గౌరవ అధ్యక్షా!
ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో వరుసగా నాల్గవసారి 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం నాకు కల్పించిన తెలంగాణ ప్రజానీకానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం – డా.బి.ఆర్.అంబేద్కర్
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ మా పాలన సాగిస్తున్నాం. మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం.
- మనల్ని మనం తెలుసుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే, ఇతరులకు సేవ చేయడంలో మనల్ని మనం మరిచిపోవడం…. అని ఆనాడు మహాత్మాగాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ రెండేళ్ళ పాలనలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను, వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం.
- గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాము. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాము.
- అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ రెండేళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ధీరోదాత్తుడు ఎన్నడూ తనకెదురైన అవరోధాలకు బెదరడు. అవరోధాలనే అవకాశాలుగా మలచుకొని ముందుకు సాగుతాడు. మేమెంచుకున్న లక్ష్యాలవైపు అడుగులేయడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, లెక్క చేయక ముందుకు సాగుతున్నాం.
- ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును, తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నాం. ప్రతి పైసకు మేం కాపలాదారులుగా ఉంటున్నాం. ఆదర్శవంతమైన పాలనలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం.
- సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్ఠమైన ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలుచేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా… తెలంగాణ ప్రజానీకం పట్ల, వారి అభ్యున్నతి పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ ను రూపకల్పన చేశాము.
బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితి గతుల మార్పుకు దోహదపడే లెక్కలు. - తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాము. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకతతో పాలన సాగిస్తున్నాము. గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పని చేస్తుంది.
- మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం… ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా… బాధ్యతతోనే వారికి సమాధానం చెబుతాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి.
- అనేక సవాళ్ళు మరియు ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం “బూడిదలో నుంచి ఫీనిక్స్ పక్షి మళ్ళీ లేచినట్లు” అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతోంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాము. ఈ బడ్జెట్ లో రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకి నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాము.
- తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకు, పండుగలకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను మా ప్రభుత్వం సత్కరించింది. అందెశ్రీ రచించిన “జయజయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు శ్రామిక మహిళ రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించాం. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాము. వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించాము. కోయ వంశీయుల చరిత్రను ఆ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా ఆదివాసీ పద్ధతిలో చెక్కించాము. తెలుగు చలన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో అవార్డులను అందజేస్తున్నాం.
- ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహార్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాము. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు స్వయంగా జపాన్, సింగపూర్, దావోస్ పర్యటనలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో సమావేశమై మెప్పించి, ఒప్పించడం వల్ల గత రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాము.
రాష్ట్ర ఆర్థిక స్థితి: - 2025-26 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం 17 లక్షల 82 వేల 198 కోట్ల (17,82,198 కోట్లు) రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదు అయ్యింది. ఇదే సమయంలో, దేశ GDP 3 కోట్ల 57 లక్షల 13 వేల 886 కోట్ల (3,57,13,886 కోట్లు) రూపాయలు కాగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. అదే విధంగా దేశ GDPలో రాష్ట్ర GSDP 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’ గా తెలంగాణ నిలుస్తోంది.
- భారతదేశ వృద్ధిరేటు తగ్గుతూ మందగమనంలో ఉన్నప్పటికీ, మన రాష్ట్ర వృద్ధిరేటులో మెరుగైన పెరుగుదల కనబడుతోంది. ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.8 శాతంగా ఉన్న దేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు, 2025-26 నాటికి 8 శాతానికి పడిపోయింది. కానీ, సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) వృద్ధిరేటు 2024-25 లో 10.6 శాతం నుంచి 2025-26 నాటికి 10.7 శాతానికి పెరిగింది. దీని ద్వారా, మన ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరియైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అనడానికి నిదర్శనం.
తలసరి ఆదాయం: - రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4 లక్షల 18 వేల 931 రూపాయలు (రూ.4,18,931) కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. దేశ తలసరి ఆదాయం 2 లక్షల 19 వేల 575 రూపాయలు (రూ.2,19,575) కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1 లక్ష 99 వేల 356 రూపాయలు (రూ.1,99,356) ఎక్కువ. అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది.
3 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థ
“Dream, dream, dream. Dreams transform into thoughts and thoughts result in action.” …Dr. A. P. J. Abdul Kalam - ప్రస్తుతం 200 బిలియన్ US డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ US డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాలవారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాం.
కేంద్ర ప్రాయోజిత పథకాలు (CSS): - గత ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) నిధులను సరైన రీతిలో వినియోగించలేదు. కేంద్రం నుంచి మంజూరైన నిధులను కూడా ఆయా పథకాల అమలుకు ఖర్చు చేయకుండా, ఇతర అవసరాలకు నిధులు దారి మళ్లించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి వాయిదాలు నిలిచిపోయి, తెలంగాణకు తీరని నష్టం జరిగింది.
- మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని వెంటనే గుర్తించి 2014-15 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) కింద బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు 3 వేల కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయటం జరిగింది.
- మన రాష్ట్ర అభివృద్ధి కోసం కో-ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, 2021-22 సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS) ద్వారా వచ్చిన నిధులు 4 వేల 826 కోట్ల రూపాయలు కాగా, మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా 7 వేల 72 కోట్ల రూపాయలను సాధించింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ, మరిన్ని నిధులను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుంది.
రుణ పునర్వ్యవస్థీకరణ (Debt Restructuring) - ఏ రాష్ట్రానికైనా ఆర్థిక క్రమశిక్షణ అనేది అభివృద్ధికి మూలాధారం. రాబడికి మించి చేసే అప్పులు ఆ ఆర్థిక వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు, గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించింది. అంతేకాకుండా, రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20 – 39 సంవత్సరాలకు పొడిగించింది. ఈ రుణ పునర్ వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుండి 2031-32 దాకా చెల్లించాల్సిన 34 వేల 58 కోట్ల రూపాయల నుంచి 11 వేల 915 కోట్లకు తగ్గింది. దీనిద్వారా, రాష్ట్రానికి 22 వేల 142 కోట్ల రూపాయలు క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగింది.
- గతంలో TUFIDC సంస్థ 10.2 శాతం వడ్డీతో తీసుకున్న 172.02 కోట్లు. తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పోరేషన్ 9.7 శాతం వడ్డీతో తీసుకున్న 2,204.06 కోట్ల రూపాయల రుణాలను 8.6 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నాం.
- దీనిద్వారా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నాం.
16వ ఆర్థిక సంఘం: - కేంద్రానికి పన్నుల రూపంలో మనం ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తుంటే… తిరిగి కేంద్రం పన్నుల పంపకాల ద్వారా మనకు ఇస్తున్నది మనం కట్టే ప్రతి రూపాయిలో సగటున 42 పైసలే. జనాభా నియంత్రణ పాటిస్తూ, సొంత రాబడి పెంచుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు ఈ పంపకం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోంది.
- ఈ చారిత్రక లోపాన్ని సరిదిద్దేందుకు మన ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనను వినిపించింది. తద్వారా కేంద్ర పన్నుల పంపకం ఫార్ములాలో కేవలం జనాభా, ఆదాయ వ్యత్యాసాల లాంటి అంశాలనే కాకుండా… ‘రాష్ట్ర GSDP’ ని కూడా ఒక కీలక కొలమానంగా పరిగణనలోకి తీసుకునేలా మెప్పించి, ఒప్పించడంలో మన ప్రభుత్వం విజయం సాధించింది. దీని ద్వారా, తెలంగాణ వాటాను 2.102 శాతం నుండి 2.174 శాతానికి పెంచడం జరిగింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే భవిష్యత్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025” ను డిసెంబర్ 8-9 తేదీలలో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో విజయవంతంగా నిర్వహించాం. ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్య వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 వేల మంది అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక రంగ నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు.
- ఈ సమ్మిట్‌లో నోబెల్ బహుమతి గ్రహీతలు ఆర్థికవేత్త శ్రీ అభిజిత్ బెనర్జీ, సామాజికవేత్త శ్రీ కైలాష్ సత్యార్థి, ఆర్బిఐ మాజీ గవర్నర్లు శ్రీ దువ్వూరి సుబ్బారావు, శ్రీ రఘురామ్ రాజన్, ఆర్థిక వేత్త శ్రీ అరవింద్ సుబ్రమణియన్, యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి శ్రీ జెరెమీ జర్గెన్స్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా పరిశ్రమల రంగం నుంచి శ్రీ శంతను నారాయణ్, శ్రీ ఆనంద్ మహీంద్రా, శ్రీ ప్రేమ్ వాట్సా, శ్రీ ఎరిక్ స్వైడర్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు.
