దేశంలో అతిక్రమించిన అమానుషం, ఇన్ని రకాల నేరాలు!? ఇలా చేయండి సరిపోతుంది

అసలు సమాజం ఎటు పోతుందీ?
రచయిత కమలేకర్ నాగేశ్వర్ రావు

అసలు ఎటు పోతుందీ సమాజం. కొరవడుతున్న నైతిక విలువలతో పతనమౌతున్న మనిషి. మనిషి మనిషిగా మసులుకోవడం మర్చిపోతున్న సమయం. మాతృత్వపు భావనలు మచ్చుకైనా కనపడని వైనం.

జన్మనిచ్చిన తల్లిని, తోడబుట్టిన చెల్లిని, కడుపున పుట్టిన బిడ్డని,ఆడదైతే చాలు అది పసికందు నుంచి పండు ముసలి వరకు కంట పడితే చాలు పొడుచుకొస్తున్న కామం. దినదినానికి పెట్రేగి పోతున్న వికృత చేష్టలు.పొద్దునే లేచి రాత్రి పడుకునే వరకు ఏ దుర్వార్త ఎటునుంచి వినవలసి వస్తుందోనన్న భయపూరిత వాతావరణం. తండ్రిని చంపిన కొడుకు, తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు, భార్యను చంపి కుక్కర్ లో ఉడికించిన భర్త, ప్లాస్టిక్ సర్జరీతో భర్తను మార్చే భార్య, ప్రియుడి మోజులో పిల్లల్ని చంపిన తల్లి, ప్రియురాలిని చంపిన ప్రియుడు, డ్రగ్ మత్తులో బలవుతున్న యువత, ఆన్లైన్ గేమ్ లో అప్పులపాలై ఆత్మహత్యలు, గురువును చంపిన శిష్యులు, పరువు హత్యలు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దిశ వరకు ఎన్ని చట్టాలొచ్చినా ఆగని అత్యాచారాలు, అమానుషాలు. మొన్నటికి మొన్న ఊర్కొండలో జరిగిన అమానవీయ ఘటన. ఇలా ఎన్నో, ఎన్నెన్నో మనసుల్ని కలిచివేస్తున్న అకృత్యాలు. ఇలా బయటికొచ్చి తెలిసినవి కొన్నే, తెరచాటున తెగిపోయిన బంధాలెన్నో, నలిగిన హృదయాలెన్నో, కమిలిన గాయాలెన్నో, కుమిలిన బ్రతుకులు ఎన్నో, చెదిరిన జీవితాలెన్నో, కొడిగట్టిన దీపాలై ఆగమైన కుటుంబాలెన్నో.

ఆలోచిద్దాం, అవలోకనం చేసుకుందాం. అసలు తప్పెక్కడ జరుగుతుంది? నేడు ప్రపంచీకరణ మోజులో పటాపంచలవుతున్న ఉమ్మడి కుటుంబాలు. ఎవడి దారి వాడిదే. ఎవడికి వాడే హీరో. ఒకనాటి బడితె పూజ చేసిన బడిపంతుల్లేరి?, బతుకు పాఠాలు నేర్పిన బడిపాఠాలేవి? మొక్కై వంగనిది మానై వంగునానని క్రమశిక్షణతో మలిచిన బడులేమాయే? బంధాలవిలువలు తెలిపిన సినిమాలెక్కడపాయే?

Also Read-

నేడు బట్టలిప్పి నాట్యమాడే చిత్రాలే కదా అన్ని. మనసు విప్పి మాట్లాడే రోజులు మరిసి ఎన్నాళ్ళైదో. ఇప్పుడంతా కుళ్ళుకుతంత్రాలతో ముందు నవ్వి,వెనుక గోతులు తీసే మొబైల్ ముచ్చట్లే కదా.సాంకేతికత మోజులో సర్వం తనచెంతై సర్వస్వం కోల్పోతున్న తరుణం.

అన్యాయం జరిగినప్పుడు అరవడంలో, ఆదుకోవడంలో వర్ణాలు, వర్గాలు, జాతులు, మతాలు, కులాలు అంటూ వైషమ్యాలు ఏలా? మతమేదైనా, కులమేదైనా, వర్ణమేదైనా, వర్గమేదైనా అతలాకుతలమైన జీవితానికి ఆసరాగా నిలిచి,ప్రాంత, పార్టీ బేధాలను మరిచి ప్రతిఘటించాల్సిన అవసరముంది కదా. అన్యాయం జరిగాక శాంతిభద్రతలు పటిష్టం చేయడం కాదు.ఘోరం జరిగే కంటే ముందే పటిష్టమైన భద్రతనిస్తే, భరోసానిస్తే నేరం జరుగుతదా? పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళేటప్పుడు, వచ్చేటపుడు విద్యార్థినీలపై జరుగుతున్న వికృతాలు తెలిసినవే కదా. ఆ సమయంలో తప్పుచేసినోడికి నాలుగు తగిలించే ధైర్యమున్న రక్షకభటులేరి? హద్దుమీరిన స్వేచ్ఛనిచ్చి ఆకతాయిల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా చేసిందెవరు?

చట్టం చదివిన వారు, చట్టం తెలిసిన వారు ఈ అకృత్యాలకు ఒడిగొట్టినవారికి చేయూతనందించక వారి చేతులిరిసే బహిరంగ శిక్షలకు పిలుపివ్వాల్సిన అవసరముంది కదా. అత్యాచారం చేసినోడు ఆలోచించి సమయం తీసుకొని అకృత్యం చేసాడా? వాడిని శిక్షించడానికి అనవసరంగా కాలం వృథా చేయడం న్యాయమా? ఒకరు కాదు ఇద్దరు కాదు సామూహికంగా బ్రతుకును ఆగంచేసి దాహమంటే ఉచ్ఛపోసిన ఆ దుర్మార్గులను ఉరికించి కొట్టడమే కాదు, బహిరంగంగా ఉరి తీస్తేనే కదా ఊపిరి విలువ తెలిసేది. ఔను నిర్ణయాలు కొన్ని కఠినతరం చేస్తేనే క్రమశిక్షణ దారి తప్పదు. మాటలతో చెబితే విని, మారే రోజులు పోయినప్పుడు, తన్ని తలబిరుసు దింపాల్సిందే.

– కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’ (98484 93223)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X