గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి,
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, హైదరాబాద్.
నమస్సులతో …
విషయం :- పంటరుణాల మాఫీపై గౌరవ ప్రధాని మోదీజీకి మీరు వాస్తవాలను విస్మరిస్తూ లేఖ రాయడం, దేశ ప్రజలందరినీ మోసం చేయడం కాదా… మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మేలు చేసేందుకు మీరు గౌరవ ప్రధానికి అబద్దాలతో రాసిన లేఖపై మీతో బహిరంగ చర్చకు నేను సిద్దం … మీరు సిద్దమైతే తేదీ, వేదిక ఖరారు చేయాలని డిమాండ్ చేస్తూ …
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ …
రైతులకు పంట రుణాల మాఫీ అంశంపై ఆదివారం (2024 అక్టోబరు 06) నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాసిన లేఖ కొన్ని వాస్తవాలను కప్పిపుచ్చేలా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పిసిసి చీఫ్ గా మీరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2023 డిసెంబర్ 09న రైతులందరికీ రూ.2 లక్షల వరకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది వాస్తవం కాదా? కానీ, ఆరు నెలలైనా రుణమాఫీ హామీ అమలు అడుగు ముందుకు పడకపోవడంతో, రైతుల్లో కాంగ్రెసు పట్ల నెలకొన్నఆగ్రహాన్ని గ్రహించిన మీరు … 2024 మే నెలలో జరిగిన లోకసభ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపేనులో భాగంగా 2024 ఆగస్టు 15 కల్లా రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ కనిపించిన దేవుళ్లందరిపైనా ఒట్టుపెట్టి మరీ హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? తీరా ఆగస్టు 15 కల్లా మీరు పంట రుణాలను సగం మంది రైతులకు మాత్రమే మాఫీ చేసి, మగిలిని సగం మందికి మాఫీ చేయని మాట వాస్తవం కాదా? ఇదే విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు శనివారం (2024 అక్టోబరు 05) నాడు మహారాష్ట్రలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రుణమాఫీ కోసం రైతులింకా ఎదురు చూస్తున్నారంటూ గౌరవ ప్రధాని మోదీజీ వాస్తవాలను వివరించారు.
గౌరవ ప్రధాని మోదీజీ వ్యాఖ్యలు మహారాష్ట్ర రైతులను ప్రభావితం చేస్తాయని, ఆ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు విజయావకాశాలను దెబ్బతీస్తాయని మీ పార్టీ అధిష్టానం గ్రహించి మిమ్మల్ని ఆదేశిస్తే, మీరు గౌరవ ప్రధాని మోదీజీకి లేఖ పేరుతో కొన్ని వాస్తవాలను విస్మరిస్తూ, కొన్ని అబద్దాలను రంగరిస్తూ తెలంగాణ సర్కారు రైతులకు రుణమాఫీ చేసినట్టుగా చెప్పడం దేశ ప్రజలందరినీ తప్పుదోవపట్టించడం, మోసం చేయడం కాదా? సిఎంగా మీరు గౌరవ ప్రధానికి రాసిన లేఖలో రెండు వాస్తవాలను (1. రాష్ట్ర బడ్జెటులో రుణమాఫీ కోసం కేటాయించిన రూ.26 వేల కోట్లు 2. రుణమాఫీ కోసం క్యాబినెటు నిర్ధారించిన రూ.31 వేల కోట్లు) మాత్రమే వెల్లడించారు. కానీ, వీటితో ముడిపడి మీరు రైతులను మభ్యపెట్టి, మోసం చేసిన అంశాలను, మిగిలిన వాస్తవాలను విస్మరించి గౌరవ ప్రధానికి లేఖ రాయడం ద్వారా దేశ ప్రజలందరినీ తప్పుద్రోవ పట్టించడం, ముమ్మాటికీ మోసపూరితమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అంశంలో రైతులను మభ్యపెట్టి మోసం చేసిన తీరును ప్రశ్నిస్తూ మీకు రాసిన ఈ లేఖ కాపీని కూడా గౌరవ ప్రధాని మోదీజికి పంపుతున్నాను.
Also Read-
ముఖ్యమంత్రి గారూ … రైతులకు పంట రుణాల మాఫీ అంశంపై బహిరంగ చర్చకు సిద్దమేనా
రైతులకు పంటరుణాల మాఫీ అంశంపై టిపిసిసి చీఫ్ గా, ముఖ్యమంత్రిగా మీరు వివిధ సంధర్భాల్లో మాట్లాడిన మాటలకు, ఇచ్చిన హామీలకు, తీరా రుణమాఫీ జరుగుతున్న విధానానికి ఏమైనా పొంతన ఉందా? రుణమాఫీ అంశంలో మీరు రైతులను మభ్యపెడుతూ మోసం చేస్తున్న తీరుకు సంబంధించి నేను సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా …
- కాంగ్రెసు అధికారంలోకి వస్తే రైతులకు రూ.రెండులక్షల్లోపున్న పంటరుణాలను ఒకే దఫాలో అమలు చేస్తామని టిపిసిసి చీఫ్ గా మీరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వలేదా…. మరి, సగం మంది రైతులకు రుణాలు మాఫీకాని మాట వాస్తవం కాదా?
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023 డిసెంబరు 09వ తేదీన అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చారు కదా … మరి, పది నెలలైనా ఆ హామీ పూర్తిగా అమలు కాలేదు కదా?
- రూ.రెండు లక్షల్లోపున్న పంటరుణాల మాఫీకి అవసరమయ్యే నిధుల మొత్తం రూ.49,500 కోట్లు … అని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) మొదట్లోనే చెప్పింది వాస్తవం కాదా?
- ఆ తర్వాత పంట రుణ మాఫీకి రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయని 2024 మే నెల ఒకటో తేదీన గాంధీభవనులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడింది వాస్తవం కాదా?
- లోకసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా మీరు దేవుళ్లపై ప్రమాణం చేస్తూ 2024 ఆగస్టు 15 కల్లా రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నది వాస్తవం కాదా?
- దాని తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని నిర్ణయించింది వాస్తవం కాదా?
- కానీ, తీరా రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీ పధకానికి కేటాయించింది రూ.26 వేల కోట్లు మాత్రమే అన్నది వాస్తవం కాదా?
- తీరా 2024 జూలై 18 నుంచి ఆగస్టు 15 వరకు కేవలం 22 లక్షల 22 వేల మంది రైతులకు రూ.17 వేల 869 కోట్లు మాత్రమే మాఫీ చేసింది వాస్తవం కాదా? ఇది మొత్తం రుణ మాఫీ కావాల్సిన రైతుల సంఖ్యలో, అవసరమయ్యే నిధుల్లో సగం కంటే తక్కువ కాదా?
- బీఆర్ఎస్ సర్కారు 2014లోనే లక్షలోపు రుణాలున్న 35లక్షల మందికి రుణ మాఫీ కోసం రూ.16,144 కోట్లు ఇచ్చింది. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అవసరమని తేల్చింది. ఈ లెక్కన రెండు లక్షల్లోపున్న పంటరుణాలను మాఫీ చేసేందుకు ఇపుడు 2024లో రూ.49,500 కోట్లు అవసరమన్న బ్యాంకర్స్ కమిటీ నివేదికను రాష్ట్ర సర్కారు ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు పక్కన పెట్టింది వాస్తవం కాదా?
- అధికారులతో సిఎంగా మారు జరిపిన రుణమాఫీ రివ్యూ మీటింగులో రుణఖాతాలున్న రైతులు తెలంగాణలో సుమారు 70 లక్షల వరకు ఉండొచ్చని తేలని విషయం వాస్తవం కదా? ప్రభుత్వంపై ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు, కుటుంబ నిర్ధారణ చేసే రేషను కార్డు లేదనో, ఆధార్ కార్డులో తప్పు ఉందనో, ఇంకా ఏవేవో సాంకేతిక కారణాలతో లక్షలాది రైతులకు రాష్ట్ర సర్కారు రుణమాఫీ ఎగ్గొట్టింది వాస్తవం కాదా?.
- సగం మందికిపైగా రైతులకు రుణమాఫీ జరగలేదని, ఇంకా రుణమాఫీ జరగాల్సిన రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారని, వారంతా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారని ఇంటలిజెన్సు రిపోర్టు ఇవ్వడం వల్లే, రుణమాఫీపై వరంగల్ లో కాంగ్రెస్ నిర్వహించతలపెట్టిన కృతజ్ఞతా సభ పూర్తిగా రద్దయింది వాస్తవం కాదా?
- ఇంకా రుణాలు మాఫీ కావాల్సిన వారి వివరాలు సేకరించేందుకు ఆగస్టు 16 నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ … రూపొందించిన యాపులు … రైతు కుటుంబ సర్వేలు ఏమయ్యాయి. 50 రోజులైనా ఇంకా రుణ మాఫీ కావాల్సిన వారి వివరాలను అధికారులు సేకరించలేకపోవడం సర్కారు వైఫల్యం కాదా?
- రుణమాఫీ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి గత 50 రోజులుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో … దీనిపై బిజెపి ప్రజాప్రతినిధులమంతా సెప్టెంబరు 31 నుంచి అక్టోబరు 01 వ తేదీ వరకు 24 గంటలపాటు నిరాహార దీక్ష చేసినా రాష్ట్ర సర్కారు స్పందించి శ్వేత పత్రం విడుదల చేయకపోవడం బాధ్యతా రాహిత్యం కాదా? రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ చెప్పిందేంటి, చేసిందేంటి అనే వాస్తవాలపై మీరు బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ చేస్తున్నాను. నాతో బహిరంగ చర్చకు మీరు సిద్దమైతే, అందుకు తగిన తేదీని, వేదికను మీరే సిద్దం చేయండి. బహిరంగ చర్చ వద్దనుకుంటే, రుణమాఫీతో పాటు కాంగ్రెస్ రైతులకిచ్చిన ఇతర హామీలపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశ పరచాలని డిమాండ్ చేస్తున్నాను.
ధన్యవాదాలతో … భవదీయ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపి శాసన సభాపక్ష నేత, తెలంగాణ