- ఈ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్–2047 పత్రాన్ని అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ విజన్ పత్రం CURE- PURE- RARE అనే మూడు ప్రాంతాల ఆధారంగా సమతుల్య, సుస్థిర అభివృద్ధి సాధించడానికి రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది.
- సమ్మిట్ సందర్భంగా దాదాపు 100 పైబడి MoU లు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా సుమారు 5 లక్షల 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు తమ ఆసక్తిని వ్యక్త పరిచారు. హైదరాబాద్ లో SAFRAN-CFM అంతర్జాతీయ ఏరో క్రాఫ్ట్ ఇంజన్ యెక్క ‘మెయింటనెన్స్, రిపేర్ మరియు ఓవర్‌హాల్ (MRO)’ సదుపాయ కేంద్రాన్ని ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ప్రభుత్వ విజయం.
- గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దావోస్ లో ‘నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030’ ను ఆవిష్కరించారు. ఈ పాలసీ లక్ష్యం 2030 నాటికి AI పరిశోధనాభివృద్ధి మరియు ఆధునిక తయారీ రంగాలలో తెలంగాణను ప్రపంచంలో మొదటి ఐదు లైఫ్ క్లస్టర్లలో ఒకటిగా నిలపడం. ఈ రంగంలో ఇప్పటి దాకా 73 వేల 360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాము. దీనివలన ఒక లక్ష మందికి ప్రత్యక్షంగా మరియు 2 లక్షల 50 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించబడతాయి.
- సింగపూర్‌కు చెందిన AGIDC, వియత్నాంకు చెందిన విన్ గ్రూప్, JCK ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థల నుంచి మొత్తం 1 లక్ష 3 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి.
వినూత్నంగా విధాన నిర్ణయాలు: - ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడానికి, ఆ అభివృద్ధికి ప్రజలను వారసులను చేస్తూ ముందుకు సాగడానికి అంతర్జాతీయ స్థాయిలో, ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని CURE, PURE, RARE అనే మూడు ప్రధాన ప్రాంతాలుగా గుర్తించాం.
- CURE లో సేవా రంగానికి, PURE లో ఉత్పాదక రంగానికి, RARE లో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): - హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల CURE ప్రాంతంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, పరిశోధన, అభివృద్ధి స్టార్టప్, ఫైనాన్షియల్ సర్వీసు సంస్థలు మరియు ఇతర సర్వీసు సెక్టార్లను అధిక విలువైన సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. తెలంగాణలో పట్టణ జనాభా 2031 నాటికి 53.8 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో CURE ప్రాంత పరిధిని కాలుష్య రహితంగా (నెట్ జీరో) మార్చేందుకు కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా HILT పాలసీ (Hyderabad Industrial Lands Transformation Policy) కింద కాలుష్య కారక పరిశ్రమలను ORR బయటకి తరలించేందుకు మరియు Single Use ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. CURE పరిధిలో ప్రస్తుతం ఉన్న పెట్రోలు/డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రభుత్వ ఖర్చుతో మారుస్తాము.
PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ): - ఔటర్ రింగ్ రోడ్ (ORR) రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని మాన్యుఫాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, MSME క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు, పారిశ్రామిక పార్కులు ఏర్పడేలా చర్యలు తీసుకుంటాం. దీనిద్వారా, ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ ప్రాంతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తయారీ కేంద్రంగా (Manufacturing Engine) మారనుంది.
RARE (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ): - రీజినల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలను వ్యవసాయ వాల్యు యాడెడ్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయం, పర్యావరణ-పర్యాటక రంగం (Eco-tourism) పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరిగి, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది.
GHMC పునర్ వ్యవస్థీకరణ: - హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఔటర్ రింగ్‌రోడ్డు అవతల, లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పోరేషన్లను విలీనం చేస్తూ జీహెచ్ఎంసి ప్రాంతాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించి, నగరంలో సమ్మిళిత మరియు సమాన అభివృద్ధిని సాధించే దిశగా, మన ప్రభుత్వం జీహెచ్ఎంసీ (GHMC)ని కొత్త డివిజన్లు మరియు బ్లాక్‌లతో కూడిన గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మరియు మల్కాజిగిరి అనే మూడు (3) నగరపాలక సంస్థలుగా (కార్పొరేషన్లుగా) విభజించింది. అనేక పాలనాపరమైన సంస్కరణలతో పాటు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం సమర్థులైన అధికారులను నియమించడం జరిగింది.
- ఈ పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ, స్థానిక స్థాయిలో జవాబుదారీతనం పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పౌరులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు, హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సంస్థ, హైడ్రా వంటి సంస్థలన్నింటినీ సమన్వయ పరిచే ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి తగిన చట్ట సవరణ చేయాలని నిర్ణయించాం. ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నది.
పోలీసు కమీషనరేట్స్ పునర్ వ్యవస్థీకరణ: - హైదరాబాద్ మహానగర ప్రాంతంలోని పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఈ ప్రాంత పోలీసు వ్యవస్థ పరిధిని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ అనే నాలుగు కమీషనరేట్లుగా పునర్ వ్యవస్థీకరించాము.
భారత్ ఫ్యూచర్ సిటీ : - హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగి ఉంది. ఆనాటి కుతుబ్ షాహీల నుండి, నిజాం పాలకుల వరకు.. ఆధునిక కాలంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వంటి అద్భుతాలతో ఈ నగరం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. నేడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ మరో చారిత్రాత్మక అడుగు వేస్తోంది, అదే 30 వేల ఎకరాలలో ఏర్పాటు చేసే “భారత్ ఫ్యూచర్ సిటీ”. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది.
- అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుంటే, ఈ నగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలిచి, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది.
ఉద్యోగ నియామకాలు: - తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది. TGPSC ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షా పత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన TGPSC నవ్వులపాలు అయింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే UPSC స్థాయిలో TGPSCని పునర్ వ్యవస్థీకరించి, నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి, ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం జరిగింది.
- తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు వీలుగా రాష్ట్రంలో సివిల్స్ సాధించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ CSR నిధుల ద్వారా సివిల్స్ మెయిన్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ సహాయం అందుకున్న అభ్యర్థులలో 51 మంది ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యారు. వారికి అదనంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాం. వారిలో 20 మంది UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించి, తెలంగాణ రాష్ట్ర యువత, తమ సత్తాను చాటి చెప్పారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: - తెలంగాణ రాష్ట్రం లో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం… అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది… సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది.
- ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే… ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతాభావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యంకాని రీతిలో, కనివిని ఎరుగని ఒక మహాత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నాం.
- సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ను నూతనంగా ప్రవేశపెడ్తున్నాము.
ప్రజావాణి: - ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, పరిపాలనలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో ప్రజలు వినతులను నేరుగా సమర్పించే అవకాశాన్ని కల్పించాం.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక: - ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది.
- ఈ కార్యక్రమము 2026, మార్చి6 నుంచి జూన్ 12 వరకు సాగుతుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల వరకు పరిశుభ్రత-ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు సేప్టీ, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్-కు-నో, రైతు సంక్షేమం–వ్యవసాయం, విద్య, యువత–క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి పది అంశాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాం.
భూ భారతి చట్టం: - గత ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన ధరణితో రైతులు అలవికాని కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టం-2025 ను అమలు చేసింది. ఈ చట్టం ద్వారా ప్రత్యేకమైన ‘భూధార్’ భూమి గుర్తింపు వ్యవస్థతో పాటు AI ఆధారిత ‘భూ మిత్ర’ చాట్ బాట్ ను ప్రవేశ పెట్టింది. గ్రామ స్థాయిలో భూ పరిపాలనను బలోపేతం చేయడానికి 5,010 గ్రామ పాలనాధికారులతో సహా 8 వేల 900 మంది సిబ్బందిని నియమించాము. అదనంగా 5,520 లైసెన్సుడ్ సర్వేయర్లు తమ సేవలను అందిస్తున్నారు. ఈ సంవత్సరం 3 లక్షల 76 వేల కొత్త పట్టాదారు పాసుబుక్స్ జారీ చేయబడ్డాయి. భూ భారతి చట్టం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్, రెవిన్యూ, సర్వే సేవలను ఒకే వేదిక పైకి తీసుకొని వచ్చాము. దీనితో రైతుల సమస్యలకు త్వరిత పరిష్కారం అందించే అవకాశం కలిగింది.
జనగణన – 2027 - పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. దీనిలో స్వీయ నమోదు (Self Enumeration) విధానం, కుల గణన అంశం ఉన్నాయి.
