హైదరాబాద్ : భారత రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం (నవంబర్ 26) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సీఎస్టీడీ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవేత్త, న్యాయశాస్త్ర పండితుడు, సాహితీవేత్త మంగారి రాజేందర్ ‘జింబో’ ‘న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ – అంతర్లీన వీటో అధికారం’ (The Unseen Veto: Executive Control in Judicial Appointments) అనే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగబద్ధ సంస్థల మధ్య అధికారాల సమతుల్యత, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక వ్యవస్థ పాత్ర వంటి సమకాలీన అంశాలపై మేధోపరమైన చర్చకు ఈ కార్యక్రమం వేదిక కానుంది.
Also Read-
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమానికి అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి అధ్యక్షత వహించనున్నారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలపై అవగాహన పెంపొందించడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని విద్యా సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి పేర్కొన్నారు.
