారు.
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16న పీపుల్స్ మార్చ్ చేపట్టి దేవరకొండ వరకు అనేక జిల్లాలు నియోజకవర్గాలు వందల గ్రామాలు కాలినడకన తిరిగిన సందర్భంగా వందల మంది ప్రజలు క్షేత్రస్థాయి పోలీసులు పెడుతున్న వేధింపులు, ఇబ్బందులను నా దృష్టికి తీసుకువచ్చారు.
క్షేత్రస్థాయి పోలీసుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందని గ్రహించి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశాను. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ఆదేశాలను అమలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీకి ప్రైవేటు సైన్యంగా మారింది.
పోలీసు ఉన్నతాధికారులైన డిజిపి, ఐజి, డిఐజి, ఎస్పీ లాంటి అధికారులతో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు డీ లింకు అయ్యి ఉన్నతాధికారులు చెప్పినట్టుగా కాకుండా అధికార పార్టీ స్థానిక శాసనసభ్యులు ఆదేశాలను పాటిస్తూ వారికి అటాచ్ అయిపోయి వారిచే ఆదేశాలను అమలు చేసే పోలీసులుగా రాష్ట్రంలో మారిపోయారు.
క్షేత్రస్థాయి పోలీసులు అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ప్రైవేటు సైన్యంగా మారిపోవడంతో సమాజంలో అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయారు. క్షేత్రస్థాయి పోలీసులు అధికార పార్టీ శాసనసభ్యులు చెప్పినట్టుగా నడుచుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
ప్రశ్నించే గొంతుకలు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల వాదులు, రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా భావజాలాన్ని వ్యాప్తి చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు అధికారులు అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ఇష్టా ఇష్టాల ప్రకారమే నడుచుకుంటే సమాజంలో బతికే పరిస్థితి లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ పార్టీల కోసం కాదు.
ప్రజాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.