సర్వశక్తి సంపన్నుడూ, సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ అయిన దేవుడి ఉనికిని నేను నమ్మకపోవడం అహంకారంవల్లనా? ఇది నాలో ఉదయించిన కొత్త ప్రశ్న. ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. అయితే దైవం కన్నా నేనే గొప్ప అనే ఆధిక్యభావన నాలో ఉన్నందువల్లనే దేవుని ఉనికిని నిరాకరిస్తున్నానని, దేవుణ్ణి నమ్మకపోవడానికి కొంతవరకు నా అహంకారము కూడా కారణమని నా మితృలుకొందరు నాతోవున్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని మాటల సందర్భంగా నాతో సూచనగా అన్నారు. వీళ్ళు నామిత్రులని అనుకోవడం ఎంతవరకు సరైందో తెలియదు. ఈ సమస్య మాత్రం తీవ్రమైనదే. మానవ సహజమైన ఈ లక్షణాలకు నేను అతీతుణ్ణని గొప్పలు చెప్పుకోవడం లేదు. నేనూ మామూలు మనిషినే. అంతకుమించి మరేమీ కాదు. నేనేకాదు, ఎవరైనా అలా అనుకోలేదు. నా స్వభావంలో అహంకారం ఒక భాగం. ఈ బలహీనత నాలోనూ ఉంది. నా మిత్రులు నన్ను నియంత అని పిలిచేవాళ్ళు. నా ముఖ్య స్నేహితుడు బి. కె. దత్ కూడా అలాగే పిలిచేవాడు. కొన్ని సందర్భా లలో నిరంకుశుడని నన్ను నిందించడంకూడా జరిగేది. నా అభిప్రాయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్ది, నాసూచనల్ని ఆమోదింపచేసుకుంటానని కొందరు తీవ్రంగా ఆక్షేపించేవాళ్ళు. కొంతవరకైనా ఇది నిజమని నేనూ అంగీకరిస్తాను. ఇది అహంభావమే కావచ్చు. బాగా ప్రచారంలోవున్న ఇతర భావధోరణులకూ, నా భావధోరణికి ఘర్షణ జరిగినప్పుడు నాలో అహంకారం తొంగిచూస్తుంది. అయితే ఇది వ్యక్తిగతమైనది కాదు. నా ధృక్పధం పట్ల నాకున్న గట్టి నమ్మకమేగాని, గర్వం కాదు. ఒక వ్యక్తికి తానంటే ఉన్న గర్వాతిశయాన్నే అహంకారం అంటాం. నన్ను నాస్తికుణ్ణి చేసింది ఈ అహంకారమేనా? లేక కొంతకాలంపాటు ఈవిషయం గూర్చి శ్రద్ధాశక్తులతో నేను చేసిన అధ్యయనమా? దీన్నిగురించి నేనిక్కడ చర్చిస్తాను. అహంభావానికి, గర్వానికీ తేడా వుందన్న విషయాన్ని మొదట స్పష్టం చెయ్యాలి.
దేవుణ్ణి నమ్మకపోవడానికి అనుచితమయిన గర్వంకానీ, మితిమీరిన అహంకారం కాని ఎలా కారణాలవుతాయో నాకర్ధం కావడంలేదు. సరైన యోగ్యతా, అవసరమైన సుగుణాలు లేకుండానే కొంతయినా నేను ప్రజాభిమానం పొందిఉంటే, ఒక మహాపురుషుడి గొప్పదనాన్ని నిరాకరించగలను. ఆ మేరకది సాద్యమే. అయితే దేవుడిపైన నమ్మకం వున్నవాడు కేవలం తన గర్వం మూలంగా ఆ నమ్మకాన్ని ఎలాపోగొట్టుకోగలడు? ఇది రెండు రకాలుగా జరగవచ్చు – మానవుడు తాను డేవుడికి పోటీదారుణ్ణని భావించడం వల్లా, లేదా తానే దేవుణ్ణని అనుకోవడం వల్లా. ఈ రెండు సందర్భాలలోనూ అతడు నిఖార్సయిన నాస్తికుడు కాలేడు.
దేవుడికి తాను పోటీదారుణ్ణీ అని భావించినప్పుడుగానీ, లేక తానే దేవుణ్ణని ఆనుకున్నప్పుడు గానీ రెండు సందర్భాలలోనూ దేవుడి వునికిని వొప్పుకున్నట్టయింది. ఆ దేవుడు తానే అనుకొన్నా వేరే అనుకొన్నా ననకొక్కటే. ప్రధానమైనది, అతని నమ్మకం. దానికిక్కడ స్థానం ఉంది. కాబట్టి ఏవిధంగా చూసినా అతడు నాస్తికుడుకాడు. మరి నా విషయానికొస్తే, పైరెండు ధోరణులకు చెందినవాణ్ణి కాను నేను. సర్వ శక్తి సంపన్నుడైన ఆ పరమ పురుషుడి ఉనికినే కాదంటున్నాను. ఎందుకు కాదంటున్నానో తర్వాత చెబుతాను. నాస్తికవాద సిద్ధాంతాన్ని నేను అనుసరించానంటే గర్వం వల్ల మాత్రం కాదని ముందిక్కడ స్పష్టం చెయ్యాలి. నేనే ఆ పరమ పురుషుణ్ణి కాను. అతగాడి అవతారాన్ని కాను. పోటీదారుణ్ణి అంతకంటేకాను.
Also Read-
ఇలాంటి భావధోరణికినన్ను మరల్చింది గర్వం మాత్రం కాదనేది పచ్చినిజం. నాపై ఉన్న ఈ ఆరోపణ నిజంకాదని నిరూపించేందుకు ఇంకా కొన్ని వాస్తవ విషయాల్ని పరిశీలిద్దాం. ఢిల్లీ బంబు కేసులోనూ, లాహోర్ కుట్ర కేసులోనూ జరిగిన విచారణమూలంగా నాకు తగని ప్రజాభిమానం లభించి గర్వబోతునయ్యానని నా మిత్రుల అభిప్రాయం. వీరి ఊహల్లో నిజమెంతో చూద్దాం. నా నాస్తికవాదం ఇటీవల వచ్చిందేమీకాదు. ఏ పేరూ ప్రఖ్యాతీ లేని ఒకానొక యువకుడిగా ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్మడం మానేశాను. అప్పటికీ నేననేవాణ్ణి ఉన్నానన్న సంగతే ఈ మిత్రులికి తెలియదు. గర్వం వల్ల కనీసం కాలేజీ విధ్యార్ధి కూడా నాస్తికుడు కాలేడు. కొందరు ప్రొఫెసర్లకు నేనంటే ఇష్టమే. కొందరికి మాత్రం అయిష్టంగా ఉండేది. నాకు కష్టపడి చదివే అలవాటుండేదికాదు. అందువల్ల గర్వంలాంటి భావాలు కలిగే అవకాశమేలేదు. నా జీవితం భవితవ్యాన్ని గురించి నాకు నిరాశాపూరితమైన దృక్పధం ఉండేది. పైగా చాలా జంకు.ఆ రోజుల్లో నా నాస్తికత అంతంతమాత్రంగానే ఉందేది. మా తాతగారి పెంపకంలో పెరిగినందువల్ల ఆయన ప్రభావం నామీద వుండేది. ఆయన శుద్ధ ఆర్యసామాజికుడు. ఆర్యసామాజికుడు ఏమైనా కాగలడుగానీ, నాస్తికుడు మాత్రం కాడు.
