రూ.1000 కోట్లు చేతులు మారాయి
రూ. 30వేల కోట్లు ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను రూ.7380 కోట్లకే కట్టబెట్టారు
ఈ అంశంపై అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ను లీజుకు ఇవ్వడం వెనుక దేశంలోనే అతిపెద్ద స్కాం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. లీజు వ్యవహారంలో రూ.1000 కోట్లు చేతులు మారాయని రేవంత్ ఆరోపించారు.
ఏటా కనీసం 10 శాతం పెరుగుతుందని అంచనా వేసిన కనీసం 30వేల కోట్లు ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను రూ.7380 కొట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారు. మొదట్లో లీజు ద్వారా 10 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తర్వాత 8-9 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు రూ.7380 కోట్లు వచ్చాయి. ఈ వ్యవహారంలో దాగి ఉన్న మతలబు ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన మొత్తం వ్యవహారం సోమేశ్ కుమార్ కనుసన్నుల్లో జరిగింది. అరవింద్ కుమార్ సంతకం పెట్టారు. ప్రభుత్వం దిగిపోయే ఆరు నెలల ముందు తీసుకున్నా ఏ నిర్ణయలను అయినా వచ్చే ప్రభుత్వం సమీక్షిస్తుంది. కేటీఆర్, సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ వ్యవహారంలో దోపీడి పాల్పడుతున్నారు.
ఇది కూడా చదవండి :
ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. మేం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారణ జరిపిస్తామన్నారు. ఈ అంశంలో యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా అన్నారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిని కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2018 నుంచి ఓఆర్ఆర్ టోల్ ను ఏయే సంస్థలు వసూలు చేశాయో, వాటికి టెండర్ రూపంలో లేదా నామినేషన్ రూపంలో కట్టబెట్టారో అనే విషయాన్ని స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
గత నాలుగు సంవత్సరాల నుంచి ఓఆర్ఆర్ టోల్ ను ఈగల్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. ఓఆర్ఆర్ రోజుకు 2 కోట్ల టోల్ వసూలు అవుతుంది. టెండర్ అవసరం లేకుండానే ఏడాదికి ఏడాది పొడిగించుకుంటూ కేటీఆర్ ఇందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ ను ఆదాయ వనరుగా కేటీఆర్ మిత్రబృందం ఉపయోగించుకుంది. ఇందుకు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, జయేష్ రంజన్ సహకరించారు.
ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునేందుకు కేటీర్ కుటుంబం ఆలోచించింది అని రేవంత్ అన్నారు. తమ కుటుంబానికి లాభం ఉండదని గ్రహించి టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (TOT) విధానంలో 30 సంవత్సరాలు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అని ఆయన ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ ప్రయివేటుకు తాకట్టు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ ను ప్రయివేటుకు అమ్మేశారు అని రేవంత్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు కూడా స్పందించాలి.
2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ను నిర్మించింది. ఇందుకోసం రూ. 6696 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని రేవంత్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ నిర్మించింది. తెలంగాణకు పెట్టుబడులు పెడుతున్నారంటే… విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ ప్రామాణికం అని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ కు వచ్చే ప్రతి వాహనం ఓఆర్ఆర్ ను టచ్ చేయాల్సిందే. ఓఆర్ఆర్ ను లీజుకు ఇవ్వాలన్న నిర్ణయంతో ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ను వినియోగించుకోలనేని పరిస్థితులు దాపురించాయని రేవంత్ అవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే టోల్ ఛార్జీలు పెంచుకునే వెసులుబాటుకు కూడా టోల్ సంస్థకు కట్టబెట్టారని రేవంత్ అన్నారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. కానీ ఉన్నవాటిని ఆమ్మేసి దాన్ని పెట్టుబడిగా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారానికి దిగుతోంది అని ఆయన ప్రభుత్వ తీరును విమర్శించారు.
టెండర్ విధానాలపై ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ సహా విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవంగా ఇంతకు ముందు దీన్ని ఆదానికి కట్టబెట్టాలని చూశారు. ఆరోపణల నేపథ్యంలో ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారు అని ఆయన ఆరోపించారు. 2018 నుంచి ఎవరికి టోల్ వసూలు బాధ్యత ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్ ను ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏం వచ్చింది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.