హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను స్టేషన్‌కు తరలించేందుకు పోలీస్ వాహనంలో ఎక్కించారు. పోలీస్ వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో వెహికల్ అద్దాలు పగిలాయి. కొందరు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
మరోవైపు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు కొడుతున్నారని.. బీజేపీ ఆరోపించింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కలేక్టరేట్ లోకి వెళ్లకుండా గేట్లను మూసేసిన పోలీసులు. భారీగా మోహరించిన పోలీసులు. కలెక్టరేట్ కార్యాలయంలోకి అనుమతించాలంటూ రైతులు, బీజేపీ కార్యకర్తల నినాదాలు. కలెక్టరేట్ లోకి అనుమతించని పోలీసులు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట. బారికేడ్లను తీసుకొని ముందుకు వచ్చిన రైతులు, కార్యకర్తలు. కలెక్టరేట్ గేట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న రైతులు, మహిళలు, కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్, రైతు ఆత్మహత్యకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా నిర్వహించింది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఇక అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న రాము కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు.