హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ తొలి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో అందరిని ఆకట్టుకుంటోంది. పాలనలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలోనూ గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరిస్తుండటం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శనివారం నాడు శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గా మాటల యుద్ధం జరగగా ఈ సమయంలో కొత్త ప్రభుత్వం వైఖరి, సీఎం రేవంత్ రెడ్డి మాటలపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎంతో పాటు మంత్రులు సైతం రియాక్ట్ కావడం ఆసక్తిగా మారింది. గత ప్రభుత్వంలో అంతా కేసీఆర్ అన్నట్లుగా నడిచిందని అధికార పక్షం అంటే పూర్తిగా వన్ మ్యాన్ షో గా నడిపించారని కానీ కొత్త ప్రభుత్వంలో మాత్రం సీఎంతో పాటు మంత్రులు సైతం తమ స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తపరచడం శుభపరిణామం అనే చర్చ జరుగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో సభలో ప్రతిపక్ష నేతలు తమ గళాన్ని వినిపించే అవకాశం తక్కువగా ఉండేదని ఇవాళ జరిగిన సభలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపించిందనే టాక్ వినిపిస్తోంది. అధికార పక్షం నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు, ఎంఐఎం, బీజేపీ, సీపీఐ లకు స్పీకర్ మాట్లాడే అవకాశం కల్పించారు. కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో అధికార పక్షం కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కే ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం స్పీకర్ కల్పించారని ఒక దశలో మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని చెప్పారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలు తాము ఎప్పుడు స్వీకరిస్తామని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో కేసీఆర్ సైతం ఇదే తరహాలో ప్రతిపక్షాల సలహాలు స్వీకరిస్తామని చెప్పినా ఆచరణలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అనేక అవంతరాలు సృష్టించారని కొత్త ప్రభుత్వంలో అలా కాకుండా నిర్మాణాత్మక చర్చ జరగాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు అసెంబ్లీ అంటే కేవలం కేసీఆర్ అన్నట్లుగా కాకుండా ఇప్పుడు ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా చర్చ సాగుతుండటం ఆసక్తిగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 16వ తేదీ శనివారం రాష్ట్ర శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల హక్కులను కాపాడడం కోసం తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ప్రజాస్వామిక పాలన అందిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉండాలని ఏ సమస్యపై అయినా ధర్నా చౌక్ వద్ద అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం కోసం మా ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు.
గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పిలర్లు కుంగిపోవడంపై విచారణ జరిపిస్తామన్నారు సీఎం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డ పర్యటనను తీసుకువెళ్తానని.. ఎందుకు కుంగిపోయిందో తెలుసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామన్నారు. అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయని కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు?.. వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర ఉందా? అనే విషయాలు విచారణలో బయటకు వస్తాయని -సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో అమలు
పేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అసెంబ్లీలో భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. 23 మంది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారన్నారు. ఆత్మ గౌరవంతో బ్రతకడానికి కావాల్సిన వాళ్లకు చేయూత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
మొదటి కేబినెట్ సమావేశంలోనే 6 గారంటీలకు ఆమోదం తెలిపామని ధీమా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ గ్యారంటీల వల్ల పేదలకు మంచి జరుగుతుందని చెప్పారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ను తీసుకురాబోతున్నామన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రలు అవాస్తవాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. వారి తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతామో అని భయపడి మైక్ కట్ చేశారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. క్లారిఫికేషన్ ఇచ్చేందుకు సమయం అడిగితే సభ వాయిదా వేశారన్నారు. మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారన్నారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర హరీష్ రావు మాట్లాడారు.
కుటుంబపాలనపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు హరీష్ రావు. తెలంగాణ అమరుల గురించి సీఎం రేవంత్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదన్నారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా పడ్డాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో చర్చ ముగిసింది. దీంతో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమెదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలను తిరిగి బుధవారం పున: ప్రారంబించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.
డిసెంబర్ 16వ తేదీ శనివారం రాష్ట్ర అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన తప్పులను ఎత్తిచూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్షం కూడా అధికార పక్షానికి ధీటుగా సమాదానమిచ్చింది.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది
సభలో అర్థవంతమైన చర్చ జరగాలని సభ్యులు వ్యక్తిగత దూషనలు చేయకుండా చర్చ జరగాలని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన కలిగేలా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారని.. ఇది మంచిది కాదన్నారు. తెలంగాణ శాసనసభలో మంచి వాతావరణం ఉండాలన్నారు.
అసెంబ్లీలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని చెప్పారు. గతంలో బడ్జెట్, చర్చ ఒక్కరోజులోనే పూర్తి చేశారని.. మొక్కుబడిగా సభ జరిగిందని ఆయన విమర్శలు చేశారు.గతంలో వైఎస్ చెప్పిన హమీలన్నీ నెరవేర్చారని.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
ఆరు గ్యారంటీలు చట్టబద్దంగా అమలు చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ మొదటి తప్పు చేసిందన్నారయన. ప్రజల స్వేచ్ఛ, వాక్, భావస్వాతంత్ర్యాలు లేకుండా చేసి రెండో తప్పు చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆయన కాంగ్రెస్ సర్కార్ కు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 26 ప్రజా సంఘాలపై నిషేధం విధించిందని కూనంనేని చెప్పారు.
గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తిగా తప్పుల తడక
అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. సభ్యుడిగా దీనికి తాను సిగ్గుపడుతున్నానన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారి మీద నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. దీన్ని తాను ఖండిస్తున్నానన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే అలాగే తెలంగాణ పక్షమేనన్నారు.. కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమేనన్నారు. కేటీఆర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పాలన పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉందని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని చెప్పారు. ఇమామ్‌లకు రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ అభివృద్ధిలో సర్కార్‌కు సహకరిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయని చెప్పారు. ఆ రెండు పార్టీలు ముస్లింలను పెద్దగా పట్టించుకోలేదని అక్బరుద్దీన్ మండిపడ్డారు. (ఏజెన్సీలు)