నేను ప్రాధమిక విద్య పూర్తిచేసి లాహోరులో డి.ఏ.వి. స్కూల్లో చేరాను. ఒక ఏడాదంతా హాష్టల్లో చేరాను. అప్పట్లో ఉదయం సాయంత్రం ప్రార్ధనలుచేయటం అటుంచి గంటలకొద్దీ గాయత్రీ మంత్రం జపించేవాణ్ణి. అంటే నాలో అచ్చమైన భక్తి ఉందన్నమాట. ఆ తర్వాత మానాన్నగారి దగ్గర వుంటూవచ్చాను. మతాలకు సంబంధించి పూర్వాచార పరాయణత్వం విషయంలో మానాన్నగారిది విశాల దృక్పధం. ఆయన బోధల ద్వారానే స్వాతంత్ర్య సాధన కోసం జీవితాన్ని అంకితం చేద్దామని నిర్ణయించుకున్నాను. అయితే ఆయన నాస్తికుడేమీ కాడు. చాలా గట్టి ఆస్తికుడు. రోజూ నన్ను కూడా ప్రార్ధనలు చేయమనేవాడు. నేనిలా పెరిగి పెద్దవాణ్ణయ్యాను. సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో జాతీయ కళాశాలలో చేరాను. కాస్త విశాలంగా ఆలోచిస్తూ మత సమస్యల్ని గురించి ,దేవుణ్ణి గురించి విమర్శనా దృస్టితో ఆలోచించడం మొదలు పెట్టింది అప్పుడే. అయినా అప్పటికి నేను భక్తిపరుణ్ణే. తలవెంట్రుకలు పెంచసాగాను. కొంతకాలానికి సిక్కుమతం,ఇంకా ఇతర మతాల పురాణాలపైనా, వాటి మూలసూత్రాలపైనా నమ్మకం పోయింది.అయినా దేవుడిపైన మాత్రం గట్టి నమ్మకం వుండేది.
ఆ తర్వాత విప్లవ పార్టీలో చేరాను. మొదట నాకు పరిచయమైన, ఆ పార్టీ నాయకుడికి డేవుడి విషయంలో గట్టి నమ్మకం లేకపోయినా, నిరాకరించగల సాహసం కూడాలోదు. దేవుణ్ణి గూర్చి ఆయన్ను గుచ్చి గుచ్చి అడిగేవాణ్ణి. ” నీ కిష్టమైనప్పుడు ప్రార్ధించు ” అనేవాడు. ఇదీ నాస్తిక వాదం కాదు. నాస్తిక వాదానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఆ తర్వాత నాకు పరిచయమైన మరొక నాయకుడు గట్టి నాస్తికుడు. ఆ కామ్రెడ్ పేరు శచీంద్రనాథ్ సన్యాల్. ఇప్పుడాయన కరాచీ కుట్రకేసు మూలంగా యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన ‘ బందీ జీవన్ ‘అనే పుస్తకం వ్రాసాడు. అది చాలా ప్రసిద్ధి పొందింది. మొదటి పేజీలోనే ఈశ్వర సంకీర్తనం కనిపిస్తుంది. వేదాంత మత ప్రభావమువల్ల భక్తిపారవశ్యంతో చేసే ఈశ్వర సంకీర్తనలు ఆయన ఆలోచనల్లో ప్రధాన భాగం. ఆపుస్తకం రెండోభాగం చివరి పేజీలో ఇది కనిపిస్తుంది. 1925 జనవరి 28న భారతదేశమంతటా పంచిపెట్టబడ్డ ”విప్లవ కరపత్రం“, ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం ఆయన శ్రమ ఫలితమే.
వ్యక్తిగతంగా తనకిష్టమైన భావాలను రహస్యంగా ఉండిపోయిన తన గ్రంధంలో వ్యక్తపరిచాడు. ఇది తప్పదు. ఆయన గొప్ప నాయకుడు కాబట్టి, ఎన్ని విభేధాలున్నా, తన అభిప్రాయాన్ని అనుచరులు మన్నించవలసిందే. సదరు కరపత్రంలో ఒక పేరా మొత్తం సర్వేశ్వరుణ్ణి, అతని లీలల్ని కీర్తించడానికే కేటాయించడం జరిగింది. ఇదంతా భక్తిపారవశ్యం. ఇంతకూ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే- విప్లవ పార్టీలో నాస్తిక భావం అంకురించనైనా లేదని, కకోరీ అమర వీరులు నలుగురూ తమ అంతిమ దినాన్ని ప్రార్ధనలతోనే గడిపేశారు. రాంప్రసాద్ బిస్మల్ పూర్వాచార పరాయణుడైన ఆర్య సామాజికుడు. సోషలిజం, కమ్యూనిజాల గురించి ఎంతో అద్యయనం చేసినప్పటికి, రాజన్ లాహిరి ఉపనిషత్ సూక్తాలనూ, గీతా వచనాలనూ వల్లించాలనే కోరికను చంపుకోలేకపోయాడు. దైవత్వానికి కారణం మానవ దౌర్భల్యమో, విజ్ఞాన పరిమితో తప్ప మరొకటి కాదంటూ, ప్రార్ధనలే చేయని వ్యక్తిని ఆ నలుగురిలో ఒక్కర్నే చూశాను. అతను కూడా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అంతటి వాడికి కూడా దేవుడి ఊనికిని కాదనే ధైర్యం లేకపోయింది.
అప్పటి వరకూ నేను ఒట్టి ఆదర్శవాద విప్లవకారుణ్ణి మాత్రమే. మేమంతా అనుచరులమే. మొత్తం బాధ్యతను భుజాన మొయ్యవలసిన సమయం ఇప్పుడొచ్చింది. అనివార్యమైన ప్రభుత్వ దమనకాండ వల్ల పార్టీ వునికే కొంతకాలం అసాధ్యమైపోయింది. ఉత్సాహవంతులైన కామ్రెడ్లు – వారు నాయకులు కూడా – మమ్మల్ని హేళన చేయసాగారు. మా కార్యక్రమం వ్యర్ధమౌతుందేమోనని, నేను కూడా ఏదో ఒక రోజున ఆశ వదులుకోవలసి వస్తుందేమోనని భయంగా వుండేది. నా అంతరంగంలో ” అధ్యయనం చెయ్ ” అనే పిలుపు మార్మోగసాగింది. వ్యతిరేకులు లేవదీస్తున్న వాదాల్ని ఎదుర్కొనే నేర్పు కలగాలంటే అధ్యయనం చెయ్యాలి. నా భావ ధోరణికి అనుకూలమైన వాదాలతో సాయుధుడిని కావాలంటే అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చెయ్యసాగాను. వెనకటి నమ్మకాలు, అభిప్రాయాలూ గణనీయమైన మార్పుకు లోనయ్యాయి. మా ముందు వారిలో దౌర్జన్య పద్ధతుల పట్ల ఉన్న ఆకర్షణ,ఆవేశం పోయి తీవ్రమైన భావాలేర్పడ్డాయి. పారవశ్యానికి, గుడ్డి నమ్మకాలకూ ఇక తావు లేదు. వాస్తవ వాదం మా భావధోరణి అయింది. ఎంతో అవసరమైతేనే బలప్రయోగం సమర్ధనీయం.
ప్రజా ఉద్యమాలన్నిటికీ అహింసే అనివార్యమైన విధానం. కార్యాచరణ పద్ధతుల గురించి స్పష్టత ఏర్పడడం అన్నిటికంటే ముఖ్య విషయం. కార్యరంగంలో ముఖ్యమైన కార్యకలాపాలేవీ అప్పట్లో లేవు గాబట్టి, ప్రపంచ విప్లవానికి సంబంధించి వివిధ ఆదర్శాలను అధ్యయనం చేయడానికి మంచి అవకాశం లభించింది. అరాచక వాద నాయకుడైన బకునిన్ రచనలనూ, కమ్యూనిజానికి మూలపురుషుడైన మార్క్సు రచనలు కొన్నీ, తమ దేశంలో విప్లవాన్ని జయప్రదం చేసుకున్న లెనిన్, ట్రాట్ స్కీ మొదలైన వారి రచనలు చాలా భాగం చదివాను. వాళ్ళంతా నాస్తికులే. బకునిన్ పుస్తకం ” దేవుడూ-రాజ్యం ” అసంపూర్తిగా వున్నా, అందులో ఈ అంశం గురించి ఆసక్తికరమైన పరిశీలన కనిపిస్తుంది.
ఆ తర్వాత నిరాలంబ స్వామి ” కామన్ సెన్స్ ” అనే పుస్తకం నా కళ్ళబడింది. అందులో ఉన్నది నాస్తికవాదమే అయినా, అది నాకు అయోమయంగా కనిపించింది. మొత్తం మీద ఈ విషయం నాకెంతో ఆసక్తి కలిగించ సాగింది. ఈ మహా విశ్వన్నంతా సృష్టించి, శాసించే ఒక పరమాత్మ ఉన్నాడన్న ఆస్తిక సిద్ధాంతం పరమ నిరాధారమయిందని 1926 నాటికి నాకు గట్టి అభిప్రాయం ఏర్పడింది. దేవుడిపైన నాకున్న ఈ అవిశ్వాసాన్ని నలుగురికీ తెలియజేసాను. ఈ విషయమై మితృలతో చర్చలక్కూడా దిగాను. ఖచ్చితమైన నాస్తికుణ్ణయ్యాను. దీని అర్ధం ఏమిటో ఇప్పుడు వివరిస్తాను.1927 మేలో నేను లాహోర్ లో అరెస్టయ్యాను. ఆ అరెష్టు హఠాత్తుగా జరిగింది. పోలీసులు నన్ను వెంటాడుతున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. ఒక తోటలో పోతున్నప్పుడు ఉన్నట్టుండి నన్ను చుట్టుముట్టేశారు. ఆ క్షణంలో నేను పరమ ప్రశాంతంగా వుండడం నాకే ఆశ్చర్యం కలిగించింది.
నాలో ఎలాంటి భావ సంచలనం గానీ, ఉద్రేకం గానీ కలగలేదు. పోలీసులు నిర్బంధంలో పెట్టారు. మర్నాడు రైల్వే పోలీసు లాకప్ కు తీసుకువెళ్ళారు. ఒక నెల రోజులు అక్కడే గడిపాను. వారి మాటల్ని బట్టి కకోరి పార్టీతో నాకేదో సంబంధముందనీ విప్లవోద్యమ సందర్భంగా జరిగిన సంఘటనల్లో నా ప్రమేయం ఉందనీ వారి దగ్గర భోగట్టా వున్నట్టు నాకర్ధమయింది. లక్నో విచారణ సాగుతున్నప్పుడు నేనక్కడికి వెళ్ళాననీ, ఖైదీలను నిర్బంధం నుంచి తప్పించేందుకు ఒక పథకం గురించి ప్రస్తావించానని, వారి ఆమోదం పొందాక కొన్ని బంబులు కూడా సేకరించామనీ, వాటిని పరీక్షిద్దామని 1926 నాటి దసరా ఉత్సవంలో జన సమూహం మీద ఒక బాంబును వెయ్యటం జరిగిందని వాళ్ళు నాతో అన్నారు.
విప్లవ పార్టీ కార్యకలాపాల్ని వెల్లడి చేస్తూ ఒక స్టేట్ మెంట్ గనుక ఇస్తే, నన్ను జైలు నుండి విడుదల చెయ్యడమే కాక, కోర్టులో అప్రూవర్ గా కూడా నిలువకుండా బహుమానం సైతం ఇస్తామని నా “మేలు” కోరి చెప్పారు. విని నవ్వేశాను .
ఇదంతా హంబక్ , మా అభిప్రాయాలున్నవాళ్ళెవ్వరూ అమాయకులైన తమ ప్రజల మీద బాంబులు వెయ్యటం జరగదు.ఒక రోజు ఉదయం సి.ఐ.డి. శాఖ సీనియర్ సూపర్నెంటు న్యూమాన్ నా దగ్గరికొచ్చాడు. చాలసేపు సానుభూతి ఒలకబోస్తూ మాట్లాడాడు. తాము కోరినట్టుగా నేను స్టేట్ మెంట్ ఇవ్వకపోతే, కరోరీ కేసు సందర్భంగానూ, దసరా బాంబు ప్రయోగంలో ఘోరమయిన ఖూనీల సందర్భం గానూ కేసు పెట్టి ప్రభుత్వ వ్యతిరేక యుద్ధం చేసేందుకు కుట్రపన్నినట్లు నన్ను విచారణకు పంపక తప్పదనే విషాద వార్తను బయటపెట్టాడు. నాకు శిక్ష వేయించి, ఉరి తీయించడానికి తగినంత సాక్ష్యం తమ దగ్గర ఉందని చెప్పాడు. పోలీసులు తల్చుకుంటే ఏమయినా చేయగలరు గానీ, నేను మాత్రం ఏ నేరమూ చేసి ఎరగననే అప్పట్లో అనుకున్నాను. అదే రోజున కొందరు పోలీసులు వచ్చి రెండు పూటలా వరసదప్పకుండా దేవుణ్ణి ప్రార్ధించవలసిందిగా నాకు చెప్పటం మొదలుపెట్టారు. అప్పటికే నేను నాస్తికుణ్ణై వున్నానుగదా! జీవితం హాయిగా సాగిపోతున్నప్పుడే నేను నాస్తికుణ్ణని గొప్పలు చెప్పుకోవడమా? లేక ఇలాంటి కష్ట కాలంలో కూడా నా విశ్వాసాల్ని అంటిపెట్టుకొని వుండటమా? అనేది నాకు నేనే తేల్చుకోవాలనుకున్నాను. చాలా తీవ్రంగా ఆలోచించాను.
ఏ పరిస్థితిలో కూడా దేవుణ్ణి నమ్మలేనని, ప్రార్ధించలేనని నిర్ణయించుకున్నాను. అంతే మరెప్పుడూ ఆ పని చేయ్యలేదు.ఇదే నిజమైన పరీక్ష . నేను నెగ్గాను. ఇతర ముఖ్య విషయాలన్నీ బలిపెట్టి నా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలన్న కోరిక నాకెప్పుడూ కలుగలేదు.అంటే నేను గట్టి నాస్థికుణ్ణి అయ్యానన్నమాట. ఈనాటికీ అంతే, ఆ పరీక్ష నెగ్గటమంటే మాటలు కాదు.’విశ్వాసం’ కష్టాల బరువును తగ్గిస్తుంది. ఒక్కోసారి కష్టాల్ని సుఖాలుగా కూడా మార్చగలుగుతుంది. భగవద్భక్తిలో మానవుడు ఊరట పొందుతాడు. రక్షణ కూడా లభించినట్టనిపిస్తుంది. దేవుడు లేకపోతే మానవుడు తనమీద తాను ఆధారపడాల్సిందే. జడివానల మద్య, తుఫానుల మద్య తన కాళ్ళ మీద తాను నిలబడటమంటే చిన్న పిల్లల ఆట కాదు. ఎలాంటి వ్యక్తిలోనైనా అహంకారమనేది వుంటే అది ఇలాంటి పరిక్షా సమయాల్లో ఆవిరై పోతుంది. పదిమందీ పాటించే నమ్మకాల్ని అతడొక్కడూ ధిక్కరించలేడు. ఒకవేళ ధిక్కరించగలిగాడో, అహంకారాన్ని మించిన మరొక బలమేదో అతన్లో ఉందనాలి.
సరిగ్గా ఇప్పటి నాపరిస్తితి ఇదే.తీర్పు ఏవిధంగా ఉండబోతుందో నాకు బాగా తెల్సు. వారం రోజులోనే తీర్పు చెప్ప బోతారు. ఒక ఆదర్శం కోసం ప్రాణత్యాగం చేస్తున్నానన్న సంతృప్తితప్ప ఇంకే ఊరట ఉందినాకు? ఆస్తికుడయిన హిందువు అయినా మరో జన్మలో తానొక మహారాజుగా పుడతానని కలలు కనగలడు. ముస్లిమో, క్రైస్తవుడో అయితే తన బాధలకూ, త్యాగాలకూ ప్రతిఫలంగా స్వర్గ సుఖాల్ని ఊహించుకోగలడు. కాని నేనేం ఆశించాలి? నా కంఠం చుట్టూ ఉరిత్రాడు బిగుసుకొని,కాళ్ళ క్రింది చెక్కలు తప్పుకున్న క్షణమే నాకు అంతిమ క్షణం. అది నాకు తెలుసు. నేను- వేదాంత పరి భాషలో చెప్పాలంటే – నా ఆత్మ అంతటితో ఆఖరు. ఆ తర్వాత మరేం మిగలదు.ఈ దృష్టిలో అర్ధం చేసుకోగల సాహసం నాకుంటే- మహత్తరమైన ముగింపులేని పోరాటంతో కూడిన ఈ కొద్ది పాటి జీవితం ఒక్కటే నాకు గొప్ప బహుమానం. ఈ లోకంలో గానీ, పరలోకంలోగానీ బహుమానాలు పొందాలన్న ఏ స్వార్ధ చింతా, అభిలాషా లేకుండా, పరమ నిస్వార్ధంగా దేశస్వాతంత్ర్యం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఇంకోవిధంగా చెయ్యటం నా చేతకాదు. మానవజాతి సేవ, మానవాళి విముక్తి కోసమే తమ జీవితాలను అంకితం చేసుకొనే మనస్తత్వం గల స్త్రీ పురుషుల సంఖ్య పెరిగిన రోజు- ఆ రోజే స్వేచ్చాయుగానికి నాంది పలుకుతుంది.
దోపిడీదార్లనూ, పీడకుల్నీ, నిరంకుశుల్ని సవాలు చేయడానికి ఈ జన్మలోగానీ, మరు జన్మలోగాని, మరణానంతరం స్వర్గంలోగాని, రాజు నౌదామనో ఇతర పారితోషికాలు పొందుదామనో కాదు కోరవలసింది. మానవ జాతి మెడపైనుంచి దాస్యమనే కాడిని తొలగించాలని, స్వేచ్చనూ, శాంతినీ స్థాపించాలనీ ఉత్తేజం పొందాలి. సంకుచిత దృష్టి గలవారికిది పొరపాటనిపించినా, ఉదార విశాల దృష్టి గలవారందరూ దీన్ని చరితార్ధమైన ఒకే ఒక పంధాగా గుర్తించి అనుసరించగలరు. ఇలా ఉదాత్త ఆశయం పట్లగల గౌరవ భావాల్ని గర్వంగా చిత్రించటం సాహసమే అవుతుంది. అలా అన్నవాణ్ణి మూర్ఖుడనో, దుష్టుడనో అంటారు. గుండెలో ఉప్పొంగే ఉద్రేకం, ఆశయబలం ఎంతగాఢమైనవో వాడికి అర్ధం కావు కాబట్టి వాణ్ణి క్షమించి వేద్దాం. వాడి గుండె ఒట్టి మాంసం ముద్దకంటే చచ్చుది. వాడి చూపులు పరమ నిర్జీవాలు. ఇతరేతర ప్రయోజనాల ప్రభావం వాణ్ణలా చేశాయి. ఆత్మవిశ్వాసాన్ని గర్వంగా వ్యాఖ్యానించే అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఇది విచారకరం, బాధాకరం అయినా తప్పదు.
బాగా ప్రచారంలో ఉన్న విశ్వాసాల్ని వ్యతిరేకించినా, విమర్శకతీతుడనీ, దోషరహితుడనీ జనంలో ముద్ర వేసుకున్న ఒక గొప్ప వ్యక్తిని విమర్శించినా, నువ్వొట్టి డంబికుడవని ఆ జనమే నిన్ను తిట్టిపోస్తుంది. దీనికి కారణం వారి బుద్దిమాంద్యమే. విప్లవకారుడైనవాడికి తప్పనిసరిగా ఉండవలసిన గుణాలు రెండు – ఒకటి విమర్శనా ధోరణి, రెండు స్వతంత్ర ఆలోచనా సరళి. మహాత్ముడు చాలా గొప్పవాడు. కాబట్టి ఎవ్వరూ ఆయన లోపాల్ని వేలెత్తి చూపకూడదు. జన్మలో ఎంతో ఉన్నతంగా నిలవగలిగాడు కాబట్టి, రాజకీయాల్లో గాని, మతంలో గాని, ఆర్ధిక విషయా విషయాల్లో గాని, నైతిక విషయాల్లో గాని ఆయన చెప్పిందే వేదంగా భావించాలి. ఆ మాటల్లో నీకు నమ్మకం కుదిరినా కుదరకపోయినా అదంతా నిజమని ఒప్పుకు తీరాలి. ఇలాంటి మనస్తత్వం దేశపురోగమనానికి కాదుగదా, తిరోగమనానికి దారితీస్తుంది.
సర్వశక్తిసంపన్నుడైన దేవుడి పైన మన తాతముత్తాతలు నమ్మకం కుదుర్చుకున్నంతమాత్రాన, ఆ నమ్మకాన్ని గాని ఆ దేవుడి వునికినిగాని సవాలు చెయ్యకూడదా? ఎవరైనా అలా సాహసిస్తే మతద్రోహి, భ్రష్టుడు అనిపించుకోక తప్పదు. తన బలమైన వాదంతో ఎదుటి వారి వాదాల్ని చిత్తుగా తిప్పికొట్టగలిగితే, పరమేశ్వరుడి దురాగ్రహానికి గురికావడం వల్ల వచ్చే కష్టనష్టాలకు గుండెనిబ్బరం చెదరకపోతే అతణ్ణి డాంబికుడంటారు. అలాంటప్పుడు ఈ వృధా చర్చతో కాలహరణం చెయ్యడమెందుకు? ఈ విషయాన్నంత తర్కించడమెందుకు? ఈ సమస్య జనం ముందుకు మొదటిసారిగా ఇప్పుడే వచ్చిందిగనుక ఈ విషయంలో ఇదే చర్చకు దారితీస్తుంది కనుక సుదీర్ఘమైన పరిశీలన చెయ్యవలసివచ్చింది.
నన్ను నాస్తికుణ్ణి చేసింది గర్వం కాదని స్పష్టం చేశాననుకుంటాను. నా వాదనా సరళి నచ్చిందీ లేనిదీ చెప్పవలసింది పాఠకులేకాని నేనుకాదు. ప్రస్తుత పరిస్థితిలో నాకు దేవుళ్ళ పైన నమ్మకమే వుంటే నా జీవితం ఎంతో హాయిగా వుండేది. నా గుండె బరువు తేలికనిపించేది. దైవనమ్మకం లేనందువల్ల పరిస్థితులు పరమ నీరసంగా తయారై, కర్కశంగా కూడా రూపొందవచ్చు. కాసింత భక్తి పారవశ్యమే వుంటే నాకీ క్షణం ఎంత మధురంగా వుండేదో! కానీ నా జీవితంలో నిర్దాక్షిణ్యమైన ఈ పరిస్తితిని ఎదుర్కోడానికి ఏ మత్తు అక్కరలేదు. నేను వాస్తవవాదిని.హేతుబద్ధమైన ఆలోచనలతో నా సహజ దౌర్బల్యాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నవాణ్ణి. అయితే అన్నివేళలా నేను గెలవకపోవచ్చు. ప్రయత్నించడం మనిషి కనీసపు బాధ్యత.ఫలితం పరిస్థితులకే వదిలెయ్యాలి.
ఇక రెండో విషయానికొద్దాం.
దేవుడి వునికి గురించి చిరకాలంగా వుంటున్న నమ్మకాన్ని కాదనడానికి గర్వమే కారణం. కాదనుకుంటే మరో కారణమేదైనా వుండాలి, వుందికూడా. అదే హేతువాద దృక్పధం. ఈ హేతుదృష్టి ఏమాత్రం ఉన్నా మనిషి తన పరిసరాల్ని అర్ధం చేసుకోగలడనే నా అభిప్రాయం. సాధారణంగా ప్రత్యక్ష ప్రమాణాలు లేనప్పుడే మతతత్వానికి ప్రముఖ స్థానం లభిస్తుంది. నేనిదివరకే చెప్పినట్టుగా ఒక విప్లవకారుడి అభిప్రాయం ప్రకారం, మానవుడి హృదయదౌర్భల్యం వల్లనే మతతత్వం ఉత్పన్నమౌతుంది. ప్రత్యక్ష ప్రమాణాలు అసలేవీ లేని కాలంలో, ఈ విశ్వ రహస్యం గురించి, భూత,భవిష్యత్, వర్తమానాల గురించి ఆలోచించడానికి కావలసినంత తీరిక వున్న కాలంలో ప్రతివాడూ తనకు తోచిన విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూశాడు. విభిన్న మత సిద్ధాంతాలలో మౌలిక బేధాలిందువల్లనే వచ్చాయి. ఒక్కొక్కప్పుడు ఇవి పరస్పరం విరుద్ధంగా తయారై తమలో తాము సంఘర్షించుకుంటాయి కూడా. ప్రాచ్య, పాశ్చాత్య దేశాల మధ్య ఈ మత విబేధాలు ఎలాగూ ఉన్నాయి. అంతేకాదు, ఇటు ప్రాచ్య దేశాల్లోనూ వివిధ మత సాంప్రదాయాల మధ్య ఎన్నెన్నో విబేధాలున్నాయి.ప్రాచ్య దేశాలలో హిందూ మతానికీ, ముస్లీం మతానికీ చుక్కెదురు. ఇండియాలో కొన్ని వేల సందర్భాలలో బౌద్దజైనులు, బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వున్నాయి.బ్రహ్మణ మతంలో మళ్ళీ ఆర్యసమాజమనీ, సనాతన ధర్మమనీ పరస్పర విరుద్ధమైన మత విశ్వాసాలున్నాయి.
గతించిన యుగాలకు చెందిన ఒక స్వతంత్ర భావుకుడు చార్వాకుడు. చార్వాకుడొకరా, పలువురా? ఏమైతేనేం.ప్రాచీన కాలములోనే దైవాధికారాన్ని సవాలుచేశాడు. కాబట్టి ప్రధాన విషయం గురించి ఈ భిన్న మతాలన్నీ విభేధిస్తున్నాయి. ప్రతివాడూ తనమతమే నిజమనుకుంటాడు. అదే దౌర్భాగ్యం. అజ్ఞానానికి వ్యతిరేకంగా ముందు ముందు మనం సాగించబోయే పోరాటంలో ప్రాచీన భావుకుల, మేధావుల ప్రయోగాలనూ, భావననూ ప్రాతిపదికగా వుపయోగించుకొనే బదులు, ఈ నిగూఢ సమస్యకు పరిష్కారాన్ని సాధించడానికి బదులు మనం జడత్వం వల్ల విశ్వాసం, విశ్వాసం అంటూ గొంతు చించుకొని గోల చేస్తున్నాం. ఇంకా ఎవరి విశ్వాసాల్ని వారు పట్టుకొని వేలాడుతూనే వున్నారు.మానవ ప్రగతి స్థంభించిందంటే నేరస్తులు వీరే.
ప్రగతిని కోరే వారెవరైనా సరే, పాత మతాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ విమర్శించి,సవాల్ చెయ్యాలేగాని, గుడ్డిగా నమ్మకూడదు. పదిమంది పాటిస్తున్న మత విశ్వాసాన్ని ఏమూల కామూల శోధించి,ఒక అంశం తరువాత మరొక ఆంశాన్ని తర్కించాలి. ఆ తర్వాత కూడా ఒకరికి మత సిద్ధాంతంలో నమ్మకం ఏర్పడితే , ఆనమ్మకానికి స్వాగతం. అతని తర్క పద్ధతి అప సవ్యమై ఉండవచ్చు. తప్పు దారి తొక్కవచ్చు. లోపభూయిష్టం కావచ్చు.- అతని జీవితానికి హేతు దృక్పధమే ధృవతార కాబట్టి అతణ్ణి సరిదిద్దే అవకాశం ఉంది. గుడ్డి నమ్మకమే పరమ ప్రమాదకరం. ఇది బుద్ధిని మందగింప జేస్తుంది. మనిషిని వెనక త్రోవ పట్టిస్తుంది. వాస్తవవాదినని చెప్పుకునేవాడు పాత మతాన్ని మొత్తంగానే ప్రశ్నించాలి. తర్క బలాన్ని ఎదుర్కోలేకపోతే అది కుప్ప కూలి పోతుంది. అప్పుడతడు చెయ్యవలసిన మొదటిపని పాత సిద్ధాంతపు కట్టడాన్ని తుత్తునియలుచేసి ఒక నవ్య తత్వ నిర్మాణానికి కావలసిన స్తలాన్ని సమకూర్చడం.అంతవరకు నిర్మూలనం. దీనిమీదట నిర్మాణాత్మక కార్యక్రమం మొదలవుతుంది. పునర్నిర్మాణం కోసం ఒక్కొక్కప్పుడు పాత మతవిశ్వాసాల తాలూకు సామాగ్రి కొంతయినా అవసరం కావచ్చు.ఈ విషయం గురించి నేనెక్కువగా అధ్యయనం చేయలేదని ముందుగానే ఒప్పుకుంటాను. ప్రాచ్య మతాన్ని అద్యయనం చేద్దామని నాకు చెడ్డ కోరిక. కాని తగిన అవకాశం లేదు.
పాత మత సిద్ధాంతాల లోపాల్ని మాత్రం సవాలు చేసేంత నమ్మకం, ధైర్యం నాకేర్పడ్డాయనే అనుకుంటాను. ఈ చరాచర ప్రకృతినంతా శాసించి నడిపే పరబ్రహ్మ పదార్ధం ఏదీలేదని నా గట్టి అభిప్రాయం. ప్రకృతి అంటే నమ్మకముంది.ఆ ప్రకృతిని మానవుడు తన సేవా సాధనంగా మార్చుకోవడమే అభుదయ లక్ష్యం .నేపథ్యంలో నిలిచి దీన్ని నడిపే చైతన్య పూరితమైన చోదక శక్తేదీ లేదు. ఇదీ మన అవగాహన.
ఆస్తికుల్ని మనం కొన్ని ప్రశ్నలడగవచ్చు. సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ, సర్వశక్తిసంపన్నుడూ అయిన దేవుడనేవాడొకడుంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిందెందుకో చెప్పమనండి.ఎన్నో దుఖాలతో నిండి గందరగోళంగా వున్న ఈ లోకంలో ఒక్క జీవి కూడా సంతృప్తి పొందక పోవడానికి కారణ మేమిటో? ఇది దేవుడు చేసిన నియమం అని మాత్రం అనకండి. దేవుడు కూడా ఒక నియమానికి బద్దుడై వుంటే, ఆయన సర్వశక్తి సంపన్నుడు కాలేడు కదా? ఇదంతా దైవలీల అని కూడా అనకండి; నీరో చక్రవర్తి తన సంతృప్తి కోసం ఒక్క రొమ్ నగరాన్ని తగలబెట్టించాడు.
కొద్దిమందినే వధించాడు. కొన్ని బాధల్నే కల్పించాడు. అయితే చరిత్రలో అతని స్థానం ఏమిటి? చరిత్రకారులు ఏఏ పేర్లతో అతన్ని వర్ణిస్తారు? నిరంకుశుడు, నిర్దయుడు, దుర్మార్గుడు- ఎన్నో నిందా వాచకాలతో పేజీలకు పేజీలు నలుపెక్కాయి. అతన్ని గురించి ప్రయోగించని దూషణలు లేవు. కేవలం తన ఆనందం కోసం వేలాది మంది ప్రాణాలు తీసిన ఛెంఘిజ్ ఖాన్ పేరంటేనే మనకు ద్వేషం. మరి ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి నిముషం ఎన్నో ప్రాణాల్ని బలిగొంటున్న సర్వ శక్తి సంపన్నుడైన దేవుణ్ణి-శాశ్విత నీరోని – మీరెలా సమర్ధిస్తారు? ప్రతిక్షణం ఛెంఘీజ్ ఖాన్ ను తలదన్నిపోయే దేవుడి అక్రమాలను ఎలా ప్రశంసిస్తారు? నిరంతరం దారుణమైన అశాంతికి నిలయమైన నరకం లాంటి ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడని ప్రశ్నిస్తున్నాను?
మనిషిని సృష్టించకూడదని దేవుడు భావించివుంటే , ఆ శక్తి ఆయనకుందిగదా, మరెందుకు సృష్టించాడు మనిషిని? దీనికంతతికీ ఏమిటి మీ సమాధానం? పాపం పుణ్యం తెలియని అమాయకుల్ని రక్ష్నిచడానికి, దుష్టుల్ని శిక్షించడానికీ అంటారా? భేష్! తీవ్రంగా గాయపరచి, ఆ తర్వాత మందుపూసే మనిషిని మీరు సమర్ధించగలరా? మొదటేమో ఆకలిగొన్న సిం హాల ముందు మనుషుల్ని తొయ్యడం , ఆ తర్వాత ఆ కౄరమృగాల బారినుండి ఒకవేళ తప్పించుకోగలిగితే అప్పుడేమో గౌరవించడం ఆ ద్వంద ధోరణిని ప్రదర్శించే కపటుల్ని మనం ఎంతవరకు వెనకేసుకురావచ్చు? అందుకే అడుగుతున్నాను. ” సర్వజ్ఞుడైన దేవుడు ఈ ప్రపంచాన్ని ,అందులోని మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు?” అని .వినోదం కోసమా? అయితే దేవుడికీ, నీరోకి తేడా ఏమిటి?
మహమ్మదీయులారా!, క్రైస్తవులారా! ఈ ప్రశ్నకు మీ జవాబులేమిటో చెప్పుకోండి? పూర్వ జన్మలో మీకు నమ్మకం లేదాయె. ఈ జన్మలో పాపం పుణ్యం ఎరగని అమాయకులు పూర్వజన్మలో చేసుకున్న పాపాల ఫలితంగా కష్టాలను అనుభవించితీరాలనే వాదాన్ని హిందువుల్లాగా మీరు చేయలేరుగదా? అంత శక్తి గల దేవుడు “మాట” ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఆరు రోజులపాటు పాటుపడవలసిన అవసరం ఏమిటి? అంతా సవ్యంగానే సాగుతోందని ప్రతిరోజూ అనవలసిన అవసరం ఎందుకొచ్చింది? రమ్మనండి ఆ దేవుణ్ణి ,గత చరిత్రను చూపించండి. ఈ నాతి పరిస్థితుల్ని అధ్యయనం చెయ్యమనండి. “అంతా సవ్యం” అనడానికి సాహసించగలడేమో, అదీ చూద్దాం.
చీకటి కొట్లలాంటి జైళ్ళు, ఒక వైపు మురికివాడల మధ్య గుడిసెల్లో నివసించే లక్షల, కోట్ల నిర్భాగ్యులు, మరోవైపు వ్యర్ధంగా పడివున్న సంపదలు. పేదల రక్తాన్ని పీల్చే పెట్టుబడిదారీ రక్కసి జలగలు, పట్టీపట్టనట్టుగా చూస్తూ దోపిడీకి గురౌతున్న శ్రామికులు, ఏమాత్రం ఆలోచించేవారికైనా గుండె చెరువయ్యే విధంగా దుబారా అవుతున్న మానవుల శక్తియుక్తులు, అదనపు ధాన్యోత్పత్తిని-కష్టపడి పండించే శ్రమజీవులకందకుండా- గంగ పాలు చేసే నిర్దయ , వీటన్నిటినుంచీ అటు మానవుల ఎముకల పోగుల పునాది మీద లేచిన రాజ సౌధాలు ఇదంతా చూసి కూడా ” అంతా సవ్యం ” అంటాడా దేవుడు? ప్రపంచంలో ఇంత దారుణమైన పరిస్థితులెందుకున్నాయి? ఇదే నా ప్రశ్న. మీరు మాట్లాడరు సరే. మిమ్మల్ని వదలి ముందుకు వెళతాను.
ఓ హిందువుల్లారా! పూర్వజన్మలోని పాపులే ఈ జన్మలోని పీడితులూ,దరిద్రులూ అంటున్నారుగదా మీరు? అంటే ఈ జన్మలోని పీడకులు గత జన్మలో సజ్జనులా? అందుకే అధికారం అపనమ్మకాన్నీ కొట్టేయగల సిద్ధాంతాలను కనిపెట్టిన మీ పూర్వీకులున్నారే ,మహా తెలివైనవాళ్ళు. అయితే ఈ వాదం కూడా ఏమాత్రం నిలుస్తుందో చూద్దాం.
సుప్రసిద్ధ న్యాయశాస్త్రవేత్తల దృష్టిలో ,తప్పుకు తగిన శిక్షవెయ్యాలనో ,సంస్కరించాలనో – ఇలా ఏవో కొన్ని లక్ష్యాల్ని పెట్టుకొనే నేరస్తుల్ని దండించడం జరుగుతుంది.తప్పుకు తగిన ఫలితం అనుభవించాలన్న దృష్టిలో శిక్ష వెయ్యడం మంచిది కాదని ఆలోచనాపరులంతా చెబుతున్నారు.మళ్ళీ తప్పులు చెయ్యకుండా ఉండడం కోసమే శిక్ష వేసేపద్దతివల్ల కూడా ప్రయోజనం లేదని వారి అభిప్రాయం. పోతే మానవ ప్రగతికి అవసరమైనది సంస్కరణలతో కూడిన శిక్షావిధానమే. నేరస్తుణ్ణి మంచి పౌరుడుగా మార్చి సమాజంలో కలపటమే దాని లక్ష్యం. మానవులు నేరస్థులే అనుకొంటే, మరి భగవంతుడు విధించే శిక్ష స్వభావం ఎలాంటిది? చెట్టుగానో ,పుట్టగానో, కుక్కగానో,నక్కగానో పుట్టమని దేవుడు దండన విధిస్తాడని అంటారు మీరు.
