విప్లవ పూర్వ విద్యార్థి వేదిక పిలుపు: నిరాశ ప‌డ‌కండి ! విప్లవోద్యమం మీద విశ్వాసం వీడ‌కండి !!

విప్లవోద్యమం బలంగా ఉన్నప్పుడు ఎవరైనా దానితో కలిసి నడుస్తారు. దానికి జేజేలు పలుకుతారు. తాము ఉద్యమాల్లో ఉన్న కాలం స్వర్ణయుగమని కీర్తిస్తారు. ఇవన్నీ చాలా తేలిక. అదే విప్లవోద్యమం యుద్ధం మధ్య చిక్కుకొని నష్టపోతున్నప్పుడు దానితో కలిసి నడవడం చాలా కష్టం. దాన్ని అర్థం చేసుకోవడం మరీ కష్టం. విప్లవోద్యమం తప్పు పంథాలో పోతున్నదనేవాళ్లు పెరిగిపోతారు. ప్రభుత్వ హత్యాకాండను చూసి విచారానికి లోనుకావడం సహజమే. కానీ నిరాశకూ, వ్యతిరేకతలకూ గురైనవాళ్లు మొత్తంగా విప్లవోద్యమ భవితవ్యాన్నే సందేహిస్తారు. ప్రాణ నష్టం జరగకూడదనుకోవడం గొప్ప మానవీయ విలువే. కానీ హింస ఎవరి వల్ల జరుగుతున్నదో, ఎవరు రక్తపాతానికి పాల్పడుతున్నారో పట్టించుకోరు. లేదా అప్రధానం చేస్తారు. విప్లవోద్యమాన్ని ఆపేస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయనే వాదన లేవదీస్తారు. ఈ మార్గాన్ని వదిలేసి ఇంకో సురక్షిత, సులభ మార్గంలో విప్లవం చేయాలని అంటారు. దీనికి గంభీరమైన పదజాలాన్ని వాడుతారు. సారాంశంలో ఇంకో పంథా ఏదీ చెప్పకుండా పండిత చర్చతో ముగిస్తారు.

ఈ పని విప్లవోద్యమాన్ని పరిశీలిస్తున్నవారే కాదు. ఉద్యమ నాయకత్వం కూడా చేసే ప్రమాదం ఉంది. ఇటీవల అదే జరిగింది. విప్లవంలో వెళ్లినవాళ్లు జీవితపర్యంతం అక్కడే ఉండాలని ఎవ్వరూ అనరు. జీవితాన్నంతా విప్లవోద్యమానికి తగినట్లు సిద్ధం చేసుకున్నవాళ్లకే అది సాధ్యం. కష్టాలు ఎన్ని ఎదురైనా విప్లవాన్ని చారిత్రకంగా చూసినవాళ్లే చివరి క్షణం దాకా అందులో కొనసాగుతారు. లేని వాళ్లు ఇంటికి వచ్చేస్తారు. కానీ విప్ల‌వోద్య‌మ నాయ‌కులు మ‌ల్లోజుల వేణుగోపాల్‌, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి వాసుదేవ‌రావు దీనికి విరుద్ధంగా దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా తప్పని, విప్లవోద్యమం అతివాద పంథాలో పోతున్నదని, అన్నీ తప్పులే చేసిందనీ, చట్టబద్ధ పోరాటాలను నిర్లక్ష్యం చేసిందనీ, అనేక మార్పులకు లోనవుతున్న ఈ వ్యవస్థను మార్చడానికి సాయుధ పోరాటం తగదనే వాద‌న లేవ‌దీశారు. ఆయుధాల‌తో, సైనిక దుస్తుల‌తో, అనుచ‌రుల‌తో లొంగిపోయారు. మావోయిస్టు మార్గమే తప్పు అనుకొనే మేధావులు వీళ్ల దగ్గర ఇంకేదో విప్లవ ప్రత్యామ్నాయం ఉందని భావించారు. కానీ ఈ నాయ‌కులు లొంగిపోయిన‌ తీరు వారిని ఘోరంగా నిరాశపరిచింది.

