CM KCRను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా తప్పులేదు, రైతులకు బేడీలు సిగ్గనిపించడం లేదా…?: రేవంత్ రెడ్డి

దివాళా తీసిన కంపెనీకి ధరణి బాధ్యత

విదేశీ కంపెనీ చేతుల్లోకి తెలంగాణ డేటా

ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ‘‘సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టిన తప్పు లేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి తాము ఏ మాత్రం భయపడటం లేదన్నారు రేవంత్ రెడ్డి. 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనానికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. ధరణి దోపిడీపై శోధిస్తున్నా కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రెవెన్యూ రికార్డులను ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు కట్టబెట్టారు. రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టల్ ద్వారా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ నిర్వహిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వాస్తవానికి దివాళా తీసిన కంపెనీ. గతంలో రూ.90 వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను నిండా ముంచింది. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పుని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఐఎల్ అండ్ ఎఫ్ఎస్..ధరణి నిర్వహణ కోసం సబ్సిడరీ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 52.26 శాతం వాటాను టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూ.1275 కోట్లకు 2021, నవంబర్ 25న అమ్ముకుంది. కొనుగోలు చేసే కంటే ఒక నెల ముందు మాత్రమే ఫాల్కన్ కంపెనీని 2021, అక్టోబర్లో ప్రారంభించారు. ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపీనికి ఇచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి శ్రీధర్ రాజు చేరారు. దాంతో ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది.

‘‘ప్రజల భూముల వివరాలన్నింటినీ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు. ఐఎల్‌ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్‌కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. ప్రజల భూముల వివరాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని నేను మొదటి నుంచి చెబుతున్నా. ధరణి నిర్వహణపై ఐఎల్‌ఎఫ్ సంస్థతో రూ.150కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఐఎల్‌ఎఫ్‌ సంస్థకు చెందిన 99శాతం వాటాను టెరాలసిస్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ కొనుగోలు చేసింది.70లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్‌ఎఫ్‌ సంస్థకు విక్రయించారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

“శ్రీధర్ రాజుకు, కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు. సత్యరామలింగరాజు కుమారులకు శ్రీధర్ రాజుకు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ మూడేళ్లు కష్టపడి రూపొందించిన అంటున్నారు. కానీ కేసీఆర్ అసలు సిగ్గుందా? ఒడిశా ప్రభుత్వం 2008లో ఈ-ధరణి పేరుతో ఈ ప్రాజెక్టు లాంచ్ చేసింది. దీన్ని నిర్వహణను కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు అప్పగించింది. ధరణి పోర్టల్ ను ఉపయోగిస్తే… అంతా తప్పుల తడకగా ఉందని కాగ్ రిపోర్టు ఇచ్చిందని రేవంత్ చెప్పారు. ధరణితో నష్టం వచ్చిందని కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారని వివరించారు. ఒడిశాలోనూ ILFS సంస్థే ధరణిని నిర్వహించిందని, అలాంటి సంస్థతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. ఇంత జరిగితే కేసీఆర్ తానే అద్భుతాలు చేసి ధరణిని సృష్ఠించినట్టు చెప్పారని ఎద్దేవా చేశారు.

ధరణిలో ఇప్పటివరకు 25 లక్షల లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.50వేల కోట్ల లావాదేవీలు జరిగాయని అంచనా. ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లడం లేదు. ఇవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి. ఇక్కడే అసలు మతలబు ఉంది. రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదు. మక్తల్ కు చెందిన ఆంజనేయులు గౌడ్ ఒక ఉదాహరణ. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని ఐదు లక్షల రూపాయలు చెల్లించాడు. కానీ రిజిస్ట్రేషన్ రోజున వెళ్లకపోవడంతో రిజిస్ట్రేషన్ కాలేదు. సంబంధిత వర్గాలను అడిగే రిఫండ్ చేశామని సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి ఆన్లైన్లో మాత్రం డబ్బులు రిఫండ్ కాలేదు. ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి? అసలు ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ధరణిలో లావాదేవీల్లో భాగంగా సేకరించే ఆధార్, పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది. డేటా ప్రైవసీ ప్రకారం దేశ పౌరుల డేటాను విదేశీయులు యాక్సెస్ చేయడానికి వీల్లేదు. ధరణి దోపీడీని మేం బయట పెడితే.. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శఇంచారు. ధరణి ద్వారా జరిగిన లావాదేవీలతో వచ్చిన రూ.50 వేల కోట్లలో రూ. 40 వేల కోట్లు ప్రభుత్వానికి వెళ్లాయని కొంత మంది అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా.. అవాస్తవమా విచారణ చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే ధరణి లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదిక కోరాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా అన్నారు.

