ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతు అనుకూల పథకాలతో పంటల దిగుబడులు బాగా పెరిగాయి
పత్తి కనీస మద్దతు ధర పెంచుతూ, 5% జీఎస్టీని రద్దు చేసి నేతన్నలను ఆదుకోండి: ఎంపీ రవిచంద్ర
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ రవిచంద్ర
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రైతు అనుకూల పథకాలు అమలు చేస్తుండడంతో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాజ్యసభలో శుక్రవారం ఆయన ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా 10వేల రూపాయల చొప్పున రైతులకు, వ్యవసాయ మోటార్లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే, సాగునీళ్లు కూడా అందుబాటులోకి రావడంతో తెలంగాణలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని రవిచంద్ర వివరించారు. ఈ ఏడాది కూడా వరి, పత్తి దిగుబడులు బాగా పెరిగాయని, పత్తికి ప్రస్తుతం ఇస్తున్న 6,080 రూపాయల కనీస మద్దతు ధరను 12వేల రూపాయలకు పెంచాల్సిందిగా, చేనేతపై ప్రస్తుతం విధిస్తున్న 5% జీస్టీని పూర్తిగా రద్దు చేసి నేతన్నలకు ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రవిచంద్ర ప్రశ్నకు చేనేత, జౌళి శాఖ మంత్రి శ్రీమతి దర్శన్ విక్రమ్ జర్దోష్ స్పందిస్తూ, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాన్ని నోట్ చేసుకున్నానని, ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందని బదులిచ్చారు.