-ఆర్ధిక ప్రగతిలో దూసుకెళుతున్నాం
-అవినీతిరహిత, బాంబు పేలుళ్లు, హింసకు తావులేని పాలన సాగుతోంది
-అట్టడుగునున్న పేదల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారు
-ప్రపంచ దేశాలన్నింటికీ ‘‘మోదీ ది బాస్’’ గా మారారు
-మహజన్ సంపర్క్ అభియాన్ పేరుతో గడప గడపకూ మోదీ పథకాలను తీసుకెళ్లండి
-బీజేపీ నేతలకు బండి సంజయ్ కుమార్ పిలుపు
-కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ
-సంపర్క్ అభియాన్ పేరిట చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ
-మహిళా మోర్చా నేతలతోనూ సమావేశమైన బండి సంజయ్
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ అభ్యున్నతితోపాటు ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలపై ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ పేరిట గడప గడపకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్ లోని ఓ హోటల్ లో బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా ఇంఛార్జీ చాడా సురేష్ రెడ్డి, మాజీమంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బోడిగె శోభ, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, సత్యానారాయణ, ప్రతాప రామక్రిష్ణ, మోహన్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
• ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘గత యూపీఏ హయాంలో 2జీ, కోల్, స్ర్పెక్టమ్ సహా పెద్ద ఎత్తున స్కాంలు జరిగాయి. అవినీతి తాండవించేది. ఎక్కడ చూసినా బాంబు బ్లాస్టులు, అలజడితో ప్రజలు భయాందోళనలో ఉండేవాళ్లు. మోదీ వచ్చాక అవినీతిరహిత పాలన కొనసాగుతోంది. బాంబు పేలుళ్లు, హింసకు తావులేకుండా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడటమే కాకుండా దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆస్ట్రేలియా ప్రధాని సహా యావత్ ప్రపంచమంతా మోదీ ది బాస్ అంటూ కీర్తిస్తున్నాయి. పపువా న్యూగినియా ప్రధాని ఏకంగా మోదీకి పాదాభివందనం చేయడమే ఇందుకు నిదర్శనం’’అని పేర్కొన్నారు.
• ‘‘మోదీ హయాంలో 74 ఎయిర్ పోర్టులను నిర్మించి చౌక ధరకే సామాన్యులు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు. 9 ఏళ్లలో 53 వేల కి.మీలకుపైగా రోడ్లను విస్తరించారు. ప్రపంచ స్థాయికి అనుగుణంగా 20 వందే భారత్ రైల్వేలను. 15 మెట్రో రైళ్లను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే లైన్లను ఆధునీకకరించారు. కరీంనగర్ –వరంగల్ రైల్వే లైన్, మహబూబ్ నగర్ – విశాఖపట్నం రైల్వే లైన్ మంజూరయ్యాయి. గతంలో 7 ఎయిమ్స్ ఉంటే.. మోదీ హయాంలో 15 ఎయిమ్స్ ను కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణలో ఒకటుంది. 7 కొత్త ఐఐటీలతోపాటు పెద్ద ఎత్తున వర్శిటీలను ఏర్పాటు చేశాం.
పీఎం గతిశక్తి పేరిట పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించారు. 1.90 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఫలితంగా ఆర్దిక ప్రగతిలో 10 స్థానంలో ఉన్న భారత్ నేడు ఇంగ్లాండ్ ను అధిగమించి 5వ స్థానానికి చేరుకుంది.’’అని వివరించారు. ‘‘యెమన్, సిరియా, ఆప్ఝనిస్తాన్, నేపాల్, సూడాన్ లో ఉన్న దాదాపు 20 వేల మందిని భారత ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవిడ్ సందర్భంగా విదేశాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 2.97 కోట్ల మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలోనే జీ-20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తుండటం మనందరికీ గర్వకారణం’’అని అన్నారు.
• పేదల విషయానికొస్తే…. ‘‘పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల మంది ఇండ్లను నిర్మించారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మందికి టాయిలెట్లను నిర్మించారు. జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా శుద్ద మంచినీరు అందించారు. ఉజ్వల యోజన కింద 9 కోట్ల 60 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా రేషన్ అందించారు’’అని పేర్కొన్నారు.
• ‘‘బ్యాంకు ఖాతాలు లేని 78 కోట్ల 50 లక్షల మంది నిరుపేదలకు జీరో బ్యాలెన్స్ తో ‘జన్ ధన్ యోజన ఖాతా’ తెరిపించడంతో వారంతా ఏటా 2 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. గతంలో ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే లబ్దిదారుడి వద్దకు వచ్చే సరికి 15 పైసలే అందేవి. రూపాయికి 85 పైసల అవినీతి జరిగేది. మోదీ హయాలో డీబీటీ విధానాన్ని తీసుకొచ్చి లబ్దిదారుల ఖాతాల్లోనే నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందే నగదును జమ చేస్తున్నారు. తద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించారు’’ అని వివరించారు.
• ‘‘ప్రపంచంలోనే అత్యధిక పెద్దదైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టి రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అధ్యయనం చేస్తున్నారు.జన ఔషధి కేంద్రాల ద్వారా 9 వేల 3 వందలకుపైగా రకాల మందులను చౌక ధరకే అందిస్తున్నారు. రూ.6338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించి రైతులకు కొరత లేకుండా ఎరువులు అందిస్తున్నారు. పెద్ద ఎత్తున సబ్సిడీపై ఎరువులను రైతులకు అందిస్తున్నారు. కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతుల అకౌంట్లో నేరుగా రూ. 6 వేల జమ చేస్తున్నారు’’అని తెలిపారు.
మహజన్ సంపర్క్ అభియాన్ సందర్భంగా గడప గడపకూ ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాబోయే నెల రోజులపాటు మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను బండి సంజయ్ వివరించారు. అనంతరం జిల్లా మహిళా మోర్చా నేతలతోనూ బండి సంజయ్ సమావేశమై మహిళా అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి విస్త్రతంగా తీసుకెళ్లాలని కోరారు.