సబ్బండ వర్గాల పోరాట ఫలితం.. ఒక్క కుటుంబమే బాగుపడ్డ వైనం

కల్వకుంట్ల కసాయి పాలనలో దశాబ్దపు దగా…

నమ్మకం తో తెచ్చుకున్న తెలంగాణ ను అమ్ముకుంటున్నారు…

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల అలుపెరుగని పోరాటాన్ని, యువకుల త్యాగం, విద్యార్థుల అమరత్వాన్ని కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియమ్మ గుర్తించి రాజకీయాలు పక్కన పెట్టి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసింది. సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం చేసిన పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ దశాబ్ద కాలంలో సగటు మనిషి జీవితంలో పెద్దగా మార్పు లేకపోయినా ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రం లక్ష కోట్ల రూపాయల సంపదను కొడపెట్టుకుంది.

ఆరు దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటం మన నీళ్లు మనకు వస్తాయని, మన కొలువులు మనకు వస్తాయని, మన నిధులతో మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవచ్చని తెలంగాణ ప్రజలు మూడు తరాల పోరాటం చేశారు. 60 ఏళ్ల కష్ట ఫలితంగా తెలంగాణ భౌగోళికంగా ఏర్పాటు చేస్తూ అనేక హక్కులు కల్పిస్తూ అభివృద్ధికి బాటలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.. ఎంతో కష్టపడి ఇష్టంగా తెచ్చుకున్న తెలంగాణ నేడు కష్టాల కొలిమిలో కుతకుత మంటోంది..

తెలంగాణ ఏర్పడగానే ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ కోసం పోరాటం చేశామని చెప్పుకున్న పెద్దమనిషి మొదట్లోనే మోసానికి తెరలేపారు. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ఎన్నికల ఎజెండాలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారని భయపడ్డాడు.. దాంతో ఎన్నికల్లో దళితులకు ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని 1 ఎకరం ఉంటే 2 కలుపుతా, 2 ఉంటే 1 కలుపుతా మొత్తం లేకపోతే మూడు ఎకరాల ఇస్తా, పెట్టుబడి ఖర్చు ఇస్తా, వ్యవసాయ కూలీలను రైతులుగా చేసి గర్వాంగా బతికేలా చేస్తా అన్నాడు.. మన కొలువులు మనకే కావాలి, ఇంటికో ఉద్యోగం ఇస్తా, లక్ష ఉద్యోగాలు మొదటి ఏడాదే నింపుతా అన్నాడు.. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన ఇల్లు పిట్ట గూడు లెక్కన ఉంది.. అల్లుడొస్తే ఎక్కడ పండుకుంటాడు.

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా గౌరవంగా బతికేలా చేస్తా అన్నాడు.. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నాడు, నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అన్నాడు, రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ అన్నాడు, మండల కేంద్రంలో 100 పడకల దవాఖాన అన్నాడు ఇట్లా చెప్పుకుంటా పోతే చెంతాడు అంత పథకాల లిస్ట్ చెప్పిండు.. పదేళ్ల పాలన అయ్యింది తెలంగాణ ఏమైందని చూస్తే కల్వకుంట్ల కుటుంబం దేశంలోనే ఆర్థిక బలవంతులు అయ్యింన్రు, రాష్ట్రంలో 5 లక్షల కోట్ల అప్పుల పాలు అయ్యింది.

రైతుల ఆత్మహత్యలు దేశంలో నెంబర్ 2 గా మిగిలింది. అవినీతి ఖండాంతరాలు దాటి పోయింది. తెలంగాణ అంటే అప్పులు, అవినీతి, ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. దశాబ్ద కాలపు దగా అయ్యింది.. 60 ఏళ్ల పాలనలో 60 వేల కోట్ల అప్పుతో తెలంగాణ ను సారు చేతిలో పెడితే ప్రజల చేతిలో అప్పుల చిప్ప పెట్టిండు, 5 లక్షల కోట్ల అప్పు చేసిండు, పుట్టిన ప్రతి బిడ్డ నెత్తిన లక్షన్నర అప్పు పెట్టిండు.. ఇదేనా తెలంగాణ ఓరాజలను పోరాడి సాధించుకున్న తెలంగాణ భవిష్యత్… తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞం పెట్టి ఒక్క తెలంగాణ లోనే 33 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి గోదావరి, కృష్ణ ప్రధాన నదులలో తెలంగాణ కు రావాల్సిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకునేలా ఒక పకడ్బందీ ప్రణాళిక చేపట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి, ఎస్సార్ఎస్పీ, దేవాదుల, దుమ్ముగూడెం, కంతనపల్లి, ఇటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయలసాగర్, ఎస్.ఎల్.బి.సి పాలమూరు రంగారెడ్డి లాంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి దాదాపు 80 శాతం పూర్తి చేస్తే తెలంగాణ ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ సమావేశంలో స్వయంగా కేసీఆర్ 8 వేల కోట్లు ఖర్చు పెడితే 33 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని వాటిని ప్రాధాన్యత క్రమంలో మొదటి ఏడాదిలో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని చెప్పారు.. తర్వాత దోపిడీ కోణంతో రీ ఇంజనీరింగ్ అంటూ ప్రాజెక్టుల రీ డిజైన్ అంటూ మోసపు మాటలు, మోసపు చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పక్కన పెట్టి దోపిడీకి తెర లేపి కాళేశ్వరం పేరుతో ఒక అనర్థక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి లక్షన్నర కోట్ల రూపాయలు వ్యయం చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారు.

దొరికిన అన్ని ఆర్థిక సంస్థల వద్ద అడ్డగోలు అప్పులు చేశారు. కమిషన్లను దండుకొని ప్రాజెక్టు ను చేపట్టారు. ప్రాణహిత నది నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వచ్చే నీటి ప్రాజెక్టు ను కాదని ప్రాణహిత నది దిగువన మూడు ప్రాజెక్టులు నిర్మించి వాటికి దేవతల పేర్లు పెట్టి అడ్డగోలు విద్యుత్ వినియోగించి నీటిని తోడి ఎల్లంపల్లి లో పోసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లకు నీళ్లు తరలించినట్టు ప్రజలను మభ్య పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. గోదావరిలో నీరు పుష్కలంగా వస్తున్న కూడా ప్రాణహిత నుంచి నీటిని తోడి ఎల్లంపల్లి నింపి తర్వాత గోదావరి నీరు రాగానే కిందకు వదిలిన సందర్భాలు ఈ ఐదేళ్లలో అనేక సార్లు చూశాం.. ఈ సాంకేతిక అంశాలు ప్రజలకు అర్థం కావు కాబట్టి, సాగునీటి పేరు మీద సెంటిమెంట్ అస్త్రాన్ని వాడి ప్రజలను మభ్యపెట్టి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఒక్క పైసా కేటాయించలేదు. కృష్ణ నడిపైన ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అద్బుతాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం కేవలం కొనసాగింపు కార్యక్రమాలు చేసారు తప్ప కొత్తగా చేసిన పనులు శూన్యం.. పెన్షన్లు ఇస్తున్నాం, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ఇంటింటికి నీళ్లు ఇస్తున్నాం, జిడిపి పెరిగింది, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందని పదే పదే చెప్తున్న కేసీఆర్ అవన్నీ కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కొనసాగింపు కదా అన్న ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం లేదు. తెలంగాణ ఇచ్చినపుడే హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఇవ్వాలన్న నిబంధన పెట్టడంతో పెరిగిన ఆదాయంతో చేస్తున్న సంక్షేమ పథకాలు తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. రెండు దశాబ్దాల కింద 30 వేల కోట్లు ఉన్న ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇప్పుడు ఒక్క తెలంగాణ లోనే 3 లక్షల కోట్లకు పెరిగిన ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి ఫలితం కాదా… ఆదాయం పడింతలు పెరిగినపుడు 200 నుంచి 2 వేల పెన్షన్ చేస్తే అది తమ గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఉచిత విద్యుత్, ఇంటింటికి నీరు.. చెరువుల మరమ్మతులు, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు కాదా.. విద్యుత్ రంగంలో ఒక్క మెగావాట్ కూడా కొత్తగా ఉత్పత్తి చేయలేదు. నీళ్లు బొగ్గు లేని దగ్గర 4 వేల మెగా వాట్ల ప్రాజెక్టు యాదాద్రి ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేని ఔట్ డేటెడ్ టర్బన్ లను ఉపయోగించి విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఛత్తీస్ ఘడ్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరలకు విద్యుత్ లభిస్తున్న కూడా అధిక ధరలకు ఛత్తీస్ ఘడ్ వద్ద కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దండుకున్నది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ విధానం తో 5 వేల మెగా వాట్ల విద్యుత్ వచ్చిందే తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఒక్క మెగా వాట్ కొత్తగా ఉత్పత్తి చేయలేదు..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూపాల్ పల్లి లో 500 మెగావాట్ల, 600 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మరో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి లో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి రోశయ్య ఉన్న సమయంలో కరీంనగర్ లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రానికి పునాది రాయి వేయడం జరిగింది.అయితే ఇంతవరకు ఆ ప్రాజెక్టును ముందుకు తీస్కొనిపోలేదు.. ఇవన్నీ చేయని కేసీఆర్ నీరు, బొగ్గు లేని ప్రాంతంలో యాదాద్రి బొగ్గు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం నుంచి ఉత్పత్తి ఖర్చు వ్యయం అధికమై భారంగా మరిపోయింది.

తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికలలో కేసీఆర్ ఇచ్చిన ప్రధాన హామీలలో ఒక్కటైన నెరవేర్చరా.. తెలంగాణ బిల్లులో మనకు హక్కుగా రావాల్సిన ఒక్క పని అయిన కేంద్రంపైన కొట్లాడి తీసుకొచ్చారా…

దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు.. రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు అర్హులు ఉన్నారు. ఎంత మంది కి భూములు ఇచ్చారు.. ఎన్ని కుటుంబాలకు ఇవ్వాలి.. అనే లెక్కలు లేవు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఎన్ని ఇళ్ళ ను నిర్మించారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. రిజర్వేషన్లు అంశం ఎక్కడ ఉంది. కేజీ నుంచి పీజీ ఏమైంది, ఉద్యోగాల జాడ ఎక్కడ.. ? ఒప్పంద ఉద్యోగాల పర్మనెంట్ ఏమైంది, ఇవ్వేవి చేయకపోగా పేపర్ లీకులు, లిక్కర్ స్కామ్ లతో తెలంగాణ దేశంలో పరువు పోగొట్టుకుంటుంది.

కేంద్రం నుంచి రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలేదు.. మంజూరు అయిన ఐటీఐఆర్ ను రద్దు చేశారు, ఐరన్ కంపెనీ జాడ లేదు, ట్రైబల్ యూనివర్సిటీ, ఐఐఎం గురించి ఆడిగేవాడే లేడు. ఇవన్ని ఇలా ఉంటే తెలంగాణ లో 5 లక్షల కోట్లు అప్పు, ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుంటున్నారు.. 111 జిఓ ఎత్తేసి లక్ష కోట్ల కుంభకోణం చేశారు. ఇలా ఒకవైపు కుంభకోణాలు, అవినీతి, మరో వైపు అప్పులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. తెలంగాణ బిల్లులో హక్కుగా రావాల్సిన ఒక్క పని కాలేదు.. దశాబ్దపు తెలంగాణ లో సగటు జీవి బతుకుల్లో పెద్దగా మార్పు లేకపోయినా కల్వకుంట్ల కుటుంబం మాత్రం లక్ష కోట్ల రూపాయల సంపదను కూడబెట్టుకుంది.

– తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X