భారతీయుల డేటాను ఇతర దేశాలకు ఇచ్చినందుకు.. సంబంధిత అధికారులను క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కోరారు. ధరణి పోర్టల్ సింపుల్ సాఫ్ట్ వేర్ కాదన్నారు. దోపిడీ చేసేందుకే ధరణి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం…. అవసరమైతే కోర్టు తలుపు తడతాం. దోపిడీ బయటపడుతుందనే నా ఆరోపణలపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. అందుకే కేసీఆర్ రైతులను, ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ధరణిలోపాలు లేకుంటే కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దోషిగా నిలబడింది? 33 రకాల తప్పులు ఉన్నట్లు నవీన్ మిట్టల్ హైకోర్టు ముందు ఎందుకు ఒప్పుకున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి మాస్టర్ కీ శ్రీధర్ రాజు దగ్గర ఉంది. తెలంగాణ భూమిలన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారు. శ్రీధర్ రాజు ఏ యువరాజుకు దగ్గరి వాడో తేలాలి. చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి. లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా కేంద్రం కేసీఆర్ పై ఎందుకు విచారణకు అదేశించడంలేదు? దీని వెనక ఏ గూడుపుఠానీ ఉందో కేంద్ర పెద్దలే చెప్పాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసులపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “అరవింద్ కుమార్ లీగల్ నోటీసులను రిజిస్టర్ పోస్టు లేదా పర్సన్ ద్వారా నాకు పంపాలి.. కానీ పబ్లిక్ డొమైన్ లో ఎలా పబ్లిష్ చేస్తారు… మీడియాకు ఎలా రిలీజ్ చేస్తారు? ఉద్దేశపూర్వకంగానే అరవింద్ కుమార్ నా ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించారు. రాజకీయంగా ఇతర పార్టీలకు లాభం చేకూరేలా ప్రవర్తించారు” అని అరవింద్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఓఆర్ఆర్ సగ భాగం వరకు నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఓఆర్ఆర్ టెండర్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించే ప్రక్రియ ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం, ఎన్ హెచ్ఎఐ నిబంధనలను పట్టించుకోకపోవడం, ఐఏఎస్ అధికారి స్థానంలో రిటైర్డ్ అధికారితో టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం వంటి సందేహాలకు అరవింద్ కుమార్ సమాధానం ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. ఒక ప్రజాప్రతినిధిగా నేను సందేహాలకు సమాధానం ఇవ్వకపోగా రాజకీయ నాయకుడిగా మాదిరిగా వ్యవహరించారు. 1968 ఇండియన్ సర్వీసెస్ రూల్స్ మేరకు ఒక ప్రజాప్రతినిధితో ఒక అధికారి వాడని భాషను అరవింద్ ఉపయోగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. క్రిసిల్ నివేదిక, మేజర్స్ నివేదిక, టెండర్ బేస్ ప్రైస్, గత మూడేళ్లుగా నెలనెలా ఓఆర్ఆర్ ఆదాయం వివరాలను వెల్లడించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీహరి రావు

నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కూచాడి శ్రీహరి రావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువాకప్పి శ్రీహరి రావును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని దీమా వ్యక్తం చేశారు. కొడంగల్‌లో గెలవడం ఎంత ముఖ్యమో నిర్మల్ నియోజకవర్గంలో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. పార్టీలోకి వచ్చిన శ్రీహరిరావుకు సాదర స్వాగతం పలుకుతున్నానన్నారు. నిర్మల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందన్నారు. అలాగే పార్టీ గెలుపు కోసం పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. కొందరు పార్టీ వీడితే నాయకులే ఉండరన్నట్లు వ్యవహరించారని, కానీ అంతకంటే బలమైన నాయకులు పార్టీలోకి వచ్చారని తెలిపారు. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నా నిర్మల్ లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించలేకపోయారని మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తాను సవాల్ విసురుతున్నానని.. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించారో ఆ గ్రామంలో బీఆరెఎస్ ఓట్లు అడగాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామన్నారు. ఇందుకు ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదన్నారు. తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయినవారి జాబితాలో శ్రీహరి రావు మొదట్లో ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, నిర్మల్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10కి కనీసం 8 సీట్లు గెలిపించుకోవాలని సూచించారు. ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుఫాన్ రాబోతుందన్నారు. తలుపు తడితే చాలు ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొడతారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన నోముల ప్రకాష్ గౌడ్

సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల ప్రకాష్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువాకప్పి ప్రకాష్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాష్ గౌడ్ సేవలను ఉపయోగించుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గ్రేటర్ లో సెల్ఫీలు దిగే వారు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేవారు ఎక్కువయ్యారు అని బీఆర్ఎస్ నాయకులను ఎద్దేవా చేశారు. కేటీఆర్, దానం నాగేందర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. గ్రేటర్ లో మెట్రో నిర్మించింది కాంగ్రెస్ కాదా? అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిందేం లేదని విమర్శించారు. మూసీని కూడా కబ్జాలు చేసిన ఘనత బీఆరెస్ నాయకులది అన్నారు. కాలువలో పడి పిల్లలు చనిపోతే పట్టించుకునే దిక్కు లేదు. నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు అని అన్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కార్యకర్తలు బస్తీ బాట పట్టి ప్రజలకు చేరువ కావాలి. కాంగ్రెస్ ను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామన్నారు. జంట నగరాల నుంచి అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి అని పిలుపునిచ్చారు.

సిగ్గనిపించడం లేదా కేసీఆర్…? రేవంత్ ట్వీట్

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) బాధిత రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకొచ్చిన ఘటనపై రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఆడబిడ్డల పై అకృత్యాలు చేసే దుర్మార్గుల పై చర్యలు ఉండవు…మత్తు పదార్థాల మాఫియాకు శిక్షలు ఉండవు…భూ కబ్జాలు చేసే బీఆర్ఎస్ గద్దలపై కేసులు ఉండవు…తన రక్తాన్ని చెమటగా మార్చి బుక్కెడు బువ్వ పెట్టే రైతు చేతికి సంకెళ్లా? సిగ్గనిపించడం లేదా కేసీఆర్…?! అని రేవంత్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X