- మొదటి దశ జనగణన 2026 మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుంది. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు. తదుపరి, మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్‌గా తీసుకుంటారు.
అభయ హస్తం: - ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రజా ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ప్రజాహిత పథకాలను అమలుపరుస్తోంది. కనీస సదుపాయాలు కూడా లేని వారికి ఉపయోగపడే విధంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలు, పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి.
మహాలక్ష్మి పథకం: - మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరచిన మొదటి వాగ్దానం– ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలోని 34 లక్షల 37 వేల మంది ఆడ బిడ్డలు ఉచితంగా RTC బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 269 కోట్ల 68 లక్షల ఉచిత ప్రయాణాలు చేసి, దాదాపు 9 వేల 222 కోట్ల రూపాయలను (రూ.9,222 కోట్లు) ఆదా చేసుకున్నారు.
రూ.500 కే గ్యాస్ సిలిండర్: - వంట గ్యాస్ సిలిండర్ భారం నుంచి మహిళలకు ఉపశమనం కల్పించేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 42 లక్షల 90 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా సుమారు 752 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యింది.
గృహజ్యోతి: - గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53 లక్షల 9 వేల పేద, మధ్య తరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్ల 97 లక్షల సున్నా బిల్లులు జారీ చేయబడ్డాయి. ఈ సబ్సిడీ కింద 3 వేల 900 కోట్ల 54 లక్షల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది.
చేయూత: - చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నాము.
మహిళా శక్తి మిషన్: - రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకోసం ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే 57 వేల 938 కోట్ల రూపాయల రుణం ఇప్పించడం జరిగింది. VLR పథకం కింద 2023 డిసెంబర్ నుండి ఈనాటి వరకు పట్టణ గ్రామీణ SHG లకు 1 వెయ్యి 329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో IKP బలమైన స్వయం సహాయక సంఘాల నెట్ వర్కుగా ఏర్పడింది.
SHG లకు వ్యాపార అవకాశాలు: - మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తులు 7 కోట్ల 68 లక్షలకు చేరాయి.
- SHG ల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి TGSRTC కి అద్దెకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి, మొదటి దశలో 177 కోట్ల 84 లక్షల రూపాయలతో 494 బస్సులను కొనుగోలు చేసింది.
- నారాయణ పేట మరియు సంగారెడ్డి లలో 2 పెట్రోలు బంక్ లు ఏర్పాటు చేశాం. 28 పెట్రోలు బంకుల ఏర్పాటు పురోగతిలో ఉంది.
- మహిళా సాధికారతను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు అదనంగా 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తున్నాము.
ఇందిర సౌర గిరి జల వికాసం - మారు మూల ప్రాంతాలలో ఉన్న షెడ్యూల్డ్ తెగల వారికి 12 వేల 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, వారి పురోగతికి ఇతోధికంగా తోడ్పడతాం. 6 లక్షల ఎకరాల పోడు భూములలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2 లక్షల 10 వేల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాము. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాము. దీని విధివిధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.
వ్యవసాయ రంగం: - దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా మేం భావిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
- రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతీ సీజన్ కు ఎకరాకు 6,000 ల చొప్పున రెండు పంటలకు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం.
- రైతులకు మద్దతు ధరను ఇవ్వడం కోసం వారికి ప్రోత్సాహకంగా సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున అందజేస్తూ, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నది. దీని ద్వారా, ప్రతి ఎకరానికి రైతుకు సగటున దాదాపు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని పరిగణిస్తే, ఒక్క సీజన్ కు ఎకరానికి రైతుకు సుమారు 12 వేల 500 రూపాయల ఆదాయం లభిస్తోంది. దీని వలన రైతుకు సంవత్సరానికి రెండు పంటలకు కలిపి 25 వేల రూపాయల అధిక ఆదాయం లభిస్తుంది.
- 2024-25 సంవత్సరంలో 284 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల వరి 1 కోటి 27 లక్షల ఎకరాలలో పండింది. ఫిలిప్పైన్స్ కు 22 వేల 750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయడం జరిగింది. దీనిద్వారా మన బియ్యానికి డిమాండు పెరిగి, రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది.
- రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ వంటి పంటల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. 79 వేల 287 మంది రైతులు 2 లక్షల 90 వేల 466 ఎకరాలలో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను మరో 68 వేల ఎకరాలలో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాం. మైక్రో ఇరిగేషన్ పద్ధతులను 2 లక్షల 34 వేల ఎకరాలలో అమలు చేయాలని నిర్ణయించాం.
ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ప్రజాపంపిణీ వ్యవస్థ: - రాష్ట్రంలోని 3 కోట్ల 38 లక్షల లబ్ధిదారులకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అన్ని రేషన్ షాపుల ద్వారా 6 కిలోల సన్న బియ్యం అందించబడుతోంది. దీని ద్వారా ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందించగలుగుతోంది.
కొత్త రేషన్‌కార్డులు - గత ప్రభుత్వం పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వక పోవడంతో ఎందరో పేద ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకు దూరమయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకు 15 లక్షల 12 వేల కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం. పాత కార్డుల్లో 19 లక్షల 44 వేల మంది కొత్త సభ్యులను చేర్చాము. రాష్ట్రంలో ప్రస్తుతం 1 కోటి 5 లక్షల 7 వేల 879 రేషన్ కార్డులు ఉన్నాయి.
ఈ బడ్జెట్ లో పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
పశు సంవర్థక, మత్స్యరంగాలు: - 2024-25 సంవత్సరంలో 1 వెయ్యి 935 కోట్ల 27 లక్షల గుడ్ల ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానాన్ని చేరుకుంది. 11 లక్షల 58 వేల టన్నుల మాంసం ఉత్పత్తి చేసి దేశంలో 5వ స్థానానికి చేరుకున్నాం.
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర జి.ఎస్.డి.పి. కి పశు సంవర్ధక రంగం 1 లక్ష 3 వేల 525 కోట్ల రూపాయలు అందించగా, మత్స్యరంగం 7 వేల 763 కోట్ల రూపాయలను అందించింది. కోహెడలో 47 కోట్ల రూపాయలతో హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మిస్తున్నాము. ఈ బడ్జెట్లో పశు సంవర్థక, మత్స్య శాఖలకు 1,529 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
విద్యుత్: - విద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత, భవిష్యత్తు దిశగా తెలంగాణ – మన ప్రజా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక వృద్ధి మరియు భవిష్యత్ తెలంగాణకు పునాదిగా భావిస్తోంది. విద్యుత్ అనేది కేవలం సేవ కాదు, అది సమాజం ఎలా పనిచేస్తుందో చెప్పే అద్దం.
- ఈ రోజు తెలంగాణలో విద్యుత్ రంగం దేశంలోనే అత్యుత్తమంగా నిలవడానికి కారణం నిరంతర సరఫరా మాత్రమే కాదు, నాణ్యత, విశ్వసనీయత మరియు ప్రజాకేంద్రిత పాలన. ప్రస్తుతం మన రాష్ట్రంలో 23,187 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. అందులో గణనీయమైన భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తోంది.
- మార్చి 13, 2026 తెలంగాణ విద్యుత్ రంగానికి చరిత్రాత్మక రోజు. ఆ రోజు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను సమర్థవంతంగా నెరవేర్చడమే కాకుండా 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగాన్ని నమోదు చేశాం. అంతేకాదు ప్రతి వ్యక్తికి విద్యుత్ వినియోగం 2508 యూనిట్లు ఉండగా ఇది దేశ సగటు కంటే చాలా ఎక్కువ. ఇది తెలంగాణ అభివృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపించే సూచిక.
- ఒకప్పుడు విద్యుత్ కొరత గురించి మాట్లాడుకునే తెలంగాణ, ఈ రోజు విద్యుత్ భవిష్యత్తును రూపొందించే తెలంగాణగా మారింది. మన ప్రభుత్వం విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అధికారులు కార్యాలయాల్లో కాకుండా ప్రజల మధ్యకు వెళ్లే విధంగా ‘ప్రజా బాట – పొలం బాట’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సమస్యలు ఫైళ్లలో కాదు, ప్రజల దగ్గరే పరిష్కారం అవుతున్నాయి. 214 ఎలక్ట్రికల్ అంబులెన్సులు మరియు 24 గంటల 1912 కాల్ సెంటర్ ద్వారా తక్షణ స్పందన అందిస్తున్నాం. పాలన దూరంగా ఉండే వ్యవస్థ కాదు, సమస్య దగ్గరకు వెళ్లే వ్యవస్థ.
