సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగం
బీజేపీకి సంక్షేమం, సంస్కారం తెలియవు
కాంగ్రెస్ ఎంగిలి చేతితో మెతుకులు వేసేలా పెన్షన్ ఇచ్చేది
సంక్షేమ సంబరాల్లో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
నడిపల్లి: తెలంగాణ సీఎం కెసిఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణ యుగంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అధికారుల కష్టం, ప్రజా ప్రతినిధుల ఆలోచన వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో నెంబర్ వన్ గా నిలిచింది అని చెప్పారు.
బీజేపీకి సంస్కారం,సంక్షేమం రెండూ తెలియవని విమర్శించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఎంగిలి చేతితో మెతుకులు వేసేలా పెన్షన్ లు ఇచ్చారని, కానీ మన తెలంగాణ లో అమ్మ ప్రేమ లాగా కడుపు నింపే విధంగా పెన్షన్ లు ఇచ్చుకుంటున్నామన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా నడిపల్లిలో జరిగిన సంక్షేమ సంబరాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.
సబ్బండ వర్గాలు చల్లగా ఉండాలని అమలు చేసే కార్యక్రమాలే సంక్షేమ కార్యక్రమాలని, నిరుపేదలు ఆత్మాభిమానంతో బ్రతికేలా చేయటమే నిజమైన సంక్షేమమని అన్నారు. జిల్లా లో 10వేల మంది ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నామని, ఎంతో మంది కిడ్నీ పేషంట్ ల కోసం జిల్లాలో 33 డయాలలిస్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని, అది సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని అన్నారు. జిల్లాలో 96 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ అంటే మా వాడు అని రైతులు గర్వంగా చెప్పుకుంటున్నరని, విత్తు నాటే దగ్గర నుండి పంట చేతికి వచ్చేవరకు రైతులకు అండగా ఉంటున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జిల్లాలో 2 లక్షల 60 వేల మందికి రైతు బందు ఇస్తున్నామని, ఇప్పటివరకు రూ. 2385 కోట్ల రూపాయలు రైతు బందు ద్వారా అందించామని వివరించారు.