హైద్రాబాద్ : పిఆర్ఎస్ఐ ఛాప్టర్ సెక్రెటరీ డాక్టర్ కంభంపాటి యాదగిరికి నిబద్ధత, అంకితభావంతో సుధీర్ఘ కాలంగా ప్రజా సంబంధాల రంగంలో చేస్తున్న అవిరళ కృషికి గాను ప్రతిష్టాత్మకమైన పిఆర్ఎస్ఐ జాతీయ అవార్డు లభించింది. హైద్రాబాద్ ఛాప్టర్ పిఆర్ఎస్ఐని బహుముఖంగా విస్తృతీకరించి అభివృద్ధి పరచడంలో ఉత్తమ నాయకత్వంతో కీలక పాత్రను నిర్వహించినందుకు డాక్టర్ యాదగిరిని గుర్తించి ఉత్తమ కార్యదర్శిగా ఈ జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు.
ఈ అవార్డును ఆదివారం రాయ్‌పూర్‌లో నిర్వహించిన 46వ పిఆర్ఎస్ఐ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో డాక్టర్ యాదగిరి అందుకున్నారు. ఈ అవార్డును ఛత్తిస్ ఘడ్ ఉప ముఖ్య మంత్రి అరుణ్ సాహు చేతుల మీదుగా అందుకున్నారు. హైద్రాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఇంఛార్జ్ విభాగాధిపతిగా డాక్టర్ యాదగిరి ప్రస్తుతం పని చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన డాక్టర్ యాదగిరి అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖలో అధ్యాపకులుగా చేరాక డిగ్రీ, పీజీ స్థాయిలలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ప్రజా సంబంధాల కోర్సుల ప్రామాణికతను విస్తృత స్థాయిలో పెంచేందుకు ఎంతగానో కృషి చేశారు. యాదగిరి ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ( పిఆర్ ఎస్ఐ) సంస్థకు హైద్రాబాదు ఛాప్టర్ సెక్రెటరీగా రెండు సార్లు ఎన్నికై సేవలందిస్తున్నారు.
Also Read-
పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ జర్నల్‌కు సంపాదకవర్గ సభ్యులుగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం అదే పత్రికకు గౌరవ పాత్రికేయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజం, ప్రజా సంబంధాలపై డాక్టర్ యాదగిరి రాసిన పలు ప్రామాణిక వ్యాసాలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఈ కార్యక్రమంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాజాతీయ అధ్యక్షులు డాక్టర్ అజిత్ పాతక్, సెక్రటరీ డాక్టర్ పి ఎల్ కే మూర్తి, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ రాము పాల్గొన్నారు.
మరోవైపు, జాతీయ అవార్డు అందుకున్నందుకు యాదగిరిని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సస్ డీన్ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాసరావుతో పాటు ప్రజా సంబంధాల రంగ ప్రముఖులు, జర్నలిజం శాఖల ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.