- సాంకేతిక రంగంలో కూడా కీలక మార్పులు తీసుకువస్తున్నాం. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ వంటి ఆధునిక వ్యవస్థలను అమలు చేస్తూ సరఫరా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే స్థాయికి తీసుకువచ్చాం. ఇటీవల SLC ఛార్జీల సవరణ ద్వారా కొత్త విద్యుత్ కనెక్షన్లను కాంటాక్ట్‌లెస్ విధానంలో అందించే వ్యవస్థను ప్రవేశపెట్టాం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పారదర్శకతను పెంచుతూ అవినీతి అవకాశాలను తగ్గించే దిశగా ఇది ఒక కీలక అడుగు.
- విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో తెలంగాణ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, నెట్వర్క్ సామర్థ్యం ప్రతి స్థాయిలో బలోపేతం అవుతున్నాయి. మౌలిక సదుపాయాలు కనిపించవు, కానీ అవే అభివృద్ధి కనిపించేలా చేస్తాయి. ఈ దిశలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 3 x 800 మెగావాట్ల యూనిట్లను ప్రారంభించి మరొక యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశాం. ఇది తెలంగాణ భవిష్యత్తు విద్యుత్ భద్రతకు బలమైన పునాది.
- పునరుత్పాదక శక్తి రంగంలో తెలంగాణ ముందంజలో ఉంది. ప్రకృతితో కలిసి ముందుకు సాగడం మన లక్ష్యం. సౌర ప్రాజెక్టులు, సోలార్ విలేజ్‌లు, రూఫ్‌టాప్ విస్తరణ మాత్రమే కాదు, PM KUSUM పథకం ద్వారా రైతులను విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇది రైతును వ్యవసాయకర్తగా మాత్రమే కాకుండా శక్తి రంగంలో భాగస్వామిగా నిలబెడుతుంది. ఇప్పుడు శక్తి రంగం భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. శక్తిని ఉత్పత్తి చేయడం ఒక దశ, దాన్ని నిల్వ చేసి సమర్థవంతంగా వినియోగించడం భవిష్యత్తు. ఈ దిశగా మహేశ్వరం మరియు చౌటుప్పల్‌లో 1500 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే TGGENCO హైడల్ ఉత్పత్తిలో రికార్డు సాధించి లక్ష్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది.
- ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చేసిన సేవలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థకు అవసరమైన బొగ్గు సరఫరాలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా జైపూర్ థర్మల్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఈ సంస్థ తన వంతు పాత్రను పోషిస్తోంది. తెలంగాణ శక్తి రంగం నిరంతరంగా ముందుకు సాగడానికి ఈ సంస్థ అందిస్తున్న సహకారం ఒక బలమైన పునాది.
- Telangana Rising Global Summit సందర్భంగా TGGENCO ద్వారా 11,460 మెగావాట్ల Pumped Storage మరియు ఇతర ప్రాజెక్టులకు ₹95,150 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. అదే సమయంలో REDCO ద్వారా ₹1,23,350 కోట్ల పెట్టుబడులతో 12 ఒప్పందాలు కుదుర్చుకొని, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవి కేవలం పెట్టుబడులు కాదు, భవిష్యత్ తెలంగాణ శక్తి నిర్మాణానికి పునాదులు.
- పట్టణాభివృద్ధిలో కూడా విద్యుత్ కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లో భూగర్భ కేబులింగ్ పనులు చేపడుతూ నగరాన్ని మరింత సురక్షితంగా, ఆధునికంగా మార్చుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 1,036 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పర్యావరణహిత రవాణా వైపు తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోంది. Telangana Rising దృష్టిలో భాగంగా CURE ప్రాంతాల్లో గ్రీన్ మొబిలిటీని మరింత విస్తరించే దిశగా కూడా క్రమబద్ధమైన చర్యలు తీసుకుంటున్నాం.
- మన ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సామాజిక న్యాయం సాధనంగా కూడా ఉపయోగిస్తోంది. గృహ జ్యోతి పథకం ద్వారా 53 లక్షలకుపైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీనికి భారీగా బడ్జెట్ మద్దతు అందిస్తూ DISCOMలకు ప్రభుత్వం ప్రజల తరపున భారం భరిస్తోంది. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్, వ్యవసాయ సబ్సిడీ ఇవన్నీ కలిపి ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. రైతుకు ఇచ్చే విద్యుత్ ఖర్చు కాదు, అది భవిష్యత్తుకు పెట్టుబడి. రైతు డిస్కమ్ ఏర్పాటు ద్వారా వ్యవసాయానికి మరింత కేంద్రీకృత మరియు నాణ్యమైన సేవలను అందించే దిశగా ముందుకు సాగుతున్నాం.
- చీకటి పోవడం అంటే కేవలం వెలుగు రావడం కాదు, ప్రజల్లో నమ్మకం పెరగడం. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రతి ఇంటికి విద్యుత్, ప్రతి రైతుకు భరోసా, ప్రతి పరిశ్రమకు శక్తి, ప్రతి పౌరునికి నాణ్యమైన సేవ. విద్యుత్ సరఫరా చేయడం మన బాధ్యత. భవిష్యత్ తెలంగాణను శక్తివంతం చేయడం మన సంకల్పం. ఈ బడ్జెట్లో విద్యుత్ శాఖకు 21,285 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
విద్య, మానవ వనరులు:
చదువు లేక పోతే జ్ఞానం రాదు. జ్ఞానం లేక పోతే నైతిక విలువలు ఉండవు. నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చదువొక్కటి ఉంటే ఇవన్ని లభిస్తాయి. నిజమైన విద్య సాధికారతనిస్తుంది. మహాత్మజ్యోతిరావు పూలే…
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు: - ఏ దేశ భవిష్యత్తైనా విద్యతోనే నిర్మితమవుతుంది. ఈ సత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించాలనే సంకల్పంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ (YIIR) పాఠశాలలను మంజూరు చేయాలని నిర్ణయించాం.
- తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి వసుధైక కుటుంబంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు ఒకేచోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 79 స్కూళ్ళు మంజూరు చేశాం. 44 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
ప్రాథమిక విద్య: - ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాము. రాబోయే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుండి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
- బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2025–26 విద్యా సంవత్సరంలో 93 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను (KGBVs) యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించి, 120 KGBV లను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచాం.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు - ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన క్యాంపస్ గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించాము. ప్రీ ప్రైమరీ నుండి 12 వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులకు విద్య అందించబడుతుంది.
విద్యార్థులకు పౌష్టికాహారం : - మానవ మనుగడకు అంతిమ లక్ష్యం మేధస్సును పెంపొందించుకోవడమే. ఈ కార్యక్రమాల ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ప్రతి బిడ్డ, ప్రతి బాలిక, ప్రతి విద్యార్థి కలలకు జీవం పోస్తోంది. తెలంగాణ విద్యార్థులు ఎదిగితే, తెలంగాణ రాష్ట్రమే దేదీప్యమానంగా ఎదుగుతుంది. ఈ ఉద్యేశ్యాన్ని సాధించడం కోసం మా ప్రభుత్వం విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా రెండు నూతన పథకాలు ఈ బడ్జెట్ లో ప్రవేశ పెడుతున్నాం.
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం: - 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు మరియు మిగతా మూడు రోజులు రాగిజావ అందిస్తాము.
- This land mark initiative will improve nutrition and health outcomes, increase attendance and punctuality, reduce dropouts and absenteeism. It will ease the burden on working parents. In simple words – No child in Telangana should begin a school day on an empty stomach. This is a water shed reform for student welfare.
- This Breakfast initiative will not only nourish bodies – it will nourish the future of Telangana.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం: - ఈ రోజు నేను ప్రకటించబోయే మరో అత్యంత ముఖ్యమైన సంస్కరణ- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది.
- కౌమారదశ అనేది ఎంతో కీలకమైన దశ, ఈ వయసులో తీసుకునే పోషకాహారమే వారి నేర్చుకునే సామర్థ్యాన్ని మరియు దీర్ఘకాలిక ఆయుష్షుని నిర్ణయిస్తుంది.
రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ: - మా ప్రభుత్వం విద్యార్థుల మరియు వారి సాధికారత పట్ల అత్యంత చిత్తశుద్ధితో ఉంది. దివ్యాంగ విద్యార్థుల శారీరక వైకల్యం వారి విద్యాభ్యాసానికి మరియు ప్రగతికి ఏమాత్రం అడ్డంకి కాకూడదు అనే ఉద్దేశ్యంతో, అటువంటి వారికి తగిన తోడ్పాటు అందించే లక్ష్యంతో ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను (Retrofitted Motorised Vehicles) పంపిణీ చేయాలని నిర్ణయించాము.
వంటశాలల ఆధునీకరణ: - రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలల్లోని వంటశాలల అపరిశుభ్రత వలన విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ వంటశాలల నిర్వహణలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి, వాటిని ఆధునీకరించడానికి మా ప్రభుత్వం నిశ్చయించింది. ఈ బడ్జెట్ లో అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలు ప్రతిపాదించాము.
ఉన్నత విద్య: - రాష్ట్రంలో పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ మరియు లా కాలేజీలు, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజ్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లా మరియు ఫార్మసీ కాలేజీలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ క్యాంపస్ ను నూతనంగా మంజూరు చేశాం. వీటికి అదనంగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్గిను ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేశాము.
- స్టేషన్ ఘన్పూర్, కేసముద్రం, గంగాధర, ధర్మపురి, పాకాల్, కోస్గి మరియు దేవరకద్రలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభించాం. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఖ్య 149 కి పెరిగింది.
సాంకేతిక విద్య: - రాష్ట్రంలో ఉన్న 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నాం. యువతను భవిష్యత్ ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికి వీలుగా పాలిటెక్నిక్ కళాశాలల్లో 15 కొత్త కోర్సులు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తున్నాం.
విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు: - భూవిజ్ఞాన, ఖనిజ శాస్త్ర పరిశోధనలకు ప్రత్యేకంగా డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థాపించాం. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలల ద్వారా కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ప్రారంభించబడ్డాయి.
- మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్ల రూపాయలు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి 400 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం. మిగిలిన విశ్వవిద్యాలయాలకు కూడా అవసరమైన నిధులు కేటాయిస్తున్నాం.
స్కిల్ యూనివర్సిటీ: - నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అవసరమగు నైపుణ్యాలున్న మానవ వనరుల కొరత నెలకొంది. చాలా సందర్భాలలో, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలల నుండి ఉత్తీర్ణులై వస్తున్న మన విద్యార్థులలో ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు ఉండటం లేదు. అలాగే, అధునాతన, ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు వారు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండటం లేదు.
- ఈ అంతరాన్ని పూడ్చాలనే దార్శనికతతో అటు విద్యావంతులైన నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఇటు పరిశ్రమలు ఎదుర్కొంటున్న నైపుణ్యము కల్గిన మానవ వనరుల కొరతను ఏకకాలంలో పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో, మన రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని స్థాపించింది.
- పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, ఆయా పరిశ్రమల భాగస్వామ్యంతోనే రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా యువతకు ప్రత్యేక నైపుణ్యాలను అందిస్తాము. ఈ స్కిల్ యూనివర్సిటీ ని విద్యాశాఖ పరిధిలోనికి తీసుకొని వస్తున్నాము.
- రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లుగా ప్రభుత్వం ఉన్నతీకరించింది. దీనికి అదనంగా, 53 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లను మంజూరు చేసింది. వీటి నిర్వహణ పనులు పురోగతిలో ఉన్నాయి. దీనితో మొత్తం 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లు అందుబాటులోకి వస్తున్నాయి. ATC లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల రూపాయలు స్కాలర్ షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- నైపుణ్యాలకు సంబంధించిన అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCలు), పాలిటెక్నిక్ కళాశాలలు మరియు టామ్‌కామ్ (TOMCOM) లను ఈ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తాము.
- యువతను ‘బ్లూ కాలర్’ ఉద్యోగాల కోసం సన్నద్ధం చేసేలా.. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ (JNTU) తదితర విద్యాసంస్థల తరహాలో ఈ విశ్వవిద్యాలయాన్ని తయారు చేయటం మా ప్రధాన ఉద్దేశ్యం..
- 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే మహోన్నత లక్ష్యంతో ఉన్నాము, ఇందుకు మనకు భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం.
- భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ-కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో, తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మేము భావిస్తున్నాము.
“పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చుకాదు – అవి పెట్టుబడులు.”
అమ్మకలలు, పిల్లల చదువు – ఇవే తెలంగాణ భవిష్యత్తు.
ఈ బడ్జెట్లో విద్యా రంగానికి 26,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
వైద్యం: - రాష్ట్రంలోని పేద ప్రజలందరికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తోంది. తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్యాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, అలాగే మానసిక ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
- ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల క్లినిక్స్, వృద్ధులకు ప్రత్యేక క్లినిక్స్, పాలియేటివ్ కేర్ సెంటర్లు, ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఇంతకాలం గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థగా ఉన్న 12 వేల 720 బెడ్స్ సామర్ధ్యం గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను పూర్తిస్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా మార్పు చేస్తున్నాం.
- దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే లభించే ప్రజల హెల్త్ ప్రొఫైల్ ని రాష్ట్రంలోని ప్రజలందరికి అమలుపరుస్తున్నాం. మానవ వనరుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర్లంలోని ప్రజలందరి ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమైనది. అందుకోసం ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ ని సిద్ధం చేసి, వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తాం. వీటి నిర్వహణలో అత్యంత గోప్యతను పాటిస్తాం.
నూతన వైద్య కళాశాలలు మరియు సంస్థలు: - గత ప్రభుత్వం కేవలం పేపర్ల మీదే మెడికల్, నర్సింగ్ ఇతర కళాశాలలను చూపించి, ప్రజలలో ఒక భ్రమను కలిగింపజేసింది. కానీ మేము వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చి వాటి నిర్మాణ పనులు ప్రారంభించాము.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30,377 పడకలు అందుబాటులో ఉండగా, కొత్తగా ప్రారంభించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా మరో 1,980 Tertiary care పడకలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి అదనంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సంవత్సరంలో 4,540 కొత్త బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. 2026 చివరి నాటికి సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రులతో పాటు NIMS విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిపి మరో 6,582 Tertiary care పడకలను అందుబాటులోకి తెస్తున్నాము. ఇవిగాక, సెకండరీ కేర్ ఆసుపత్రులలో 12,720 పడకలు ఉన్నాయి. దీంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం Tertiary care పడకల సంఖ్య 44,029 కు చేరుకుంటుంది. భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల (IPHS) ప్రకారం ‘ప్రతి వెయ్యి మందికి ఒక పడక’ ఉండాలన్న నిబంధనను మనం గణనీయంగా అధిగమించడం మనందరికీ గర్వకారణం.
- నూతనంగా, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నాం. మెడికల్ విద్యను విస్తరించేందుకు కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించబడ్డాయి. చికిత్స ఆధారిత వ్యవస్థ నుంచి నిరోధక వైద్య సేవల వైపు మార్పును తీసుకొస్తున్నాం.
ఈ బడ్జెట్లో వైద్య మరియు ఆరోగ్య శాఖకి 13,679 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం: - కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మరియు భరోసా.
- ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత (Employees Health Scheme-EHS) పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తాం. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల 51 వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు.
- ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది, 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్ల రూపాయలు అదనపు కవరేజి లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది.
- అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్రయోజనాలను మంజూరు చేస్తూ, టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తున్నాం. 60 ఏళ్ల వయసులో స్వచ్ఛందంగా విధుల్లోంచి విరమించుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు అందుతాయి.
- ఈ ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఇది నిదర్శనం.
కార్మిక సంక్షేమం: - తెలంగాణ కార్మిక శక్తిని బలోపేతం చేయడం, కార్మిక సంక్షేమం, పారిశ్రామిక అనుకూలత, పని ప్రదేశంలో భద్రత కల్పించడం ద్వారా వారికి అన్నివిధాల ప్రభుత్వం సహకరిస్తుంది.
- “టి-గేట్” డిజిటల్ ప్లాట్ ఫాం నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం ఉద్యోగ అనుసంధాన సేవలను అందిస్తుంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఒక లక్ష మూడువేల మంది కార్మికులను నమోదు చేసి, 55,594 మంది లబ్ధిదారులకు 276.78 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం.
సి.ఎం. ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం: - రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా UAE, Germany, Japan, UK, Canada వంటి 16 దేశాలలో సుమారు 13,930 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా నూతనంగా “సి.ఎం. ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం”ను ప్రారంభిస్తున్నాం.
- రాష్ట్ర యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణను మరియు వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికి వీసా మార్గదర్శకత మరియు విదేశీ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ఉద్దేశ్యం.ఈ బడ్జెట్ లో కార్మిక సంక్షేమ శాఖకు 998 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
మహిళ-శిశు సంక్షేమం:
ఒక దేశం యొక్క పురోగతి అక్కడి మహిళల స్థితి ద్వారా కొలవబడుతుంది. — మహాత్మా గాంధీ - 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ‘ఆధార్శిల’ పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకు అత్యుత్తమ ప్రీ-ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడం తో పాటు రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నాము.
