హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్వర్యంలో మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాలు రవీంద్రభారతీలో ఘనంగా జరుగుతున్నాయి. ముగింపు వేడుకల్లో దాశరథి సాహిత్య సప్తాహం పేరుతో నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ కవి, కవి యాత్ర వ్యవస్థాపకులు డా. కారం శంకర్ శుక్రవారం ‘మనిషి మరణిస్తున్నాడు’ శీర్షికతో చదివిన కవిత్వం సభికులను ఎంతో ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి, పరిశోధకులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ అతిథులుగా హాజరై కారం శంకర్ ని సన్మానించారు.
Also Read-
మనిషి మరణిస్తున్నాడు
స్వార్థపు కుళ్లు, కుతంత్రాల బంధనాల్లో
ప్రతి క్షణం మనిషి మరణిస్తున్నాడు.
సూర్యోదయంతో మొదలై
సూర్యాస్తమయంతో ముగిసే జీవితం –
ఒక నిరంతర మరణ గాధే!
మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవాలి.
మరణం అంటే కేవలం శ్వాస ఆగిపోవడమే కాదు –
బతికున్నవాళ్ల ధ్యాసలో,
వారి శ్వాసల్లో నిలిచిపోవడమే నిజమైన జీవితం.
నీ రూపాన్ని కళ్ల నిండా నింపుకొని,
నీ గుణగణాలను మననం చేసుకుంటూ,
నీతో ఆత్మీయంగా పంచుకున్న సమయానుబంధాన్ని తలుచుకుంటూ,
నీ సాంగత్యాన్ని
ఆనందక్షణాల్లోనూ, దుఃఖసమయాల్లోనూ గుర్తు చేసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండటం కోసం
మంచి ఆహారం తీసుకున్నట్టే,
నీ ప్రతి చర్య ద్వారా
నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవాలి
నువ్వు మనిషివి
మనిషిగా జీవించు,
మనిషిగా ప్రేమించు.
భూమ్మీద సకల చరాచర జీవజాతులు
బతుకుతున్నాయి.
కానీ మనిషిగా బ్రతకడం అంటే,
భౌతికంగా మాత్రమే జీవించడం కాదు –
మరణించిన తరువాత కూడా
జీవిస్తూ ఉండటం,
అదే నిజమైన మరణానంతర జీవితం.
ఎదురుగా ఎడతెగని దుఃఖాల సంద్రం వున్నా,
దానిని సులువుగా ఈదిపోవచ్చు.
నాతో రా…
జీవించడం ఎలాగో చూయిస్తాను.
క్షమించడం ఎలాగో చెబుతాను.
మనిషిని , ప్రకృతిని సకల జీవ జాలాన్ని ప్రేమించడం ఎలాగో నేర్పిస్తాను.
– డా. కారం శంకర్
