భారత ఆర్థిక వ్యవస్థపై, అత్యున్నతస్థాయి సంస్థలపై రాహుల్ గాంధీ చేసిన నిరాధార వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఒకసారి చదవండి ఆయన ఏమన్నారో…

న్యూఢిల్లీ : ప్రభుత్వం అన్ని షాక్ అబ్జార్బర్‌లను (ఆటంకపరిచే వ్యవస్థలను) తొలగించడం వల్ల భారతదేశం “ఆర్థిక సునామీ” వైపు వెళుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన అసత్యపు వాదన నిరాధారమైనది మాత్రమే కాదు, అది నిజంగా దేశ ప్రజలలో లేని భయాందోళనలను రెచ్చగొట్టడమే. ఒకవేళ భారతదేశపు ఆర్థిక వ్యవస్థ యొక్క షాక్ అబ్జార్బర్‌లను నిజంగానే తొలగించి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతంగా పెరిగిన ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో సంఘర్షణ, దిగుమతులు, ఎగుమతులపై సప్లై చైన్ లో అంతరాయాలు, ఆర్థికంగా ప్రపంచం అనేక రకాల సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ, నిరంతర భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు నిలకడగా కొనసాగుతోంది?

వాస్తవమేమిటంటే, భారతదేశం ఒక బాహ్య ఒత్తిడిని ఎదుర్కొంటోంది, కానీ నిస్సహాయ స్థితిలో లేదు. ప్రభుత్వం ఏ రకమైన షాక్ అబ్జార్బర్‌లను తొలగించలేదు. 140 కోట్ల భారత ప్రజల సహకారంతో గత దశాబ్ద కాలంలో మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.

ఇది కూడ చదవండి-

ఈ సందర్భంగా మనం కొన్ని తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే,

  • బలమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తూ, ‘ఏప్రిల్, 2026’లో ఇ-వే బిల్లుల జారీ 11.8% ఉండగా ‘మే, 2026’లో అది 12.9% నికి వృద్ధి చెందింది.
  • తయారీ రంగ పీఎంఐ (PMI-Purchasing Managers’ Index) ఏప్రిల్‌లో 54.7 వద్ద స్థిరంగా విస్తరణ పరిధిలో కొనసాగి, మే నెలలో 56.6కు మెరుగుపడింది.
  • ప్రపంచ దేశాలలో సేవల రంగం పీఎంఐ (PMI) భారీగా పతనమైనా మనదేశంలో ఏప్రిల్‌లో 58.8 కాగా, మే నెలలో అది 58.9 వద్ద మరింత బలంగా ఉంది.
  • ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం 3.5% ఉండగా, మే లో అది 5.9% పెరిగింది.
  • ఏప్రిల్‌లో పట్టణ వాహన అమ్మకాలు 11.8% పెరగ్గా, గ్రామీణ వాహన అమ్మకాలు అంతకంటే బలంగా 13.8% పెరిగాయి.
  • ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48% వద్ద అదుపులో ఉంది—ఇది RBI నిర్దేశించిన 4% లక్ష్యం కంటే తక్కువ.
  • ఏప్రిల్ చివరి నాటికి బియ్యం మరియు గోధుమల బఫర్ నిల్వలు 817.53 లక్షల టన్నులుగా ఉన్నాయి, ఇవి బలమైన దేశ ఆహార భద్రతా కవచాన్ని అందిస్తున్నాయి.
  • 2026 ఆర్థిక సంవత్సరంలో స్థూల FDI పెట్టుబడులు 94.5 బిలియన్ డాలర్ల చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
  • విదేశీ మారక నిల్వలు అవసరమైనన్ని ఉండి, ప్రపంచ అస్థిరత నుండి మనదేశానికి రక్షణ కల్పిస్తున్నాయి.
  • బలమైన సేవల ఎగుమతులు బాహ్య స్థిరత్వానికి మద్దతునిస్తూ, వాణిజ్య లోటును తగ్గిస్తున్నాయి.

ఇవి ఆర్థిక వ్యవస్థలో షాక్ అబ్జార్బర్లు లేవనడానికి సంకేతాలు కావు. ఇవి పునరుద్ధరణకు, దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు సంకేతాలు. ప్రజలు, వ్యాపారాలు మరియు ఉద్యోగాలను రక్షించడానికి ప్రభుత్వం అనేక ప్రత్యక్ష మరియు పరోక్ష చర్యలు కూడా తీసుకుంది.

ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు వినియోగదారులకు ఊరటనిచ్చింది. దేశీయ లభ్యతను పరిరక్షించడానికి మరియు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి అవసరమైనప్పుడు సరఫరాను పెంచడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించడం, ఎగుమతుల మీద పరిమితులను విధించటం వంటి చర్యలు తీసుకుంది.