- ‘బాల భరోసా’ పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలిదశలోనే గుర్తించడం ద్వారా, వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి, భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకు కొండంత ‘భరోసా’ను ఇస్తోంది.
- దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ, తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా 2 లక్షల నగదును మన ప్రభుత్వం కానుకగా అందిస్తోంది.
- ‘స్టేట్ న్యూట్రిషన్ మిషన్’ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 ‘మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను’ ఏర్పాటు చేయబోతున్నాం.
- పాలనా పథకం ద్వారా పని చేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్వాడీ కమ్ క్రెచ్ సెంటర్లు (AWCC) ప్రారంభిస్తున్నాము. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం తో పాటు, డే-కేర్ సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా వృద్ధుల సంక్షేమం కోసం 37 ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లు మంజూరు చేశాం.
ఈ బడ్జెట్లో మహిళ, శిశు సంక్షేమానికి 3,143 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమం:
రాజకీయ ప్రజాస్వామ్యం.. సామాజిక ప్రజాస్వామ్యంగా మారనంత కాలం స్వాతంత్ర్యానికి అర్థం లేదు. – డా. బి.ఆర్. అంబేద్కర్ - అంతరాలు లేని సమాజం కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక న్యాయం చేయాలనేది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం. వసతి పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. 368 కోట్ల 27 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు / అంబేద్కర్ భవనాలు / విగ్రహాలు మంజూరు చేశాం.
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సంపూర్ణంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మా ప్రభుత్వం ఏర్పడిన నాటికే 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధులలో ఎస్సీలకు చెందిన 13 వేల 617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్లు, మొత్తం 14 వేల 934 కోట్లు ఖర్చు కాకుండా ఉంది. మా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపులతో పాటు, ఈ బకాయిలను కూడా అదనంగా కేటాయించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు, ఎస్సీలకు 7,757 కోట్లు మరియు ఎస్టీలకు 1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉంది. వాటిని మేము 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కూడా కేటాయిస్తున్నాం.
- హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ ను నిర్మిస్తున్నాము. అదేవిధంగా, నింబోలి అడ్డ కాచిగూడ లో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తాం.
గిరిజనాభివృద్ధి: - సమాజాభివృద్ధి అంటే కేవలం పట్టణాభివృద్ధే కాదు. అడవుల్లో నివసించే గిరిజనులు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. గిరిజనాభివృద్ధి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.
- ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపన, వివిధ గిరిజన వర్గాల అభివృద్ధి కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, GCC ‘GIRI’ బ్రాండ్ ఉత్పత్తుల ప్రోత్సాహం, గిరిజన గ్రామాల్లో ఆదివాసి సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము.
- గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధరలను కల్పించడం ద్వారా తెలంగాణ గిరిజన సహకార సంస్థ వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది.
ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 11,784 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి 7,937 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
వెనుకబడిన తరగతుల సంక్షేమం: - రాష్ట్ర జనాభాలో సుమారు 56 శాతం వెనుకబడిన తరగతులవారు (BCs) ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తించిన ప్రభుత్వం విద్యా, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక సాధికారత, గ్లోబల్ అవకాశాలు, సాంప్రదాయ వృత్తుల రక్షణకు గౌరవం కల్పిస్తూ, భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తున్నది.
ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
మైనారిటీ సంక్షేమం: - సమాజంలోని అన్ని వర్గాలతో పాటు ముఖ్యమైన భాగంగా ఉన్న మైనారిటీల సమగ్ర అభ్యుదయం, సమాన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన అనేది మరొక ప్రధానమైన అంశం. పేద మైనారిటీ మహిళలకి జీవనోపాధిని కల్పించి, వారు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడానికి వీలు కల్పించేందుకుగాను 10,000 కుట్టుమిషన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
- అంతేకాకుండా, మైనారిటీ యువతకు సాధికారత కల్పించి, ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఉత్తమ ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలుగా 4,655 మంది మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడమయింది.
ఈ బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
రాజీవ్ యువ వికాసం పథకం: - ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మైనారిటీ, ఓసీ (OC) వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వారిలో ఆర్థిక స్వయంసమృద్ధిని, వ్యవస్థాపక సామర్థ్యాలను పెంపొందించడానికి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం అమలుకు 6 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించాము.
గృహ నిర్మాణ శాఖ: - ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం. దీనిని గుర్తించి ప్రభుత్వం “ఇందిరమ్మ ఇండ్లు” అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాము.
- ఈ పథకం కింద ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన అన్ని వర్గాలవారికి ఈ ఇండ్లు కేటాయించబడతాయి. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ, ప్రతి నియోజక వర్గానికి అదనంగా వెయ్యి ఇండ్లు కేటాయించాం. ఈ పథకానికి 22 వేల 500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు 5 వేల 73 కోట్ల 84 లక్షలు ఖర్చు చేశాం.
ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఐ.టి. రంగం: - ఐటి రంగంలో మనం సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో 1500 కంటే ఎక్కువ ఐటీ/ఐటీఈఎస్ (IT/ITES) కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో వృద్ధిని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2వ ఐసీటీ (ICT) విధానాలను ప్రారంభించింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ (IMAGE) పాలసీ వంటి వాటిని కూడా ప్రభుత్వం తీసుకు వస్తుంది. రాష్ట్ర ఐ.టి. ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకొని 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
- భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో (GCCs) సుమారు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2024-25లో 70కి పైగా కొత్త GCCలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం చుట్టూ ఐటీని విస్తరించడానికి ‘గ్రిడ్’ (Growth In Dispersion) విధానాన్ని ప్రభుత్వం ప్రోత్పహిస్తుంది.
- ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ సంస్థల ద్వారా వాడుతున్న ఇంటర్నెట్ కు చేస్తున్న ఖర్చును తగ్గించి, ప్రభుత్వ సంస్థ అయిన టి- ఫైబర్ ద్వారా సురక్షితమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 424 మండలాలలోని 8,888 గ్రామపంచాయతీలకు, 4,800 ప్రభుత్వ సంస్ధలకు ఫైబర్ అనుసంధానత కల్పించబడింది. ఈ సంవత్సరాంతానికి 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఈ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
పరిశ్రమల రంగం: - రాష్ట్ర GSDPలో పరిశ్రమల రంగం వాటా 3 లక్షల 4 వేల 217 కోట్ల రూపాయలు.
- తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి, ప్రపంచంలోనే వివిధ కంపెనీలు, పేరొందిన సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు తరలివచ్చాయి. వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న MoU ల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్పీడ్’ విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది.
- Raising and Accelerating MSME Performance (RAMP) ద్వారా రాష్ట్రంలో 140 మహిళా సంఘాల ఆధ్వర్యంలోని వ్యాపారాలను వేగవంతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. 33 జిల్లాల్లో మారుమూలన ఉన్న మహిళలను కూడా చేరుకునేట్లుగా ప్రీ-ఇంక్యుబేషన్ కార్యక్రమం చేపట్టాం. దివ్యాంగులు (PwD), ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు, ఆదివాసీలు వంటి వర్గాలకు చెందిన మహిళా వ్యాపారులకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్, గ్రౌండ్ స్థాయి MSME లకు ప్రాధాన్యత ఇస్తున్నాము.
- తెలంగాణ పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతంలో రాబోయే సంవత్సరాల్లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రేడియల్ రోడ్-II సమీపంలో భారీ పారిశ్రామిక పార్కుల కోసం ప్రభుత్వం భూములను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనితో పాటు కొడంగల్ మల్టి పర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ (MPIP) ని కూడా అభివృద్ధి చేస్తాం.
- కేంద్ర ప్రభుత్వం సహకారంతో జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ (NICZICSL) ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాము. ఇది 3 వేల 245 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అమలవుతోంది.
- మన రాష్ట్రం నుంచి సరుకు ఎగుమతులు 1 లక్ష 61 వేల 843 కోట్ల రూపాయలకు చేరి, దేశంలో 7వ స్థానంలో ఉంది. ఇందులో ముఖ్యంగా ఏరోస్పేస్ మరియ డిఫెన్స్ రంగాలు కీలక పాత్ర పోషిస్తూ, మొత్తం ఎగుమతులలో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇంకా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) విషయంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం “టాప్ అచీవర్” గా గుర్తించడం గర్వ కారణం.
- ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన 23వ బయోఏషియా అంతర్జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సు లో 1,700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తపరిచారు.
- WE -Hub ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాలలో 700 పైగా మహిళా వ్యాపార వేత్తలకు మద్దతు ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాం.
ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 3,490 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
చేనేత: - మన తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట్, సిద్ధిపేట్ గొల్లభామ చీరలు, వరంగల్ దుప్పట్లు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు మన సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
- “కోటి మహిళలకు కోటి చీరలు” కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నాము. ఇప్పటికే 70 లక్షల చీరలను అందజేశాము. మిగిలిన చీరలను అతిత్వరలో అందజేయడం జరుగుతుంది. గతంలో మాదిరి కాకుండా, రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్లో చేనేత రంగానికి 258 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి: - గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ బడ్జెట్ లో గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించాం. పంచాయతీ రోడ్లకు మహర్దశ కల్పిస్తున్నాం.
- 2025 డిసెంబర్ లో 12,702 గ్రామ పంచాయితీలకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. తద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం భారత ప్రభుత్వం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎన్నిక అయిన సర్పంచ్ లు అందరికి 5 రోజుల సమగ్ర శిక్షణని అందించాము.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం: - ‘భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉన్నది’ అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాల్లోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తరిమికొట్టడానికి ఒక అస్త్రంలా మహాత్ముడి పేరు మీద అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప చట్టమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA). ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది సామాన్యుడికి కల్పించిన ‘ఉపాధి హక్కు’. ఈ పథకం గత రెండు దశాబ్దాలుగా పల్లెల్లో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తెచ్చింది. ఏటా 100 రోజుల పని గ్యారెంటీ ఇవ్వడం ద్వారా వలసలను అరికట్టి, కూలీలలో 50 శాతం పైగా ఉన్న మహిళలకు, మహిళా సాధికారతకు ఇది పట్టుకొమ్మగా మారింది.
- కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం MGNREGA స్థానంలో VB-G RAM G అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మన తెలంగాణ శాసనసభ ఈ కొత్త చట్టాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. పాత చట్టం ద్వారా కేంద్రం 90 శాతం నిధులు ఇస్తే, ఈ కొత్త చట్టం ద్వారా కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇస్తుంది. మిగతా 40 శాతం నిధులు రాష్ట్రం భరించాలనే నిబంధన పెట్టింది. ఇది మళ్ళీ వలసలను ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో 90 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే. బడ్జెట్ పరిమితుల వల్ల వీరి జీవనోపాధికి పెను ప్రమాదం పొంచి ఉంది.
HAM రోడ్లు: - రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఎంపిక చేసిన రహదారులను HAM (Hybrid Annuity Mode) విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశ కింద 96 నియోజక వర్గాల పరిధిలో 7,450 కి.మీ. గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ విధానం ప్రకారం 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60 శాతాన్ని రాయితీదారు (Concessionaire) పెట్టుబడి పెడతారు. ఈ 60 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితి 30 యాన్యుటీలలో తిరిగి చెల్లిస్తుంది. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత పెట్టబడిదారుడికే ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,980 కి.మీ.ల రహదారులను నిర్మించాలని ప్రతిపాదించడమైనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపుకి 1,372 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది.
ఈ బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 33,688 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
సాగునీటి ప్రాజెక్టులు: - డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటిగా ఉంది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం గౌరవ సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, చట్టబద్ధమైన సంస్థలు, భారత ప్రభుత్వం వంటి ప్రతి వేదికపైనా మా ప్రభుత్వం సమర్థవంతంగా పోరాడింది. మా ప్రభుత్వానికి గతంలో పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులు వారసత్వంగా వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న మరియు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఎలిమినేటి మాధవ రెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు, ఉదయసముద్రం, డిండి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ ఎం.బి.సి (MBC) ఎత్తిపోతల పథకం, జాన్పాడు ఎత్తిపోతల పథకం, మోతె ఎత్తిపోతల పథకం, జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి ప్రాజెక్టు, ఎర్రుపాలెం జవహర్లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమరం భీం వాగు, చిక్మాను వాగు, కెరామేరి మండలంలోని అమ్మవారి మడగాస్కర్, లెండిగూడ–జైనూర్ (మంటో), రోసీ మాల్టా మినీ రిజర్వాయర్ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా మేము కృషి చేస్తున్నాము.
- గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిదిద్ది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కూడా చేపడుతుంది.
- గతంలో ప్రభుత్వం సకాలంలో పూడిక పనులు చేపట్టకపోవడం వలన అనేక ప్రాజెక్టులలో పూడిక (సెడిమెంటేషన్) పేరుకుపోయి రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ వారి ‘జాతీయ పూడికతీత మార్గదర్శకాల’ ప్రకారం.. ఇప్పటికే ‘ఆదాయ ఉత్పత్తి విధానం’ (Revenue Generating Model) ఆధారంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కడెం, లోయర్ మానేరు డ్యామ్ మరియు మిడ్ మానేరు డ్యామ్ ప్రాజెక్టులతో పాటుగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మూసీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో కోల్పోయిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి మేము పూడికతీత పనులను చేపడుతున్నాము.
ఈ బడ్జెట్లో నీటి పారుదల శాఖకి 22,615 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము.
రవాణా శాఖ: - తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1 కోటి 82 లక్షల నమోదిత వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ మరియు త్రిచక్ర వాహనాలకు చెందిన 11 లక్షల 75 వేల వాహనాలకు, 105 కోట్ల 16 లక్షల రూపాయల పన్ను మినహాయింపులు మంజూరు చేశాం. ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేల ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) 856 కోట్ల 98 లక్షల పన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాము. దీని ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనుకడుగు వేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాము.
- నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు “సారథి”, “వాహన్” లను తెలంగాణలో అమలు చేస్తున్నాము. “వాహన్” సేవలను వచ్చే ఆరు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తాము.
రోడ్ల అభివృద్ధి: - రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్ బి రోడ్లను HAM (Hybrid Annuity Mode) విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
నూతన విమానాశ్రాయల అభివృద్ధి: - వరంగల్ విమానాశ్రయం కోసం భూ సేకరణను పూర్తిచేసి, నిర్మాణపు పనులను వేగవంతం చేస్తాం. ఆదిలాబాద్ విమానాశ్రయం మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది.
ఈ బడ్జెట్లో రవాణా, రోడ్డు, భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
న్యాయశాఖ: - ‘సత్వర న్యాయం-సమ న్యాయం’ అనే లక్ష్యంతో న్యాయశాఖను బలోపేతం చేయడానికి ప్రాధాన్యతని ఇస్తూ, ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతున్నది. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
- తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా రాష్ట్ర హైకోర్టు భవనాలను, న్యాయమూర్తుల నివాస గృహాలను 2,583 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నాము. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 11 అదనపు జిల్లా న్యాయ స్థానాలను, 2 సీనియర్ సివిల్ జడ్జి స్థానాలను, 46 జూనియర్ సివిల్ జడ్జి స్థానాలను నిర్మించడానికి అనుమతులు ఇచ్చాం. ఈ బడ్జెట్లో న్యాయ శాఖకు 2,367 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
పట్టణాభివృద్ధి: - భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించింది. అయినప్పటికీ, దీనిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs), కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) భాగస్వాములు తదితరుల సహకారంతో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
- హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ముందుంది. అయినా, ప్రభుత్వం అక్కడితోనే ఆగకుండా తెలంగాణలోని ప్రతి పట్టణం, ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. రాష్ట్రంలో పట్టణీకరణ శాతాన్ని పెంచగలిగాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
- హైదరాబాద్ మహానగర ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ వరకు తాగునీరు, మురుగునీటి సేవలను, హైదరాబాద్ మహానగర వాటర్ బోర్డు అందిస్తుంది. గోదావరి తాగునీటి ప్రాజెక్ట్, కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాలను మంజూరు చేశాం. వాటి నిర్మాణం వివిధ దశలలో కొనసాగుతోంది.
- పాత GHMC సంస్థకి ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి, వడ్డీ రేటును 9.15 శాతం నుండి 7.95 శాతానికి తగ్గించాం. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం “H CITI” పథకం కింద 2 వేల 654 కోట్ల రూపాయలు కేటాయించాం.
HYDRAA సంస్థ: - HYDRAA సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ మరియు విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడింది. ఇప్పటివరకు వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు 60 వేల కోట్లుగా ఉంటుంది. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్-రుక్-ఉద్దీన్-దౌలా చెరువులను పునరుద్ధరించాం. ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకనామిని పెంపొందించడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వరదలను నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయి. చెరువుల సంరక్షణకు సీసీటీవీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాము.
