Hyderabad: దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ దాదాపు 7 గంటలకుపైగా విచారించిన సీబీఐ అధికారులు వెళ్తూ ఆమెకు 91 సీఆర్పీసీ నోటీసులను ఇచ్చారు. తాము చెప్పిన చోట విచారణకు రావాలని ఆమెకు నిర్దేశించారు. త్వరలోనే విచారణకు సంబంధించిన తేదీలను తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలను కవిత నుంచి తెలుసుకున్నారు. ఈ కేసులో అధికారులకు ఉన్న సందేహాలను సంధించిన అధికారులు.. ఆమె ఇచ్చిన సమాధానాలను రికార్డు చేసుకున్నారు. క్కర్ కేసు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే సీబీఐ అధికారులు విచారించింది. అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో అధికారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునే నేపథ్యంలో ఎక్కువగా సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ స్పష్టత తీసుకున్నట్టు సమాచారం.
అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. కవితకు సీబీఐ నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. (Agencies)