దేశంలో 2వ స్థానం, రాష్ట్రంలో నెంబర్ వన్
ములుగు జిల్లాకు నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం
ములుగు జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు
వరంగల్ : ఈ నెల 7వ తేదీన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ములుగు జిల్లా దేశంలో 2వ స్థానం, రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలవడం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు సంతోషం వ్యక్తం చేస్తూ, సంబంధిత ములుగు జిల్లా కలెక్టర్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించారు. పైగా 76 లక్షల నగదు బహుమతి కూడా గెలిచిన సందర్భంగా మంత్రులు ఆ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను అభినందించారు.
హనుమంకొండలోని హరిత హోటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ముందు చూపు, వారి మానస పుత్రికలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు అమలు చేయడం వల్ల గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు అయినా, ఉమ్మడి రాష్ట్ర పాలకులు, దేశ పాలకులు మన గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
వారి నిర్వాకం వల్ల తెలంగాణ వెనుబడి పోగా, కెసిఆర్ ఉద్యమించి సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రత్యేకించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా తెలంగాణ పల్లెలు దేశానికే పట్టుగొమ్మలుగా నిలిచాయని, ఆదర్శంగా మారాయని అన్నారు. ములుగు జిల్లాతోపాటు, గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిల్లోనూ 13 అవార్డులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మేల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ములుగు ఇన్ చార్జీ కలెక్టర్, భూపాలపల్లి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, భవేష్ మిశ్రా లు పాల్గొన్నారు.