ఈ దండనల సంఖ్య ఎనభైనాలుగు లక్షలని లెక్క దీస్తారు.ఈ శిక్షలెంతవరకు మానవుల్ని సంస్కరించగలవో చెప్పమని అడుగుతున్నాను.ఏదో పాపం చేసినందుకు గాడిదగా పుట్టామని చెప్పేవాళ్ళను ఎంతమందిని చూశారు మీరు? ఒక్కడూ కనబడడు. పురాణాల దస్త్రం విప్పండి. మీ కట్టుకథల్ని స్పృశించే అవకాశం లేదు నాకు.అంతేకాదు. ఈ ప్రపంచంలో పేదరికం కంటే గొప్ప పాపం లేదని మీకు తెలుసా? పేదవాడుగా శిక్షల్ని ప్రతిపాదించే నేరశాస్త్రజ్ఞుల్ని , న్యాయ శాస్త్రవేత్తలనూ,శాసన కర్తలనూ ఎలా మెచ్చుకోగలరు? మీ దేవుడు ఈమాత్రం ఆలోచించలేడా? లేకుంటే – మానవకోటి స్వానుభవం ద్వారా అనుభవించవలసివచ్చిన బాధల మూలంగానే దేవుడంతటివాడు తెలుసుకోవలసి వచ్చిందా? అక్షర జ్ఞానమేలేని నిరుపేద అయిన చర్మకారుడి ఇంట్లోనో, పాకీ వాడి ఇంట్లోనో పుట్టేవాణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి?
వాడు పేదవాడు. కనుక చదువుకోలేడు. అంతకంటే పెద్దకులంలో పుట్టి గొప్పవాళ్ళమనుకునే తోటి మనుషులు అతణ్ణి అసహ్యించుకుంటారు. నీచంగా జూస్తారు. ఒక పక్క తన అజ్ఞానం, పేదరికం, మరో ప్రక్క సమాజం నుండి తనకు లభించే నిరాదరణ – వీటివల్ల సమాజం అంటేనే తన గుండెను బండగా మార్చుకుంటాడు. అలాంటి పరిస్థితిలో అతడొక పాపం చేస్తే దాని ఫలితం పొందవలసిందెవరు? తానా? దేవుడా? లేకపోతే సమాజంలోని విద్యావంతులా? ఎవరు? గర్వంతో , అహంకారంతో ఉద్దేశ్యపూర్వకంగానే బ్రాహ్మణులు వీళ్ళందర్నీ అజ్ఞానంలో అట్టిపెట్టారు. “పరమ పవిత్ర” గ్రంధాలైన వేదాలనుంచి ఏవో కొన్ని వాక్యాలు విన్నారని వారి చెవుల్లో మరిగే సీసం పోయించారు.ఈ శిక్ష మాటేమిటి? వాళ్ళేదైనా అక్రమం చేస్టే దానికెవరిది బాధ్యత? బాధ్యత ఎవరిదైనా శిక్ష వాళ్ళే అనుధవించాలా?
మిత్రులారా, వినండి. ఈ సిద్ధాంతాలన్నీ కడుపు నిండినవాళ్ళు సృష్టించినవే. అక్రమంగా తాము సంపాదించుకున్న అధికారాన్ని,సిరి సంపదల్ని సమర్ధించుకునేందుకే ఇవన్నీ. ఆప్టన్ షింక్లేరు అనుకుంటాను ఒకచోట అంటాడు. మనిషికి దైవం పైన నమ్మకం కలిగించు, ఆతర్వాత అతని ఆస్తిపాస్తుల్ని కొల్లగొట్టడం తేలిక అని. దోపిడీకి గురయ్యేవాడే నీకు సాయపడతాడు కూడా. మత ప్రచారకులు, అధికార మధాంధులూ కుమ్మక్కై ఈ జైళ్ళనూ, శిక్షలనూ, ఈ సిద్ధాంతాలనూ పుట్టించారు.
ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, ఎవరైనా పాపంగానీ, నేరంగానీ చేస్తున్నాప్పుడే సర్వ శక్తి సంపన్నుడైన మీ దేవుడెందుకు నిరోధించడంలేదు? ఆ పని ఆయన్ అవలీలగా చేయవచ్చు గదా! యుద్ధోన్మాదుల్నీ వారి దురాగ్రహాల్నీ హతమార్చి, ప్రపంచ యుద్ధ సమయంలో మానవకోటిమీద విరుచుకుపడ్డ దారుణ దురాగతాల్ని ఎందుకు నిరాకరించలేదు. ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలన్న హృదయ పరివర్తనను బ్రిటిషువారికి ఎందువల్ల కలిగించడం లేదు. ఉత్పత్తి సాధనాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారులందరికీ త్యాగబుద్ధినీ ,పరోపకార భావాన్నీ కలిగించి ,ఈ పెట్టుబడిదారీ దాస్యం నుంచి శ్రామిక జనాన్నేకాదు, మానవ సమాజాన్ని ఎందుకు విముక్తి చెయ్యడు? సోషలిష్టు సిద్ధాంతం ఆచరణీయమా,కాదా అని మీరు తర్కిస్తున్నారే? దాన్ని ఆచరణీయం చెయ్యమని మీ దేవదేవుడికే వదిలేస్తున్నాను.
సర్వజన శ్రేయస్సుకు సంబంధించినంతవరకూ సోషలిజాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆచరణయోగ్యం కాదనే సాకుతోనే వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా ఆ సర్వేస్వరుణ్ణే జోక్యం చేసుకొని చక్కదిద్దమనండి. డొంక తిరుగుడు వాదాలు మాత్రం చెయ్యకండి. బ్రిటీషు వారి శక్తిని ఎదుర్కొనే సాహసం మనకులేదు గనకనే మన దేశంలో వాళ్ళ పాలన కొనసాగుతుంది గాని, దేవుడి కోరికవల్ల మాత్రం కాదని చెబుతున్నాను. తుపాకులూ, రైఫిళ్ళూ,బాంబులూ, బులెట్లూ, పొలీసులూ, సైన్యం- వాటికితోడు మన నిర్లక్ష్యం వల్లనే బ్రిటీషు వాళ్ళు మనల్ని తమ కాళ్ళ కింద తొక్కి పెడుతున్నారు. ఒక జాతిని మరొకజాతి పరమ దుర్మార్గంగా దోచుకోవడమనే దారుణ పాపకార్యానికి ఒడిగడుతున్నారు. అంతేగాని , దేవుని దయతోనో ,సహాయంతోనో మాత్రం కాదు. ఏడీ మీ దేవుడు? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? మానవ జాతి అనుభవిస్తున్న యాతనల్ని చూసి ఆనందిస్తున్నాడా? అతడొక నీరో ,ఛంఘీజ్ . దేవుడు నశించాలి.
అయితే ఈ ప్రపంచం ఎలా పుట్టిందో, మనిషెలా పుట్టాడో వివరించమంటున్నారా? అలాగే. ఈ విషయం గురించి చార్లెస్ డార్విన్ కొంత దారి చూపాడు. అతని రచనలు చదువుకోండి. సోహం స్వామి వ్రాసిన “కామన్ సెన్స్ ” కూడా చూడండి. మీ ప్రశ్నలకు కొంతవరకైనా జవాబు లభిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మకణాల రూపంలో వివిధ ద్రవ్యాల ఆకస్మిక సం యోగ సమ్మిశ్రమణాల ఫలితంగా ఈ భూమి రూపొందింది. ఎప్పుడు? చరిత్ర నడగండి. ఇదే గతిక్రమం వల్ల జీవజాలం ఆ తర్వాత ఎంతోకాలానికి మానవుడు రూపొందడం జరిగింది. ఆ పైన సాగిందంతా ప్రకృతితో మానవుని ఘర్షణవలన ప్రకృతిని శాసించాలనే అతని ప్రయత్నం వల్ల ఏర్పడిందే. ఈ విషయాన్ని ఇంకా సూక్ష్మంగా చెప్పటం వీలుకాదు.
పూర్వ జన్మలో పాపాలు చెయ్యకపోతే మనిషి గుడ్డివాడుగానో , కుంటివాడుగానో ఎందుకు పుడుతున్నాడని మీరు మరో వాదం చెయ్యవచ్చు. జీవశాస్త్రజ్ఞులు దీనికి శాస్త్రపరమైన కారణాలు చెప్పేవున్నారు.తాము మంచి పనులు చేస్తున్నారో లేదో అనేస్పృహవున్నా లేకపోయినా అంగవైకల్యంతో పిల్లలు పుట్టడానికి కారణం తల్లిదండ్రులేనని వారి నిర్ణయం.
పిల్ల తరహాగా అనిపించినా ,సాధారణంగా ఇంకో ప్రశ్న అడుగుతారు మీరు. అసలు దేవుడనేవాడే లేకపోతే జనానికి దైవనమ్మకం ఎలా ఏర్పడుతుంది? దీనికి నా సమాధానం చాలా స్వల్పమైనదీ, చిన్నదీ. దెయ్యాలను , క్షుద్ర శక్తుల్నీ ఎలా నమ్ముతూ వచ్చారో , దేవుణ్ణీ అలాగే నమ్ముతూ వచ్చారు. కాకుంటే దైవభావం విశ్వవ్యాప్తమై ,అదొక తత్వంగా రూపొందింది. పరమ పురుషుడొకవున్నారని నూరిపోసి జనాన్ని మభ్యపెదుతూ, దాస్యంలో అట్టిపెట్టి , తమ ఉన్నత స్తానాల్ని నిలుపుకునేందుకు దేవుణ్ణి ప్రమాణంగా చూపుతున్న దోపిడీదారుల చాకచక్యమే దైవభావం పుట్టుకకు కారణమని కొందరు తీవ్రవాదులంటారుగానీ నేనలా అనుకోవడంలేదు. విశ్వాసాలూ, మతాలూ, మతశాఖలూ, ఇతర సంస్తలూ- ఇవన్నీ కాల క్రమాన నిరంకుశంగా ప్రవర్తించే దోపిడీ సంస్థలన్నీ మనుషుల్నీ వర్గాల్నీ బలపరిచే సాఢనాలుగా మారిపోయాయనడంలో మట్టుకు నాకు వారితో భిన్నాభిప్రాయం లేదు. ఏమతంలోనైనాసరే రాజుమీద తిరగబడడం పాపమే.
దైవభావం ఏర్పడడానికి నా దృష్టిలో కొన్ని కారణాలున్నాయి. మనిషి తన బలహీనతల్ని, లోపాల్ని బాగా గుర్తించాక అన్ని రకాల సంకట పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలవడానికి ,ప్రమాదాల్ని నిబ్బరంగా ఎదుర్కోవడానికి దైవభావం అవసరం అయింది. సంపదలెక్కువై భోగభాగ్యాలనుభవిస్తున్న దశలో విశృంఖలంగా విజృంభించకుండా అడ్డుపడి అదుపులో పెట్టడానికి కూడా దేవుణ్ణి పట్టుకురావడం జరిగివుంటుంది.
దేవుడికి సొంత చట్టాలు కొన్ని వున్నట్లుగా , తండ్రికుండే దయాగుణం వున్నట్లుగా మరికొన్ని లక్షణాలు చేర్చి చిత్రించడం జరిగింది.దేవుడి చట్టాల్ని గూర్చి చర్చ వచ్చినప్పుడు మనిషి ప్రమాదకరంగామారకుండా ఉండడానికి దేవుడి అవసరం ఏర్పడింది. ఇక జగత్పితగా తన యోగ్యతను నిరూపించవలసి వచ్చినప్పుడు తండ్రిగా, తల్లిగా, సోదరిగా, సోదరుడిగా వర్ణించారు.కావలసినవాళ్ళే వెన్నుపోటుపొడిచి, ఏకాకిని చేసినప్పుడు మనిషి ఎంటో మానసిక క్షోభకు గురవుతాడు. అప్పుడు తనని వీడని స్నేహితుడొకడున్నాడని , ఆదరువుగావుండి ఆదుకుంటాడని, సర్వ శక్తి సంపన్నుడు గనుక ఆయన్ను తల్చుకుంటే ప్రమాదం ఉండదని అనుకుని మనిషి ఒకరకమైన ఊరట పొందుతాడు.ఆదిమ కాలంలో మాత్రం ఈ భావం నిజంగానే ఉపయోగకరంగా వుండేది.బాధలపాలైన మనిషికి దైవభావం సహాయకారి.
విగ్రహారాధననీ, సంకుచిత మత వైఖరినీ సమాజం లోగడ ఎలా ఎదిరించి పోరాడిందో, అలా ఈ దైవనమ్మకాన్ని ఎదిరించి పోరాడాల్సివుంది.తన కాళ్ళ మీద తాను నిలవాలనుకున్న మనిషి మత విశ్వాసాన్ని తోసివేయాలి.పరిస్థితులవల్ల ఏర్పడే కష్టాల్నీ, నష్టాల్నీ నిబ్బరంగా ఎదుర్కోవాలంటే వాస్తవవాది కావాలి. దేవుణ్ణి నమ్మటం, రోజూ ప్రార్ధనలు చెయ్యడం – ఇవి పరమ నీచమైన స్వార్ధ బుద్ధితో మానవుణ్ణి తక్కువ చేసేవని నాకనిపిస్తాయి. నన్ను బాగు చేస్తాయో, పాడు చేస్తాయో నా విషయానికొస్తే నాకే తెలియదు. ఎన్ని బాధలైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న నాస్తికులు గురించి చదువుకొనియున్నాను. అంచేత, చివరిదాకా, ఉరికంభం మీదైనాసరే తల పైకెత్తుకొని నిలబడాలనే ప్రయత్నిస్తున్నాను.
దీన్నెలా నిర్వహించగలనో చూద్దాం. ప్రార్ధన చెయ్యమని మిత్రుడొకడు ఉపదేశించాడు. నాస్తికవాదం గురించి చెప్పినమీదట ”నీ చివరి రోజుల్లో అయినా ఆస్తికుడవైపోతావు” అన్నాడు. అది ”అసంభవం” అన్నాను. అలాంటిపని నా పతనాన్ని, నా అధైర్యాన్ని సూచిస్తుంది. స్వార్ధం కోసం చచ్చినా ప్రార్ధించను. పాఠకులారా, మిత్రులారా, ఇది అహంభావమా? ఇది అహంభావమే అయితే నేను అహంభావినే. (courtesy of social media)
– సురేందర్ ఉయ్యాల