క్రైస్తవులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
Hyderabad : క్రైస్తవ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రానున్న క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈనెల 21లేదా 22 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. .అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చే క్రిస్మస్ కి ముందే ఉప్పల్ బాగయత్ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేకు ను మంత్రి కొప్పుల ఈశ్వర్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనార్టీస్ కార్పొరేషన్ ఎండి క్రాంతి వెస్లీ, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, క్రిస్టియన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఏకే ఖాన్, మైనారిటీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ లుక్, క్రిస్టియన్ కమ్యూనిటీ నేతలు రాయడన్ రోస్, మోహన్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.