హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్రంలోని పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి, లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ సునీల్ శర్మ లతోకలసి నేడు బిఆర్ కేఆర్ భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి మానస పుత్రిక ఐన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. బీపీఎల్ కుటుంబాలు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, అద్దె ఇలలో ఉన్న వారి జాబితాను ఎంపిక చేసి గ్రామ,వార్డ్ సభలు నిర్వహించాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో హైదరాబాద్ లోని టీ.ఎస్.టి.ఎస్ కు పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ తోసహా రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 91 వేళా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని వివరించారు. హైదరాబాద్ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాలైన విద్యుత్, సీవరేజ్, రహదారుల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. ఇళ్లను లబ్దిదారులకు కేటాయించడంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.