ECLGS(Emergency Credit Line Guarantee Scheme) 5.0 ద్వారా, MSMEలకు 100% గ్యారెంటీ కవరేజ్ లభిస్తుండగా, నాన్-MSMEలు మరియు విమానయాన సంస్థలకు 90% కవరేజ్ లభిస్తుంది. అర్హులైన రుణగ్రహీతలకు గరిష్ట నిర్వహణ మూలధనంలో 20% వరకు, గరిష్టంగా ₹100 కోట్ల పరిమితితో అదనపు రుణ సహాయం అందుబాటులో ఉంది. ఇంధన ధరల అస్థిరతను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలు ఒక్కో రుణగ్రహీతకు ₹1,500 కోట్ల వరకు భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం పొందుపరించింది.

ఈ చర్యలన్నింటి వెనుక ఒకటే లక్ష్యం ఉంది, అది ఉద్యోగాలను పరిరక్షించడం, సప్లై చైన్ ను కొనసాగించడం, నిరంతరాయంగా ఉత్పత్తిని పెంపొందించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దృఢంగా, స్థిరంగా ఉంచడం.

అదే సమయంలో, బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ద్వారా ఉపరితల బొగ్గు మరియు లిగ్నైట్ కోల్ గ్యాసిఫికేషన్ కోసం కేంద్ర కేబినెట్ ₹46,000 కోట్లను ఆమోదించింది. దీని లక్ష్యం 100 మిలియన్ టన్నుల గ్యాసిఫికేషన్ సామర్థ్యం కాగా, ఇది ₹3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సమీకరించే అవకాశం ఉంది.

ఇవి షాక్ అబ్జార్బర్‌లను నిర్వీర్యం చేసే ప్రభుత్వ చర్యలు కావు. ఇవి వాటిని చురుకుగా బలోపేతం చేసే ప్రభుత్వ చర్యలు.

అదే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో, తులనాత్మకంగా చూసినట్లయితే, 2011 నుండి 2013 మధ్య, రూపాయి విలువ 36% పడిపోయింది. విదేశీ మారక నిల్వలు జూలై 2011లో సుమారు 294 బిలియన్ డాలర్ల నుండి ఆగస్టు 2013 నాటికి దాదాపు 256 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతుల కవరేజ్ మార్చి 2004 నుండి సెప్టెంబర్ 2013 నాటికి ప్రమాదస్థాయికి పడిపోయింది. విదేశీ మారక నిల్వలు-బాహ్య రుణాల నిష్పత్తి FY11లో 95.8% నుండి FY14లో 68.8%కి క్షీణించింది.

డాలర్ డిపాజిట్లను ఆకర్షించడానికి RBI, FCNR(B)(Foreign Currency Non-Resident Bank) విండోను తెరిచి, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందించవలసిన దయనీయమైన పరిస్థితి వచ్చింది. ఈ పథకం ద్వారా భారతదేశం చివరికి 26.6 బిలియన్ డాలర్లను సమీకరించింది, ఇది 1991 IMF బెయిలౌట్ కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ.

2004-2014 ఆర్థిక సంవత్సరాల మధ్య ద్రవ్యోల్బణం సగటున 8.2% నికి దిగజారింది మరియు 2010-2014 ఆర్థిక సంవత్సరాలలో చాలా కాలం పాటు రెండంకెల స్థాయికి పడిపోయింది. పునర్‌వ్యవస్థీకరించిన ఆస్తులతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒత్తిడి, సెప్టెంబర్ 2013 నాటికి 12.3%కి పెరిగింది. 2009-2014 ఆర్థిక సంవత్సరాల మధ్య వరుసగా ఆరు సంవత్సరాల పాటు ద్రవ్యలోటు జీడీపీలో 4.5% లేదా అంతకంటే ఎక్కువగా కొనసాగింది. అన్నిటికంటే ముఖ్యంగా, మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా 2004-2014 ఆర్థిక సంవత్సరంలో 31% నుండి కేవలం 16%కి పడిపోయింది.

ఇదే UPA హయాంలో, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన అసలైన షాక్ అబ్జార్బర్ల తొలగింపు. రాహుల్ గాంధీ తెలుసుకోవలసిన నిజాలు ఇవి. ఎలాంటి షాక్ లు లేకుండానే కాంగ్రెస్ దేశాన్ని బలహీనపరిచింది.

కోవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల, ప్రపంచ రేట్ల పెంపు, సప్లై చైన్ అంతరాయాలు, ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ఏర్పడిన తీవ్ర అస్థిరత వంటి పదేపదే వచ్చిన షాక్‌లకు ముందు, షాక్ ల సమయంలో కూడా మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ధైర్యంతో, దేశ ప్రజల సహకారంతో బలోపేతం చేసింది.
అనేక అనూహ్య సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది, ‘ఫ్రాజైల్ ఫైవ్’ (బలహీనమైన ఐదు) ఆర్థిక వ్యవస్థల జాబితా నుండి ‘టాప్ ఫైవ్’ (మొదటి ఐదు) జాబితాలోకి చేరింది, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంది, మౌలిక సదుపాయాలను అపూర్వమైన వేగంతో విస్తరించింది మరియు దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసింది.