Also Read-

ఈ పరిణామం ఎందుకు ఇలా జరిగింది? అనేది కీలక ప్రశ్న దగ్గరికి మేధావులు వెళ్లరు. వారికి ఆ అవసరం కూడా ఉండదు. కానీ ఈ విద్రోహం విప్లవాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆపరేషన్‌ కగార్‌ వల్ల విప్లవోద్యమం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో జ‌రిగిన ఈ లొంగుబాటు రాజకీయ, సిద్ధాంతపరంగా దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. దాన్ని తార్కికంగా, ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవాల్సిందే. విప్లవాభిమానులు ఉద్యమానికి మరింత అండగా ఉండి, తాము చేయగల పనులు అన్ని రంగాల్లో చేయాల్సిందే. అంతేగాని, నిరాశా నిస్పృహలకు గురి కాకూడదు. ఈ సంక్షోభం నుంచి విప్లవోద్యమం బైటపడ్డానికి నైతికంగా, రాజకీయంగా దోహదం చేయాల్సిందే. త‌ద్వ‌రా వ‌ర్గ‌పోరాటంలో దృఢంగా నిల‌బ‌డాల్సిందే.

విప్లవోద్యమ నిర్మూలనకు ప్రభుత్వం అంతర్యుద్ధం చేస్తున్న తరుణంలో, లోపలి నుంచి సాయుధ పోరాట విరమణ అనే వాదన వచ్చింది. లక్షల సైనిక బలగాలు, ఇజ్రాయిల్‌ ఆయుధాలు, గగనతల దాడులు, సాంకేతిక వనరులు అన్నీ కలిసినా విప్లవోద్యమాన్ని కొద్దిమేరకే నష్టపరిచాయి. అంత‌కంటే ఎక్కువ న‌ష్టం సాయుధ పోరాట విర‌మ‌ణ పేరుతో లొంగుబాటుదార్లు చేశారు. బహుశా వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఇది అతి పెద్ద విద్రోహమ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇది ఇంకా పూర్తి కాలేదు. పోలీసు క్యాంపులో ఉన్న లొంగుబాటుదారులు ఉద్య‌మంలో ఉన్న వాళ్లంద‌రినీ ఇండ్ల‌కు వ‌చ్చేయ‌మ‌ని పిలుపు ఇస్తున్నారు. లొంగిపోవ‌డానికి త‌మ‌ను కాంటాక్ట్ చేయ‌మ‌ని ఫోన్ నెంబ‌ర్లు కూడా ఇచ్చారు. ఈ వీడియో, ప్ర‌క‌ట‌న పోలీసుల నుంచి అందాయ‌ని ప‌త్రిక‌లే రాశాయి. త‌మ విద్రోహ ప‌రంప‌ర వ్యూహాత్మ‌కమైంద‌ని లొంగిపోయిన వాళ్లే నిరూపించుకుంటున్నారు.

సాల్వాజుడుం పేరుతో ఇర‌వై ఏళ్ల కింద మొద‌లైన అణ‌చివేత క‌గార్ నాటికి యుద్ధంగా మారింది. దీని వ‌ల్ల విప్ల‌వోద్య‌మం అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ది. ఈ యుద్ధం మ‌ధ్య‌నే రెండు ద‌శాబ్దాలు నిల‌బ‌డ‌గ‌లిగినా, విస్త‌ర‌ణ‌-కుదింపు-విస్త‌ర‌ణ‌ల‌ మ‌ధ్య వెనుకంజ‌కు గురైంది. ఈ ప‌రిస్థితిలో ఉద్య‌మం ఎట్లా ముందుకు వెళ్లాల‌నే విష‌యంలో ఎన్ని భిన్నాభిప్రాయాలైనా క‌ల‌గ‌వ‌చ్చు. నిజంగానే పంథా మీద చ‌ర్చించ‌వ‌ల‌సిన విష‌యాలు ఉంటే ఉద్యమంలో ఉంటూ దాన్ని స‌వ‌రించేందుకు దోహ‌దం చేయాలి. కానీ ఏక‌ప‌క్షంగా సాయుధ పోరాట విర‌మ‌ణ‌కు పిలుపు ఇచ్చి లొంగిపోవ‌డం ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేయ‌డ‌మే. యుద్ధకాలంలో ఇట్లాంటి విపరీతాలకు, ప్రతిఘాతుకాలకు అవకాశం ఉంటుంది. ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఇలాంటివి ఎన్నో జ‌రిగాయి.

