- ఎన్వీ సుభాష్, స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి మనవడు & బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
హైదరాబాద్: ఎన్నికలప్పుడే కేసీఆర్ కు కులాలు, మతాలు, ఆత్మగౌరవ భవనాలు గుర్తుకొస్తాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారి మనవడు & బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్.
విభజించు, పాలించు అన్నదే కేసీఆర్ నినాదమని ఎద్దేవా చేశారు. ‘బ్రాహ్మణ సదనం’ ప్రారంభోత్సవం సందర్భంగా బ్రాహ్మణ సమాజంలోని కొందరిని మినహా… అందరిని ఎందుకు పిలవలేదని కేసీఆర్ ను నిలదీశారు ఎన్వీ సుభాష్. చివరికి స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారిని కూడా కేసీఆర్ కేవలం తన స్వార్ధ రాజకీయ అవసరాల కోసమే వాడుకున్నారు తప్ప, ఆయనపై ప్రేమ ఉండి కాదన్నారు.
‘పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల’ సమయంలో తప్ప, అంతకుముందు గానీ, ఆ తర్వాత గానీ ఆయనకు కనీసం నివాళి కూడా అర్పించలేదని ఎన్వీ సుభాష్ ఆరోపించారు. ‘బ్రాహ్మణ సదనం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పూజా కార్యక్రమాలకు, తెలంగాణలోని బ్రాహ్మణులను కాదని పక్క రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులను తీసుకురావలసిన అవసరం ఏమొచ్చిందని కేసీఆర్ ను ప్రశ్నించారు ఎన్వీ సుభాష్.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేవలం ‘బ్రాహ్మణ సదనం’ భవనాన్ని ఏదో తూతుమంత్రంగా కేసీఆర్ ప్రారంభించారు తప్ప, నిజంగా బ్రాహ్మణులపై ప్రేమతో కాదని విమర్శించారు ఎన్వీ సుభాష్. ఇప్పటివరకు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలలో… ఎన్ని హామీలను నెరవేర్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలని… ‘ధూప దీప నైవేద్యం’ కింద కనీసం 20 వేల రూపాయలను ఇవ్వాలని ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు. నిజంగా బ్రాహ్మణుల సమస్యల పరిష్కారంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే… వెంటనే వాటిని పరిష్కరించాలని, లేదంటే… బ్రాహ్మణ సమాజం కేసీఆర్ కు బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు ఎన్వీ సుభాష్.