“నేను బహుజనుల బాణాన్ని, యువకుల యుద్ద నినాదాన్ని”

కోస్గీ – కొడంగల్ : “నేను బహుజనుల బాణాన్ని.. యువజనుల యుద్ద నినాదాన్ని,. అంబేడ్కర్ వాదాన్ని. పూలే గారి ఆత్మగౌరవ నినాదాన్ని.. సాయిత్రి భాయ్ పూలే ఆశయాలను నింపుకొని నిటారుగా నిలబడి మగమహారాజులకు ఛాలెంజ్ విసురుతున్న వీరవనితను నేను” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తనను బీఆర్ఎస్ వదిలిన బాణమని కొంతమంది, కాంగ్రెస్ బాణం అంటూ మరికొంతమంది చేస్తున్న విమర్శలకు కొడంగల్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గీలో ఆదివారం నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడారు. తాను బహుజనుల బాణాన్ని అని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీలతో పోారాటం చేసి చూపిస్తానన్నారు. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎదగగలదని నిరూపిస్తానన్నారు. ఇన్నాళ్లు అయ్యాల పాలనలో ఒరిగిందేమీ లేదని ఇక తెలంగాణలో మాతృస్వామ్యం తెచ్చుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే చేసేందేమీ లేదన్నారు. తనకు అవకాశం ఇస్తే ఒక తల్లిలాగా ఆలోచించి పాలన సాగిస్తానన్నారు.

ప్రజల కోసమే పార్టీ పెట్టా

తెలంగాణలో మాతృస్వామ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరముందని కవిత అన్నారు. ఇన్నాళ్లు అయ్యాలు చేసిన పాలనలో మన బతుకులు ఏం మారాయో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాకముందు జరిగిన అన్యాయానికి ఆంధ్రోళ్లు బాధ్యులని అనుకున్నామని కానీ తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో మన బతుకులు ఏం మారాయని ప్రశ్నించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. బాధ్యతలేని పార్టీలు, నాయకుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కదనరంగంలో యుద్దం చేసే నాయకుల అవసరముందన్నారు. అందుకోసం తాను పార్టీ పెట్టి మీ ముందుకు వచ్చానని చెప్పారు. తనకోసమో, కొంతమంది నాయకుల కోసమో పార్టీ పెట్టలేదని, తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేందుకే తెలంగాణ రక్షణ సేన పెట్టానని చెప్పారు. కోస్గీకి తాను 2009 లో టీడీపీతో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చానని అన్నారు. వాళ్లిద్దరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారని తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే తాను కూడా రాష్ట్రాన్ని నడిపిస్తాననే విశ్వాసం ఉందన్నారు.

పాంచజన్యంతో ప్రజల జీవితాల్లో వెలుగులు

సమాజంలో ఆధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది ధర్మపోరాటాన్ని చేస్తారని….తాము కూడా తెలంగాణ రక్షణ సేన ద్వారా అదే పనిచేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు విద్య కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. జనంబాటలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే అక్కడి పరిస్థితిని ఓ మహిళ తనకు చెబుతుంటే ఎంతో ఆవేదన చెందానన్నాారు. తన బిడ్డకు పుట్టిన బిడ్డను చూడాలంటే వెయ్యి రూపాయలు లంచం అడిగారని ఆమె చెప్పిందన్నారు. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎంత పెద్ద జబ్బైనా సరే ఒక్క రూపాయి కూడా ప్రజలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను ఇవ్వన్నీ చెబుతుంటే కొంతమంది చిన్నపిల్ల, ఆడబిడ్డ అంటూ నవ్వుతున్నారని కవిత అన్నారు. కానీ తాను ఒక తల్లిని అని తల్లి హృదయంతో ఆలోచిస్తానని చెప్పారు. విద్య, వైద్యం కోసం లక్ష కోట్లు ఖర్చు అయినా పర్వాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూత్ ను నమ్మోద్దు అంటున్నాడు. మరి ఆయన బూతులను నమ్మాలా అని ప్రశ్నించారు. మన యువతను నమ్మి వారి బిజినెస్ ఐడియాలను ప్రోత్సహించేందుకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు.

Also Read-

పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే పేరు మార్చుకుంటా

రాష్ట్రంలో రైతుల పరిస్థితి పై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, కరెంట్, నీళ్లు, రైతు భరోసా, మద్దతు ధర ఇలా ప్రతి దానికి రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అధికారుల కాళ్లపై పడి రైతులు వేడుకుంటున్న సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయన్నారు. రైతులకు కనీసం సాగు నీళ్లు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శించారు. జురాల వద్ద రెగ్యులేటర్ ను పగలకొట్టి రైతులు నీళ్లు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జురాల నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్న సరే చేయటం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక జురాల నుంచి నీటిని ఎత్తిపోసి కొడంగల్, మక్తల్, నారాయణ్ నుంచి ఇబ్రహీం పట్నం వరకు 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని భరోసా ఇచ్చారు. లేదంటే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు.