కనీసం ఇకనైనా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ, బాధ్యతారహితంగా ప్రపంచంలో భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించడం మరియు మన దేశ ప్రజలలో లేని భయాందోళనలు సృష్టించడం ఆపాలి. భారతదేశం ప్రపంచవ్యాప్త ప్రతికూలతలను ఎదుర్కొంటోంది, కానీ వాటిని బలమైన నిల్వలు, తక్కువ ద్రవ్యోల్బణం, మెరుగైన మౌలిక సదుపాయాల వ్యయం, బలమైన దేశీయ డిమాండ్, రికార్డు స్థాయి FDI పెట్టుబడులు, గణనీయమైన ఆహార నిల్వలు మరియు MSMEలు, పరిశ్రమలకు కావాలసిన మద్దతును అందిస్తూ ఎదుర్కొంటోంది.

రాహుల్ గాంధీ చెబుతున్న ఈ ఆర్థిక సునామీ వారి అసమర్థ నాయకత్వంలో కొనసాగిన 2013 నాటిది.

మోదీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ విపరీతమైన అవినీతి కుంభకోణాలతో దేశంలో బలహీనతలను సృష్టించింది. మోదీ ప్రభుత్వం పునరుద్ధరణ శక్తిని సృష్టిస్తోంది.

రాహుల్ గాంధీ చెప్పినదాని ప్రకారం, గత మూడేళ్లుగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు, న్యాయమూర్తులు, చట్టసభలు, సంస్థలు, మరియు వ్యవస్థలోని దాదాపు ప్రతి ఒక్కరూ రహస్యంగా ఆయన కోసం పనిచేస్తూ, నిరంతరం ఆయనకు సమాచారం అందిస్తూ ఉన్నట్లయితే, ఇంతటి అసాధారణమైన నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, ఆయన పార్టీ ఎన్నికలలో అతి ఘోరంగా డిపాజిట్లు కోల్పోతూ, ప్రజల ఆదరణ కోల్పోయి వరుసగా ఓడిపోతూ, రాజకీయంగా ఎందుకు కుంచించుకుపోతోంది? ఎన్నికల రిగ్గింగ్‌కు సంబంధించి ఊహాజనిత తప్పుడు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క ఆరోపణ కూడా ప్రజా కోర్టులో, న్యాయస్థానంలో ఎక్కడా రుజువవ్వలేదు.

ఇది ఒక స్పష్టమైన ప్రశ్నను లేవనెత్తుతుంది; ఇంతకాలం అందరూ రాహుల్ గాంధీ కోసమే పనిచేస్తుంటే, ఆయన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారు? SIR ప్రక్రియ జాతీయ ప్రయోజనాలకు మంచిదని ప్రధాన ఎన్నికల కమిషనర్ తో సహా దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయినప్పటికీ, విదేశీయులను, అక్రమ ఓటర్లను మరియు చొరబాటుదారులను ఓటర్ల జాబితాలోనే ఉండాలని దుర్మార్గపు ఆలోచనతో కోరుకుంటున్నందుకే రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారా?

కొన్ని రోజులుగా ప్రతి కొన్ని నెలలకొకసారి, ఏదో ఒక అబద్దపు, ఊహాజనిత, దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేకతతో కూడిన తుస్సుమనే డ్రామా బాంబులతో రాహుల్ గాంధీ ఒక కొత్త కుట్ర సిద్ధాంతాన్ని సృష్టిస్తారు. మొదట, ప్రజాస్వామ్యం అంతమైపోయింది; తర్వాత సంస్థలను స్వాధీనం చేసుకున్నారు; ఆపై ఎన్నికల రిగ్గింగ్; ఇప్పుడు ఎమర్జెన్సీ రాబోతోందని, ఆర్థిక సునామీ పొంచి ఉందని వితండ వాదనతో ప్రజలను రెచ్చగొట్టాలని, కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆ కుర్చీలో తాను అమాంతం కూర్చోవాలని, ప్రధానమంత్రి పదవి తన కుటుంబ హక్కు అని, ఈ దేశంలో నేనే రాజుననే భ్రమలతో కాలం గడుపుతున్నాడు.

రాహుల్ గాంధీకి వాస్తవాలపై ఆసక్తి ఉందా, లేక తన పార్టీ పదేపదే ఎన్నికలలో ఎందుకు విఫలమవుతోందో దేశ ప్రజలకు వివరించలేక కేవలం భయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తున్నారా? స్పష్టం చేయాలని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X