ఈ విషయం పట్టించుకోని వాళ్లు విప్లవోద్యమం తన పంథాను వదిలేయాలనే వాదనను ప్రధానం చేశారు. సరిగ్గా రాజ్యం కోరుకుంటున్నది ఇదే. రాజ్యాంగ వ్యతిరేక, మానవ వ్యతిరేక కగార్‌ మీది నుంచి దేశం దృష్టి విప్లవోద్యమ పంథా మీదికి తీసుకపోవడమే ప్రభుత్వ లక్ష్యం. అణచివేతను, దాని రాజకీయార్థిక వ్యూహాన్నీ ఖండించాల్సిన గొంతులన్నీ విప్లవకారుల మార్గం తప్పని చెప్పడానికి తమ శక్తినంతా వెచ్చిస్తున్నాయి.

ఒకవేళ మావోయిస్టులందరూ పోరాట విరమణ చేస్తే ఉద్యమ ప్రాంతాల్లోని ప్రజల, ఆదివాసుల గతి ఏమిటనే సందేహం ఒక్కరికి కూడా కలగలేదు. ఆదివాసులకు రాజ్యాంగం ఇచ్చిన చట్టాల అమలు సరే, ఇంతకూ వాళ్లను అడవుల్లో, గ్రామాల్లో బతకనిస్తారా? లేక కార్పొరేట్ల మైనింగ్‌లో బానిసలుగా మార్చేస్తారా? అనే భయం కలగలేదు. సాయుధ పోరాటం విరమిస్తే అక్కడ మావోయిస్టులైనా, మరెవరైనా సరే ‘ప్రజాస్వామిక’ పోరాటం చేసే అవకాశం ఉంటుందా? అసలు భారత రాజ్యం ఇంత నిరంకుశ శక్తిగా మారిపోయాక ప్రజాస్వామిక పోరాటాలకు కనీసంగా చోటు ఉంటుందా? ఇది సాయుధ పోరాటానికి కానికాలమని సులభంగా చెప్పారుగాని మిగతా పోరాట రూపాలకైనా ఏపాటి అవకాశం ఉన్నది? విప్లవ భావజాలం వదులుకొని లొంగిపోయినవాళ్లు సరే, ఆయుధం పక్కనపెట్టినంత మాత్రాన విప్లవకారులను ఈ ప్రభుత్వం బతకనిస్తుందా? అనే అతి మామూలు ప్రశ్నలు కూడా ఎవ్వరూ వేసుకోలేదు.

ప్రభుత్వం, మీడియా చాలా చాకచక్యంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల మీది నుంచి, శాంతి చర్చల మీది నుంచి విప్లవోద్యమ పంథా మీదికి, లొంగుబాట్ల మీదికి స‌మాజాన్ని లాక్కెళ్లాయి. సాయుధ విరమణ అనే వాద‌న‌ సరైందని ప్రచారం చేసే వాతావరణం ఏర్ప‌డింది. ఈ స్థితిలో కూడా సాయుధ పోరాటం కొనసాగిస్తామని విప్లవోద్యమం ఇచ్చిన ప్రకటన కొంద‌రు మేధావుల‌కు విసుగనిపించింది. తెలివితక్కువతనం అనిపించింది. పంథా పట్ల పవిత్ర భావన అనిపించింది. ఇంత చేసీ, వీళ్లు విప్లవోద్యమ మార్గాన్ని వదిలేయమని చెప్పడం తప్ప ఇంకో అర్ధ‌వంత‌మైన చ‌ర్చ ఏదీ చేయ‌డం లేదు.

నిజంగానే విప్లవోద్యమం ఏమీ సాధించలేదా? అసలు విప్లవోద్యమం విజయాలనూ, సవాళ్లనూ క‌లిపి పరిశీలించే అధ్యయన పద్ధతి వీళ్ల దగ్గర ఉన్నదా? విప్లవోద్యమం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజాస్వామికవాదుల సూచనలను ఎన్నడూ పట్టించుకోలేదా? నిర్బంధం వల్లనే పట్టణ, మైదాన ప్రాంత ప్రజలకు దూరమైందనే సంగతి తెలియదనుకోవాలా?.. హేతుబద్ధంగా, ప్రజాస్వామికంగా చర్చించే సంప్రదాయాన్ని మేధావులు వదిలేసుకొని విప్లవోద్యమ భవిష్యత్తు మీద సందేహాలు లేవదీస్తున్నారు.

కానీ ఇప్పటికీ స‌మాజ మౌలిక మార్పుకు దీర్ఘ‌కాలిక ప్రజాయుద్ధం తప్ప మరో పోరాట మార్గం ఏదీ ముందుకు రాలేదు. వేగవంతమవుతున్న రాజకీయార్థిక మార్పులు, మార్మికమవుతున్న దోపిడీ పద్ధతులు, సంక్లిష్టమవుతున్న సాంస్కృతిక భావజాల వ్యవస్థలు, మానవ సంబంధాలన్నిటిలో తీవ్ర‌మ‌వుతున్న‌ హింసా రూపాలు వర్గపోరాట అవసరం పెంచుతున్నాయి. సాయుధ, చట్టబద్ధ ప్రజాస్వామిక పోరాటాల కలయికగా, మన దేశ నిర్దిష్ట పరిస్థితుల్లో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను కోరుతున్నాయి. సాంస్కృతిక భావజాల పోరాటాలను మరింత తప్పనిసరి చేస్తున్నాయి. ఈ దిశగా విప్లవోద్యమం చాలా కృషి చేసింది.

ఈ మొత్తాన్నీ విమర్శనాత్మకంగా చూసి మదింపు వేయకుండా ‘మావోయిస్టులు మారాలి’ అనే వాదన వినిపిస్తున్నారు. ఎట్లా మారాలి? సాయుధ పోరాటం విరమించి ఎన్నికల రాజకీయాల్లోకి రావడమేనా? అంటే వ్యవస్థలో భాగం కావాలి అనేకదా? దీని ముద్దు పేరు ‘ప్రజల్లోకి రావడం’. ఈ వాదనలను స‌రిగా అర్థం చేసుకోకుంటే విప్లవాభిమానులు ఆత్మ స్థైర్యం కోల్పోతారు. విప్లవ పంథా మారాలేమో అనుకుంటారు. పూర్వ విప్లవ విద్యార్థి వేదిక కూడా విప్లవాభిమానుల బృందమే. ఒకప్పటి విప్లవ విద్యార్థి ఉద్యమానికి మార్గదర్శి విప్లవోద్యమం. ఆ మార్గంలో కొద్దికాలం పని చేసిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న ఈ వేదిక ప్ర‌స్తుత సంక్షోభాన్ని సంక్షోభంగా గుర్తించాలని అనుకుంటున్నది. విప్లవోద్యమాన్ని ఒక నిర్మాణంగా దెబ్బతీయడానికేగాక ఏకంగా విప్లవోద్యమ పంథాను తుడిచిపెట్టాలని ప్రభుత్వం చేస్తున్న ఈ అంతర్యుద్ధంలో చారిత్రక, తార్కిక విశ్వాసాన్ని తాను నిలబెట్టుకుంటూ.. మిగతా విప్లవాభిమానులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది. వర్గపోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని చరిత్ర నియమంగా గుర్తించాలని కోరుతున్నది. విప్లవోద్యమం తన ముందున్న అన్ని సవాళ్లను అధిగమించేందుకు అభిమానులందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నది

పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X