సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్ : సిపిఐ వందేళ్ల చరిత్రను చాటిచెప్పడంతో పాటు ప్రజాసమస్యలపై సామాజిక స్పృహ, చైతన్యం కలిగించే కళారూపాలను రూపొందించాలని పలువురు సిపిఐ నేతలు అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కళారూపాలు ఉండాలని, సిపిఐ వందేళ్ల చరిత్రను కళాకారుల ఆటలు, పాటలలో ప్రతిబింబించాలన్నారు. అరసం, తెలంగాణ ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి కవులు, కళాకారుల వర్క్ షాప్ శనివారం హైదరాబాద్ మఖ్ధూంభవన్ రాజ్ బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైంది.
వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి పాల్గొన్నారు. కూనంనేని సాంబశివరావు ప్రారంభిస్తూ అసాధారణమైన సిపిఐ వందేళ్ల చరిత్రలోని ఆటుపోట్లు, ఒడుదుడుకులను, విజయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. మరోవైపు ప్రజల సమస్యలు, బాధలు, ఆవేదనలను కళాకారులు రచయితలు కళారూపాలుగా మలచడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సినీ తదితర రంగాలలో ప్రముఖులు ప్రజానాట్యమండలి, అరసంలో అక్షరాలు దిదినవారేనని గుర్తు చేశారు.
Also Read-
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ప్రజా చైతన్యానికి కళలే ఊపిరి అని, కళారూపాలలో అనునిత్యం నూతనత్వం ఉండాలని సూచించారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ దేశంలో, సమాజంలో మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులును ఆకలింపు చేసుకుని కళారూపాలను రూపొందించాలన్నారు. డ్రగ్స్, గంజాయ్, మద్యం అంశాలతో పాటు సామాజిక రుగ్మతల నిర్మూళనకు కళాకారులు, రచయితలు తమ వంతు కృషి చేయాలన్నారు. ఒగ్గు కధలు, గేయాలు, నాటికలకు ఇంకా ప్రజలలో ఆదరణ ఉందని, వాటి ద్వారా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో అరసం అధ్యక్షులు పల్లేరు వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహా తదిలరుతు ప్రసంగించారు.
