• 12 కోట్ల పనిదినాలు కల్పించండి
• 10.50 కోట్ల పనిదినాలు పూర్తి చేశాం
• కేంద్రానికి విజ్ణప్తి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
• కేంద్రం ఇచ్చే మెటీరియల్ కాంపోనెంట్ నిధుల విడుదలకు కృషి చేయాలి
• పంచాయతీరాజ్ రోడ్లు, ఉపాధి – హామీ పనులపై మంత్రి సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు అవసరం అవుతున్నాయని, ఈ పనిదినాలను కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేంద్రానికి విజ్ణప్తి చేశారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల పనుల పురోగతిపై, ఉపాధి హామీ పథకంలో కల్పించే పనిదినాలు, మెటీరియల్ కాంపోనెంట్ పనులు – నిధులపై నేడు హైదరాబాద్, మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి చాంబర్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, ఉపాధి, హామీ పథకం స్పెషల్ కమిషనర్ ప్రసాద్ లతో సమీక్ష చేశారు.
పంచాయతీరాజ్ కింద మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు వేగవంతం చేసేందుకు ఎక్కువ మందిని పనిలో పెట్టుకోవాలన్నారు.
పిఆర్ రోడ్ల మరమ్మత్తు పనులకు సంబంధించి టెండర్లు పిలవని జిల్లాల్లో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అదేవిధంగా మొదటిసారి టెండర్ కాల్ ఫర్ చేసిన చోట్ల స్పందన లేకపోతే వెంటనే రెండోసారి టెండర్లను పిలవాలన్నారు.
ఉపాధి, హామీ పథకం కింద ఈ సంవత్సరంలో 10.5 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, వీటిని 12 కోట్ల పనిదినాలకు పెంచాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి రావల్సిన నిధులు దాదాపు 800 కోట్ల రూపాయలు కేంద్రం ఇంకా విడుదల చేయలేదని, ముఖ్య కార్యదర్శి మరియు అధికారులు ఢిల్లీకి వెళ్లి ఈ నిధుల విడుదల కోసం కృషి చేయాలన్నారు.