• అంబేద్కర్ వర్షిటీలో ప్రొ. జి. రాంరెడ్డి స్మారకోపన్యాసం
హైదరాబాద్ : దూరవిద్యా పితామహుడు ప్రొ. జి. రాంరెడ్డి 92వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాక్ మాజీ డైరెక్టర్, డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ. వి. ఎస్. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొ. వి. ఎస్. ప్రసాద్ “నాలుగు దశాబ్దాల భారతదేశపు మొదటి ఓపెన్ యూనివర్సిటీ గతానుభవాలు, భవిష్యత్ ప్రయాణం” అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ప్రొ. ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో దూరవిద్య విధానాన్ని ప్రారంభించే క్రమంలో వచ్చిన ఇబ్బందులను, ప్రొ.రాంరెడ్డి వాటిని ధీటుగా ఎదుర్కొని ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన క్రమాన్ని వివరించారు. అలా ఏర్పడ్డ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మార్గదర్శిగా నిలిచిందన్నారు. ఉన్నత విద్యా వ్యాప్తికి డా. బి. ఆర్. అంబేద్కర్ సూచించిన మార్గం (భీం మార్గం) ఎంచుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు సేవలను మరింత విస్తృతం చేయాలని, నాణ్యమైన ఉన్నత విద్యను పేద ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు ఉపయోగపడే కోర్సుల రూపకల్పన చేయాలని, సొంత నిధులపైన దృష్టి సారించాలని అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దిడంలో దూర విద్య పితామహుడు ప్రొ. జి. రాంరెడ్డి దూర దృష్టి, ఉన్నత విద్యా వ్యాప్తికి ఆయన చిత్తశుద్ధి అనుసరణీయం అన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ డైరెక్టర్ (అకడమిక్) ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కార్యక్రమం ఆవశ్యకత & ముఖ్య అతిథి గురించి పరిచయం చేశారు. ప్రొ. జి.రామ్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్, కార్యదర్శి ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ దూరవిద్యా వ్యాప్తికి ప్రొ. జి. రామ్ రెడ్డి చేసిన సేవలను భవిష్యత్ తరాలకు అందించేలా తమ ట్రస్ట్ ద్వార స్మారకోపన్యాసాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో ప్రొ. జి. రాంరెడ్డి సతీమణి ప్రమీలా రాంరెడ్డి, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రొ. సుధారాణి, ప్రొ. మధుసూదన్ రెడ్డి, ప్రొ. ఆనంద్ పవర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. గుంటి రవి, ప్రొ. పుష్పా చక్రపాణి, డా. ఎల్వీకే రెడ్డి, డా. ఎన్. రజని, విశ్వవిద్యాలయ మాజీ అధ్యాపకులు ప్రొ.వి.వెంకయ్య, మాజీ రిజిస్ట్రార్, ప్రొ.సి.వెంకటయ్య, ప్రొ. ఎస్. వి. రాజశేఖర్ రెడ్డి, ప్రొ సుబ్బారావు, డా. సంతోష్ రెడ్డి, ప్రొ. కిష్టయ్య, ప్రొ. కిషన్ రావు, డా. మల్లారెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు, ట్రస్ట్ సభ్యులు, పాల్గొన్నారు. అనంతరం విశ్వవిద్యాలం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా రూపొందించిన స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను ఆవిష్కరించారు. తెలుగు మీడియం పుస్తకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.