అప్పుల విషయంలో కేసీఆర్ పై చేసిన ప్రచారం తప్పని రుజువైంది
అరకొర కేటాయింపులతో అభివృద్ధి, సంక్షేమం ఎలా సాధ్యమవుతుంది ?
వాస్తవిక అంచనాలతో బడ్జెట్ లేకపోవడం దారుణం
హైదరాబాద్: “కోట్స్ ఎక్కువ ఫాక్స్ తక్కువ…. ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ” అన్నట్టుగా బడ్జెట్ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. చెప్పిన విషయాలనే పదేపదే చెప్పడం తప్ప అందులో వాస్తవాలు ఏమి లేవని తెలిపారు. అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం అరకొరా నిధులు కేటాయించిందని, కొత్త పథకాలు ఏవి కేటాయించలేదని తెలిపారు. వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపొందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ….తీసుకున్న రుణాలకు గాను ఈ ప్రభుత్వం గత ఏడాది కాలంగా కట్టిన వడ్డీతో సహా తిరిగి చెల్లించిన మొత్తం కేవలం రూ. 30 వేలు మాత్రమే అని బడ్జెట్ లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయని, కానీ రూ లక్షా 40 వేల కోట్లు అప్పులు కట్టామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు.
Also Read-
కెసిఆర్ గారు రాష్ట్రాన్ని హక్కుల పాలు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దపు ప్రచారం చేసినట్లు బడ్జెట్ పుస్తకాలు నిరూపించాయని ఎండగట్టారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రం చేసిన అప్పులు మొత్తం నాలుగు లక్షల 37 వేల కోట్లు అని ప్రభుత్వమే స్వయంగా బడ్జెట్లో పేర్కొందని, మరి కెసిఆర్ గారు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. ఇప్పటివరకు చేసిన అప్పుల్లో గత ఏడాదికాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అప్పు లక్షా 54 వేల కోట్లు ఉందని ఎండగట్టారు.
కాంగ్రెస్ అసమర్థతోనే రాష్ట్రంలో కరువు: ఎమ్మెల్సీ కవిత
ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్‌మెంట్ తెలియకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ చెరువులు నింపారన్నారు. ఎండిన పంటలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మండలి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మండలి ఆవరణలో కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయన్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కృష్ణా నది నుంచి 10 వేల క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు.