- బడ్జెట్ లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించండి
- అసెంబ్లీ వేదికగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి
- అతిపెద్ద నాగోబా జాతరను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వం
- గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన
- ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కట్ర చేశారు
- పోడుభూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి
- ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర
- తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివ్రుద్ధిని అడ్డుకుంటున్నడు
- బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తాం
- అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తాం
- నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లు నిర్మిస్తాం… రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
- కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కలిసి నాగోబా జాతరను సందర్శించిన బండి సంజయ్
- ఘన స్వాగతం పలికిన గిరిజనులు… దర్బార్ కు హాజరైన నేతలు
హైదరాబాద్ : ‘‘కేసీఆర్… ఇదే మీకు ఆఖరి అవకాశం. మళ్లీ మీరు అధికారంలోకి వచ్చేది లేదు. రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు సహా ఎన్నో హామీలిచ్చారు. ఈ బడ్జెట్ లోనైనా వాటికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సూచాంచారు. అట్లాగే రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు? దళితులకు ఎంతమందికి మూడెకరాలిచ్చారు? వంటి అంశాలన్నింటికీ అసెంబ్లీ వేదికగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీలు పవిత్రంగా జరుపుకునే అతిపెద్ద నాగోబా జాతరలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, ప్రత్యేక నిధులు కేటాయించకుండా గిరిజనుల జాతరను విస్మరించారని మండిగపడ్డారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన అని, ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కట్ర చేశారని అన్నారు. పోడుభూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివ్రుద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అట్లాగే రాష్ట్రంలో అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తామని, నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లు నిర్మిస్తాం… రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని చెప్పారు.
కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి ఈరోజు ఉదయం నాగోబా జాతరకు విచ్చేసిన బండి సంజయ్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ వందనంతో అర్జున్ ముండా, బండి సంజయ్ లకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మెస్రం వంశం పక్షాన బండి సంజయ్ కు, అర్జున్ ముండాకు ఆదివాసీలు స్వాగతం పలికారు. బండి సంజయ్ రాకతో నాగోబా జాతరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా జాతర ‘‘దర్బార్’’ కు హాజరై ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు.
అందరికీ నాగోబా జాతర శుభాకాంక్షలు. నాగోబా ను సందర్శించి ఆశీర్వాదం తీసుకోవడానికి మేం ఇక్కడికి వచ్చాం. దేశంలోనే అతిపెద్ద 2వ జాతర నాగోబా. ఇక్కడికి వచ్చి నాగోబాను సందర్శించుకోవడం పూర్వ జన్మసుక్రుతం. ప్రతి ఒక్కరిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే హిందూ ధర్మం. సర్వేజన సుఖినోభవంతు అనే మన హిందూ ధర్మంలో పుట్టడం మన అద్రుష్టం.
ఇంత పెద్ద నాగోబా జాతరకు 5 రాష్ట్రాల నుండి జనం వస్తున్నారు. ఆదివాసీలకు అత్యంత పవిత్రమైన పండగకు ఎలాంటి ఏర్పాట్లు, సౌకర్యాలు లేకపోవడం బాధాకరం. కనీసం ఈ జాతరకు సీఎం కేసీఆర్ ఎన్నడూ రాడు. ‘జల్ జమీన్ జంగల్’ నినాదమిచ్చి కొమరం భీం వారసులు నిర్వహించుకునే గొప్ప పండుగకు సౌకర్యాలు కల్పించడం లేదు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన నిజాం వారసుడు పరాయి దేశంలో చనిపోతే హైదరాబాద్ కు తీసుకొచ్చి అత్యున్నత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న కేసీఆర్ ఆదివాసీలను ఎందుకు పట్టించుకోవడం లేదు?
జోడేఘాట్ కు రూ.100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్… నాగోబా ఆలయ అభివ్రుద్ధిని పూర్తిగా విస్మరించారు. మెస్రం వంశీయులే తలా రూ.5 వేల, 10 వేల చొప్పున విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించుకున్నారంటే కేసీఆర్ కు ఆదివాసీలంటే ఎంత చులకనో అర్ధమవుతోంది. ఈ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు. ఆసుపత్రుల్లేవు. కాళేశ్వరం పేరుత్ మాత్రం దోచుకుతిన్నడు.
ఇక్కడ పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. కుర్చీ వేసుకుని పట్టాలిస్తానన్న కేసీఆర్ పత్తా లేడు. అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య కొట్లాట పెడుతున్నడు. పంట చేతికొచ్చే సమయానికి ఫారెస్ట్ అధికారులను ఉసిగొల్పి లాఠీఛార్జ్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నడు. ఖమ్మంలో బాలింతలు, పసిపిల్లలని చూడకుండా జైలుకు పంపిన దుర్మార్గుడు కేసీఆర్.
తండాలను గ్రామ పంచాయతీలను చేసిన కేసీఆర్ ఇప్పటికీ అదనంగా పైసా ఇచ్చిన దాఖలాల్లేవు. పైగా పంచాయతీల్లో కేంద్రం నేరుగా నిధులు పంపితే… సర్పంచులకు తెలియకుండా ఆ నిధులను తస్కరించిన దొంగ కేసీఆర్. దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని ఒక్కరికీ ఇయ్యలే. ఇచ్చిన హామీ నెరవేర్చని కేసీఆర్… ప్రశ్నించే వాళ్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి? కేసులు పెట్టాలి? పోరాడుతున్న బీజేపీ నేతలను ఎట్లా బదనాం చేయాలి? వాళ్ల పిల్లలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్నదే కేసీఆర్ యోచన తప్ప ప్రజల గురించి పట్టించుకోరు. ప్రధాని నరేంద్రమోదీ లక్షలాది ఇండ్లకు నిధులిస్తే… గిరిజనులకు ఎందుకు ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదు? గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లకు ముడిపెట్టి అమలు కాకుండా కుట్ర చేసిండు.
కేసీఆర్ కు ఇదే ఆఖరు అసెంబ్లీ సమావేశాలు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు… సచ్చేది లేదు… ఇప్పటికైనా కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు అసెంబ్లీ బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. అసెంబ్లీ వేదికగా ఎంతమంది డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించావు? ఎంతమందికి ఉద్యోగాలిచ్చినవ్? ఎంతమందికి నిరుద్యోగ భ్రుతి ఇచ్చినవ్? ఎంతమందికి దళిత బంధు, దళితులకు మూడెకరాలిచ్చినవ్? కరెంట్, బస్ ఛార్జీలు ఎందుకు పెంచినవ్? ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ సమాధానం చెప్పాలి.
నరేంద్రమోదీ కేబినెట్ లో 8 మంది ఎస్టీలకు చోటు కల్పించారు. పేదల పెన్నిధి మోదీ. ఆదివాసీ ముద్దుబిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. కేసీఆర్ మాత్రం ఆదివాసీ అభ్యర్ధిని ఓడగట్టేందుకు అన్ని కుట్రలు చేశారు. కేసీఆర్ ఫ్రభుత్వం అన్ని వర్గాలను, జాతులను మోసం చేశారు. ప్రజలకు అర్ధం కావడంతో దివాళా తీసిన కంపెనీ మాదిరిగా టీఆర్ఎస్ పేరును ఎత్తేసి బీఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం తెరిచారు.
తెలంగాణ నినాదాన్ని వాడుకుని ‘జై తెలంగాణ’ అని ఊసెత్తని ద్రోహి కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ది చెప్పాలి. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండి. అధికారంలోకి వచ్చాక నాగోబా జాతరను దేశ ప్రజలు గర్వించేలా, గిరిజన జాతి అబ్బురపడేలా ఘనంగా నిర్వహించి తీరుతాం. వచ్చే ఏడాది బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నాగోబా జాతరను అధికారికంగా జరపడంతోపాటు ఆదివాసీలు గర్వపడేలా భక్తియుత ధార్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యంతోపాటు నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లను నిర్మిస్తాం. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తాం. గిరిజన జాతి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం.