Hyderabad: టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీ వసూళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో నేను చేసిన ఫిర్యాదు ఎటు తేలకుండానే ఆ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడానికి వీల్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా శుక్రవారం మాల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని బోయిన్ పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై డిసెంబరు 6 ఆలోపు అభ్యంతరాలను వ్యక్తం చేయమని ఎన్నికల సంఘం పత్రికా ప్రకటన ఇచ్చింది. ఈ విషయంపై అభ్యంతరం చేయడానికి ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐదు రోజులైనా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో చివరికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రి, ఎన్నికల సంఘానికి ఆన్ లైన్ ఫిర్యాదు చేశాను. గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ పేరునే రద్దు చేయాలి. ఆ కేసు పెండింగ్లో ఉండగానే టీఆర్ఎస్ పేరును మారిస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే అని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ఆ లేఖ ఆధారంగా ఎన్నికల సంఘం ఈ ఏడాది నవంబర్ 25న సీబీడీటీ చైర్మన్ కు లేఖ రాసింది.

2019, ఫిబ్రవరి 5న ఇదే విధమైన లేఖను ఎన్నికల సంఘం సీబీడీటీకి రాసింది. 2017లో బంగారు కూలీల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాపారస్తుల నుంచి కోట్ల రూపాయలు బహిరంగంగా వసూలు చేశారు. బంగారు కూలీ పేరుతో వందల కోట్లు వసూల్ చేసిన పార్టీ ఆ లెక్కలు ఎక్కడా చూపించలేదని అన్నారు. దానిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టులో నేను కేసు వేశాను. నా వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు బంగారు కూలీల ఘటనపై టీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కు మార్గనిర్దేశనం చేసింది. టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీ వసూళ్ల కేసుపై 2018లో చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచింది. అయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. నా ఫిర్యాదు ఎటువంటి చర్యలు తీసుకోకుండా టీఆర్ఎస్ పేరును మార్చడానికి వీలు లేదు.
ఈ వ్యవహరంలో ఎన్నికల సంఘం మీ ఆదేశాలను పాటించడం లేదంటూ, తక్షణమే ఈ ప్రక్రియపై స్టే ఇవ్వాలని నేను డిసెంబరు 6న ఢిల్లీ హై కోర్టులో కేసు ఫైల్ చేశాను, డిసెంబర్ 7న నోటిసు వెళ్లింది, సోమవారం రోజు విచారణకు వస్తుంది. ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు మారుస్తూ లేఖ పంపింది. సోమవారం కేసు విచారణకు వస్తే ఇప్పటికే ఈ వ్యవహరంలో నిర్ణయం జరిగి పోయింది కాబట్టి నా పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చే అవకాశం ఉంది. 2018 నుంచి 2022 వరకు ఈ వ్యవహరంపై ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, హోంమంత్రి, ఈడీ, సీబీఐకి ఇలా సంస్థలకు ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ఎందుకు విచారణ చేయడం లేదు. నిజంగా బీజేపీకి కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని భావిస్తే ఎందుకు కోర్టు ఆదేశాలను అమలు చేయించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పై ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే.. ఏ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేస్తుంది.

బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్ఎస్‌కి సహకరించింది. ఇంత మంది వ్యాపారుల మీద దాడి చేస్తున్న ఐటీ బంగారు కూలీల వ్యవహరంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితతో ఒక రకంగా మిగతా వారితో మరొరకంగా అధికారులు ప్రవరిస్తున్నారు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కనిమొళిని విచారణకు పిలిచి ఇప్పుడు కవితతో మాత్రం ఆమె సమయం అడుగుతున్నారు. కనిమొళికి ఒక న్యాయం, కవితకు ఒక న్యామయా. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఢిల్లీలో విచారణకు పిలిచి కవిత వివరణ మాత్రం ఆమె కోరుకున్న సమయానికి తీసుకుంటామనడం టీఆర్ఎస్, బీజేపీ సహకరించుకుంటున్నాయి అనడానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారడం వెనుక పెద్ద కుట్ర ఉంది. దక్షిణ భారతదేశంలో బీఆర్ఎస్ ను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీకి ఆప్, ఎంఐఎంతోపాటు ఇప్పుడు మూడో మిత్రుడు చేరిండు అదే బీఆర్ఎస్. ఆప్, ఎంఐఎం ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతున్నాయి. బీఆర్ఎస్ ను కర్ణాటకలో వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రయోగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. గుజరాత్ మోడల్ ను కర్ణాటకలో అమలు చేయాలనుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారు. బెంగాల్ మోడల్ ను తెలంగాణలో పాటిస్తున్నారు. మోడీని చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్ గుజరాత్లో కేజ్రీవాల్ తో కలిసి మోదీ వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేయలేదు.

టీఆర్ఎస్ ను బీఆరెస్ గా పేరు మార్చుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఏ రోజు కూడా కేసీఆర్ కు తెలంగాణతో పేగు బంధం లేదు. బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలతో, తెలంగాణ రాష్ట్రంతో పేరు బంధం కూడా తెగిపోయింది. తెలంగాణ పేరుని కేసీఆర్ కృష్ణార్పనం చేశారు. అది ఆయన ఇష్టం.. ఆయన ఖర్మ అని రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ ఆత్మ సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను యధాలాపంగా చూడాల్సిన వ్యవహారం కాదు. ఇది పక్కా ప్రణాళికతో జరిగింది. ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దుతు ఉంది. తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తామని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు ఖండించడం లేదు. ఏపీ, తెలంగాణ తిరిగి కలిసిపోతే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. సజ్జల మాట్లాడి 24 గంటలు గడవకముందే నిన్న ఎన్నికల సంఘం కేసీఆర్ కు పంపిన లేఖలో ఆయన చిరునామా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అని ఉంది.

కేసీఆర్ ఎన్నికల సంఘానికి పెట్టుకున్న దరఖాస్తులో కూడా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అని రాసారు. దరఖాస్తులో కేసీఆర్ పేర్కొన్న చిరునామాకే ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇది జరిగి 24 గంటలు అయినా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా కేసీఆర్ అంగీకరించడంలేదు. సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహం. నిజంగా తెలంగాణ సమాజానికి ఇది బ్లాక్ డే. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలి.
ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలతోపాటు 6 శాసనసభ స్థానాలు, యూపీలోని ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లలో బీజేపీ అధికారంలో ఉంది. వీటిల్లో ఢిల్లీ మున్సిపాలిటీతోపాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. గుజరాత్ లో ఉన్న అధికారాన్ని మాత్రమే నిలబెట్టుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 15 ఏళ్ల బీజేపీ పాలనను ఢిల్లీ ఓటర్లు తిరస్కరించారు. మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు నిత్యం తిరిగే ఢిల్లీలో బీజేపీ ని ప్రజలు తిరస్కరించారు. హిమాచల్ లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
మూడు రాష్ట్రాల్లో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. అంతేకాకుండా 6 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. యూపీ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే యూపీ అని కమలం నేతలు చెప్పుకునే ఉత్తరప్రదేశ్లో మెయిన్ పురి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 2 లక్షల ఓట్ల తేడాతో ఓటమిపాలేంది. బీజేపీ కి ఘోరమైన ఓటమి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వంటి తప్పుడు వాగ్ధానాలు చేయడంతోపాటు ధరలు పెంచి, నిరుద్యోగ సమస్యకు కారణవుతున్న మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. మోదీ ఓటమి గురించి మీడియాలో రాకపోవడం దురదృష్టకరం. బీజేపీ అనుకూల మీడియా ఈ వార్తను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోంది.
సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
మాల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని బోయిన్ పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 9 కి తెలంగాణలో ఎంతో ప్రాధాన్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి, ప్రపంచంలోని ఉక్కు మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొంది ఈ దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సోనియా గాంధీ గారి పుట్టిన రోజు. సోనియా గాంధీ జన్మదినం తెలంగాణకు పర్వదినం. అంతేకాకుండా యూపీఏ ప్రభుత్వం ఇదే రోజున 2009లో 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన 1065 మందిని అభినందిస్తూ రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. పేదలకు చీరల పంపణీని కూడా చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిలో ఇప్పటి వరకు 609 మంది కార్యకర్తలు మరణించారు. అందులో 100 మంది కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల రాజీవ్ గాంధీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడం సోనియాగాంధీ బాధ్యతగా భావించారు. అందుకే ప్రతీ కార్యకర్తకు రాజీవ్ బీమా ద్వారా భరోసా కల్పించారు. భవిష్యత్ లోనూ కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. త్వరలోనే సోనియా నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్లో మొదటగా అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.