బలవంతుడినని వీర్రవీగుతున్న ముఖ్యమంత్రి

రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోందని కవిత అన్నారు. ఏ వర్గానికి కూడా వారి జనాభాకు తగిన విధంగా అవకాశాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రి బలవంతుడనని వీర్రవీగుతున్నాడని…కానీ బలవంతమైన సర్పం చలిచీమల చేతిలో చనిపోయినట్లుగా ఆయనకు పరాభవం తప్పదన్నారు. రాష్ట్రంలో లంబాడాలు లేని తొలి ప్రభుత్వం ఇదేనని ఆమె చెప్పారు. ముస్లింలకు కూడా మొన్నటి వరకు కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదన్నారు. గత మూడేళ్లలో ముస్లింల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది 1500 కోట్లు మాత్రమేనని అన్నారు. లగచర్లలో లంబాడాలపై ఈ ముఖ్యమంత్రి చేసిన దాష్టీకాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. మక్తల్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దన్న టీచర్, రైతులపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాటం చేసినందుకు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో నర్సింహుల్ అనే రైతును పోలీసులు కొట్టి చంపారని ఆవేదనతో చెప్పారు. కుమ్మెర గ్రామంలో 2 నెలల చాకలి సామాజిక వర్గం చిన్నారి చనిపోతే ఇప్పటికీ చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే బహుజనం రాజ్యం రావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ ను గద్దె దించాల్సిందేనని అన్నారు. బీసీలకు, యువతకు అవకాశం ఇస్తున్న తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

కొడంగల్ లో ఇందిరమ్మ ఇళ్లకు కూడా డబ్బులు అడుగుతున్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కూడా డబ్బులు అడుగుతున్నారని కవిత చెప్పారు. ఇప్పటికీ నీళ్లు రాని ఎన్నో గ్రామాలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ మళ్లీ వెనక్కి వెళ్లిందన్నారు. గట్టు, కేటిదొడ్డు మండలాల్లో అప్ఘనిస్తాన్ తో సమానంగా అక్షరాస్యత ఉందని…అందుకు సీఎం సిగ్గుపడాలన్నారు. విద్యా శాఖ మంత్రిగాను ఉన్న ముఖ్యమంత్రి రెండేళ్లలో పరిస్థితి మార్చాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ కు 13 సీట్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇండ్లలో డబ్బుల దందా చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని కోరారు.

కవిత నోట గద్దర్ పాట

కోస్గీ సభలో గద్దర్ పాటతో కవిత ఆకట్టుకున్నారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల తీరు గురించి చెబుతూ ఆమె గద్దర్ పాటను పాడారు. భలే గుంది అసెంబ్లీ అంటూ గద్దర్ గతంలో పాడిన పాటను పాడి వినిపించటంతో ప్రజలంతా పెద్ద ఎత్తున చప్పట్లతో హోరెత్తించారు.

కిక్కిరిసిన సభ ప్రాంగణం

కోస్గీ సభ ప్రాంగణం వేలాది మంది ప్రజలతో కిక్కిరిసి పోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కవిత రాకకోసం జనం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ప్రారంభమయ్యే సరికి ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అంతకుముందు హైదరాబాద్ నుంచి కొడంగల్ కు 200 కార్లతో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వచ్చారు. హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ నుంచి కోస్గీ వరకు టీఆర్ఎస్ నాయకులు, మహిళలు కవితకు అడుగడుగునా మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. కొడంగల్ నుంచి కోస్గీ వరకు 20 కిలీమీటర్ల దూరం కవిత ప్రత్యేక బస్సులో ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. కోస్గీ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన జెండాను కవిత ఆవిష్కరించారు.

సీఎం .. సీఎం నినాదాలతో మార్మోగిన సభ ప్రాంగణం

కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ ప్రాంగణం సీఎం సీఎం నినాదాలతో మార్మోగింది.. కల్వకుంట్ల కవిత మాట్లాడేందుకు ముందుకు వచ్చిన సమయంలో ప్రాంగణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు సీఎం సీఎం అని నినాదాలు చేశారు.

చంద్రబాబు, రేవంత్ తర్వాత నేనే సీఎం

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తాను, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మహా కూటమి తరపున ప్రకారం చేశామని గుర్తు చేశారు. ఆ రోజు కోస్గి సభలో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి సీఎంలు అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో గెలిచి తాను సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar