పసుపు బోర్డు… ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని వినూత్న తీరిలో నిరసన
జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలు వేసి ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని ఫ్లెక్సీల ఏర్పాటు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసి బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అరవింద్
నిజామాబాద్ కి వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ , రామ్ మాధవ్
హైదరాబాద్ : పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించిన విషయం విధితమే. ఈ ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది.
పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా “పసుపు బోర్డు… ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు” అని పేర్కొని ఉన్న పసుపు రంగు ఫ్లెక్సీలను రైతులు కట్టారు. తమను స్థానిక ఎంపి అర్వింద్ మోసం చేశారని రైతులు భావిస్తున్నారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపరు రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్టు ఉండడం పట్ల రైతులు విస్మయం చెందుతున్నారు.
పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నరేళ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని స్పష్టం చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని అంటున్నారు.
అన్నదాతలను మోసం చేసిన ఎంపీ అర్వింద్ కు పుట్టగతులు ఉండవని రైతులు హెచ్చరిస్తున్నారు. బోర్డు కోసం గత కొంత కాలంగా నిరసనలు తెలుపుతున్న రైతులు పలుసార్లు అర్వింద్ ను అడ్డుకున్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని నిలదీశారు. ఇకపై పసుపు బోర్డు కోసం ఆందోళనలను ఉదృతం చేస్తామని, బీజేపీ నేతలు, ముఖ్యంగా అర్వింద్ ను ఎప్పటికప్పుడు దీనిపై నిలదీస్తామని రైతులు తేల్చిచెప్పారు.