ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు,
సాధారణంగా.. ప్రభుత్వాలేవైనా నిర్మాణాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాయి. చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం, ప్రజలకు ఉపయోగపడే ఇతర నిర్మాణాలపై దృష్టి సారించి ప్రజలకు మేలుచేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ, మీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా.. కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేసి, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు.. సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా.. మొన్నటి కేబినెట్ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీస ప్లానింగ్ లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. దీన్ని సాకుగా తీసుకుని మీ ప్రభుత్వం.. నిర్మాణాత్మక ఆలోచనలకు, ప్రజోపయోగ మౌలికవసతుల నిర్మాణానికి డబ్బుల్లేవన్న కారణాలు చూపుతూ.. ఎలాంటి ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో.. అక్రమ కట్టడాల పేరిట ఇండ్లను కూల్చివేసే మార్గాన్ని ఎంచుకుంది. ఈ ప్రక్రియను.. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజల అభిప్రాయం.
కేవలం మిమ్మల్ని విమర్శించాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాయడం లేదు. బాధితులు నా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావుల ఆలోచనలు, నిత్యం వార్తాపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటున్న అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకునే మీకు వివరిస్తున్నాను. దీనికి ఓ స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read-
ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం కాకపోతే.. వీటిపై చర్యలు తీసుకునే సమయంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సహజన్యాయ సూత్రాలకు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్) అనుగుణంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ముఖ్యంగా.. పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలనేది అందరి అభిప్రాయం.
మన రాష్ట్రంలో చాలా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఇవాళ అక్రమం అని చెప్పి కూల్చేస్తున్న వాటి గురించి సున్నితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని సంబంధం లేకుండా.. GHMC పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇండ్లకు ప్రభుత్వం తరపున కోట్ల రూపాయలు ఖర్చుచేసి వేసిన రోడ్లు, వెలిగించిన వీధి లైట్లు, కల్పించిన తాగునీటి వసతులు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, చివరకు GHMC తరపున ఇంటి నెంబరును కేటాయించిన విషయం వాస్తవం కాదా?
దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏల ద్వారా సేవలు అందిస్తూ పన్నులు తీసుకుంటున్నప్పుడు అక్రమం అనిపించనిది.. ఇవాళ హఠాత్తుగా అక్రమం అంటే వాళ్లు ఎక్కడకు వెళ్లాలి? అందులోనూ పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకుని.. ప్లాట్లు, అపార్టుమెంట్లు కొనుక్కున్నారు. నివాసం ఉంటున్నారు.
కొన్నిప్రాంతాల్లో.. అన్ని అధికారిక అనుమతులు ఉన్న భవనాల్ని కూడా నేలమట్టం చేయటం బాధాకరం. గతంలో జీహెచ్‌ఎంసీ/ హెచ్‌ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది? కొన్నిచోట్ల జీహెచ్‌ఎంసీ అనుమతులు ఇచ్చిన తర్వాతే.. ప్రజలు నమ్మి ఇంటి ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కొన్నారు. అదేవిధంగా రోడ్లు, విద్యుత్, వాటర్, డ్రైనేజీ కనెక్షన్స్ ఉన్నప్పుడు.. నిర్మాణాలు న్యాయబద్ధంగా ఉన్నాయనే సామాన్యుడు అనుకుంటాడు. ఒక సంస్థ అనుమతులిస్తే.. ఇవాళ మరో సంస్థను ఏర్పాటుచేసి.. అక్రమం అని చెప్పి కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? గతంలో అనేకసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమనిర్మాణాలను రెగ్యులరైజ్ కూడా చేశారు.
ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితి, పారదర్శకత, మానవత్వం, సామాజిక బాధ్యత, నిర్మాణాత్మక నియమ నిబంధనలు ఉండాలి. మూసీ పరివాహక ప్రాంతంలో 15 వేలకు పైగా పేద, మధ్య తరగతి కుటుంబాలున్నాయి.
వారి నివాసాలను హైడ్రా ద్వారా కూల్చేముందు.. వారితో చర్చించాలి. వారి ఇండ్లను కూల్చి రోడ్డున పడేయకూడదు. ‘మూసీ రివర్ బ్యూటిఫికేషన్’లో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇండ్లు కోల్పోయేవారితో చర్చించాలి.
పాలకులు, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా, పేదలను మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి, వారికి అక్కడక్కడ భూమిని ప్లాట్లుగా చేసి మధ్య దళారీల ద్వారా అమ్మారు. హైడ్రా వంటి సంస్థ వస్తుంది, మా పేదల ఇళ్లను కూల్చుతారని తెలియక అప్పులుచేసి ప్లాట్లు కొని, తమ శక్తి మేరకు ఇండ్లను సొంతంగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చి.. వాళ్లను రాత్రికి రాత్రే కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి? పేదలు జీవితమంతా సంపాదించిన సొమ్ముతో నిర్మించుకున్న ఇండ్లను కూల్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ఆశచూపి, 10 ఏళ్లు ప్రజలను నిట్టనిలువునా మోసం చేసింది. హైదరాబాద్ లోనూ 7 లక్షల ఇండ్లుకడతామని చెప్పి నిరుపేదలను దగా చేసింది. ఇదిగో ఇళ్లిస్తాం, అదిగో ఇళ్లిస్తామని చెప్పి అనేక ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని 10 ఏళ్లు మోసం చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పరిస్థితుల్లో అవకాశం ఉన్న చోట, పేదలు తమ కష్టార్జితాన్ని ధారపోసి ఇళ్లు కట్టుకున్నారు.
20 ఏళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. గత ప్రభుత్వాల హయాంలో.. 20-30 ఏళ్ల క్రితం సొంతగా నిర్మించుకున్న ఇండ్లు కూడా.. అక్రమమని ప్రస్తుత సర్కారు కూల్చేస్తే.. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి.
తప్పుడు లేఔట్ లు సృష్టించి ప్రజలను మభ్య పెట్టి, పెట్టుబడులు పెట్టించి, అక్రమంగా భూములు అమ్మిన వారిని కూడా దీనికి బాధ్యులను చేస్తూ ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకు రావాలి. లేకుంటే ఈ కూల్చివేతలతో ఎన్నో సామాన్య కుటుంబాలు మౌనంగా రోదిస్తూ.. రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన అన్ని టాక్స్ లు చెల్లించి, ఆస్తి పన్నులు కడుతూ, బ్యాంకుల్లో లోన్స్ తీసుకుని, నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చడం అన్యాయమే.
చివరగా, మీకు ఒక సూచన. హైడ్రా దూకుడు పేదలపై చూపకుండా.. బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను కూడా పరిణనలోకి తీసుకోండి.
మూసీ పరివాహక ప్రాంతంలో.. వేల మంది నివసిస్తున్నారు. చాలా మంది జీవనోపాధి కూడా ఈ ప్రాంత పరిధిలోనే ఉంటుంది. వారి జీవనోపాధి అంశాన్ని కూడా పరిగణిస్తూ.. విస్తృత పరిధిలో భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరపాలి. మూసీతోపాటుగా.. ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతల విషయంలోనూ.. ఎలాంటి దుందుడుకు విధానాలతో ముందుకెళ్లకూడదు.
అదేవిధంగా, బ్యాంకులకు, బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలకు (NBFCs)కు ప్రస్తుతం ఇస్తున్న రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయకూడదని కోరుతున్నాను.
ఇప్పటికే కూల్చివేతల నిర్ణయంతో ఆందోళనలో ఉన్న ప్రజలు.. ప్రభుత్వ అధికారుల వ్యవహారశైలితో మరింత అయోమయానికి గురవుతున్నారు. అధికారులు దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు జారీచేయగలరని కోరుతున్నాను.
ముఖ్యమంత్రిగా మీరు తీసుకునే నిర్ణయం.. అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదములు,
భవదీయ
(జి.కిషన్ రెడ్డి)