HMDA: - నగర రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం HMDA పలు ప్రాజెక్టులు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు ప్యారడైస్ నుండి షామీర్పేట్ వరకు, ప్యారడైస్ నుండి డైరీ ఫారం రోడ్డు వరకు, ICCC నుండి శిల్పా లే-అవుట్ ఫ్లై ఓవర్ వరకు నిర్మిస్తున్నాం. అంతేకాకుండా, కురిమిడ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు, ORR ను RRR తో కలిపే రేడియల్ రోడ్ల నిర్మాణానికి, రహదారి విస్తరణ, స్కైవాక్‌లు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నాము. ORR ను RRR తో కలిపే రేడియల్ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి.
- హైదరాబాద్ పాతనగర ప్రాంతంలో చారిత్రాత్మక కట్టడాల సంరక్షణ, చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల అభివృద్ధి, పాదచారుల సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాలు చేపడుతున్నాము.
హైదరాబాద్ మెట్రో రైలు: - హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఈ సౌకర్యాన్ని పాతబస్తీ కి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్ II కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.
- హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును L&T సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక సాహసోపేతమైన, ప్రజానుకూలమైన నిర్ణయం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాతబస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ (Phase-2, Phase-3) అత్యవసరంగా మారింది.
మూసీ నది పునరుద్ధరణ: - మూసీ నది పునరుద్ధరణ కోసం 55 కి.మీ పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నాము. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 TMC ల నీరు మూసీకి అందించబడుతుంది. 45 STP లు ఇప్పటికే పని చేస్తుండగా, అదనంగా మరో 39 STP లు మంజూరు చేయగా, అవి వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. ఈసీ మరియు మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇందులో నదిని శుభ్రపరిచే పనులు, వరద నియంత్రణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ప్రజలకు వినోద సదుపాయాలు ఏర్పాటు చేయడం ఉన్నాయి. మూసీనది బఫర్ జోన్ లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో వారికి పునరావాసం కల్పిస్తాము.
- మా ప్రభుత్వం హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టు ప్రక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43 వేల 592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసింది. వాటిలో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి త్వరలోనే చేపడుతాం.
ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
శాంతిభద్రతల పరిరక్షణ: - రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలను కనబరుస్తున్నది.
- డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం EAGLE అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న 15 రహస్య ఫ్యాక్టరీలు, ప్రయోగశాలలను గుర్తించి నిర్మూలించింది. అంతర్రాష్ట్ర డ్రగ్ రవాణాను అరికట్టేందుకు ముఖ్య మార్గాల్లో జాయింట్ చెక్ పోస్టులు CCTV పర్యవేక్షణ ఏర్పాటు చేశాం. దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నార్కోటిక్, ఫోరెన్సిక్ ప్రయోగశాల కూడా స్థాపించాం. డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడమేకాకుండా, విద్యా సంస్థలలో 4,729 యాంటీ డ్రగ్ కమిటీలు, 20,989 ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేసి యువతలో అవగాహన పెంపొందిస్తున్నాం.
నక్సలిజం – పునరావాసం: - నక్సలిజాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ‘శాంతి-భద్రతల సమస్యగానే పరిగణించి, పోలీసు, సైనిక బలగాలతో అణచివేసే ప్రయత్నం చేశాయి. కానీ మా ప్రభుత్వం ఈ సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా కల్పిస్తే అడవులలోకి వెళ్లిన వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక-ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోగా, మా ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్,7 నుండి 2026 మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయారు. నక్సలిజం పుట్టుకకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడం ద్వారానే నక్సలిజం ఉద్యమానికి ముగింపు పలకగలమని తెలంగాణ రాష్ట్రం నిరూపించింది. “సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన సామాజిక మార్పు సాధ్యం” అని మన తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసింది.
ఈ బడ్జెట్లో హోం శాఖకు 11,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఆలయాల అభివృద్ది: - తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం వంటి దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, తగు నిధులను కూడా మంజారు చేస్తున్నాం. ప్రసిద్ది చెందిన రాజన్న దేవాలయాన్ని పూర్తి స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం.
గోదావరి పుష్కరాలు: - పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ‘కుంభమేళా’ తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పుష్కరాల నిర్వహణ మరియు రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డి. శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక క్యాబినెట్ సబ్-కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే చర్యలు తీసుకుంటోంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.
ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి: - రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర దేవాదాయ శాఖ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో తొమ్మిది కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లను ప్రారంభించింది. ఈ యాత్రా సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు అందించబడుతున్నాయి.
యువజన సర్వీసులు- క్రీడలు, టూరిజం: - యువతే రాష్ట్ర భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులు. వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నాము.
- గత ఏడాది డిసెంబర్ 13, 2025 న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఒక అపూర్వ ఘట్టానికి వేదికైంది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం ‘లియోనెల్ మెస్సీ’ ని మన హైదరాబాద్ గడ్డపైకి తీసుకురావడం మన ప్రభుత్వ దార్శనికతకు, క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ చారిత్రక ప్రదర్శన మ్యాచ్‌లో సాక్షాత్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న తీరు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతలో అపూర్వమైన క్రీడా స్ఫూర్తిని రగిలించింది. అట్టడుగు స్థాయి నుండి ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో, ఎంపిక చేసిన పేద మరియు ప్రతిభావంతులైన పిల్లల కోసం మెస్సీ బృందంతో ప్రత్యేక ఫుట్‌బాల్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల చేతుల మీదుగా ఆ పిల్లలు శిక్షణ పొందడం… రేపటి తెలంగాణ క్రీడా భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది.
- రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి స్పోర్ట్స్ క్యాపిటల్‌గా మార్చేందుకు ఈ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని మా ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి కోసం 9 కీలక MoUలు చేసుకున్నాము. వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతోపాటు క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టాము. గురుకులాల్లోని విద్యార్థులను జల్లెడ పట్టి ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.
- రాష్ట్ర యువత క్రీడా రంగంలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలుగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాం.
- హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి జి.ఎం.సి. బాలయోగి హాకీ మైదానంలో ప్రతిష్టాత్మక ‘మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్’కు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవం. ఎనిమిది దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత తీర్చిదిద్ది విజయవంతంగా నిర్వహించింది. భారత మహిళలు హాకీ టీం ప్రపంచకప్ కి అర్హత సాధించింది.
- నూతన క్రీడా విధానం.. చిన్న వయసులోనే అట్టడుగు స్థాయి (గ్రాస్‌రూట్) నుండి ప్రతిభావంతులను గుర్తించి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా, గత రెండేళ్లుగా పారా స్పోర్ట్స్‌తో సహా 40 క్రీడా విభాగాల్లో ‘సీఎం కప్’ (CM CUP) టోర్నమెంట్లను ప్రవేశపెట్టడం జరిగింది. విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేస్తున్నాం. అలాగే, విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలను గుర్తించి, వారికి ఉన్నత స్థాయి శిక్షణను అందిస్తున్నాం.
టూరిజం పాలసీ: - తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030ను ప్రకటించి అమలు చేస్తున్నది.
- ఈ పర్యాటక విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం మరియు స్థానిక కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ విధానానికి ప్రైవేటు రంగం నుండి విశేష స్పందన లభించింది. తద్వారా 25,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి.
- చరిత్రలో మొదటిసారిగా హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు నిర్వహించడంతో ప్రపంచం దృష్టిని హైదరాబాద్ ఆకర్షించింది.
ఈ బడ్జెట్లో పర్యాటక రంగానికి 1,224 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
గౌరవ అధ్యక్షా! - బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు….. అక్షరాలు మాత్రమే కాదు…. మన జీవితం…. మన భవిష్యత్తు.
కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం
ఆసరా కోసం చూసే బలహీనులను ఆదుకోవడం
నీడలేని వారికి నీడకల్పించడం…
పంటపొలాలకు నీళ్లు పారించడం… ఫలసాయం పెంచడం
కష్టపడే వారికి పని కల్పించడం
ఇష్టపడేలా పాలన అందించడం
ఒక్క మాటలో చెప్పాలంటే నేను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. - అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నాం.
- ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా.
- ఒకవైపు ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా ఈ బడ్జెట్‌ను సమతుల్యంగా రూపొందించాం. పన్నుల భారంతో సామాన్యుడి పైన భారం మోపకుండా, ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ, కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం.
- “పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి” అన్న మహాత్మా గాంధీ మాటలను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ రెండేళ్ల మా పాలన, పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. ఆ పునాదిపై ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.
2026-27 బడ్జెట్ అంచనాలు: - 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,24,234 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను.
- తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి, వారి స్వప్నాలను సాకారం చేసే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను.
జై హింద్… జై తెలంగాణ…
