హైదరాబాద్ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన గోడౌన్ ను గురువారం నాడు గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసిఆర్ గారు రైతులకు రైతు బంధు, రైతు బీమా, కరెంట్, నీళ్లు ఇచ్చి పంట దిగుబడి పెంచేందుకు అన్ని విధాల సహకారం అందించారని అన్నారు. పండిన ధాన్యాన్ని కూడా కొంటున్నారని అన్నారు. ఎంతో ముందు చూపుతో పండిన ధాన్యం కూడా నిల్వ చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించారని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇంతకు ముందు ధాన్యం నిల్వకు గోదాములు లేవని, కేసిఆర్ ఒక్క బాల్కొండ లోనే 40వేల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించారని అన్నారు. వీటితో ఈ ప్రాంతంలో పండిన మొత్తం ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు అన్నారు.
ఈ రెండు రోజుల్లో 16 కోట్ల వ్యయంతో సికింద్రపూర్, లక్కోర గ్రామాల్లో నిర్మించిన గోదాములు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం కలిగినవి ప్రారంభించుకున్నామని తెలిపారు. బాల్కొండ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. గోడౌన్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన లక్కోర గ్రామ రైతులు,సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఏమైనా ఉపాధి అవకాశాలు ఉంటే మొదటగా అవి లక్కొర గ్రామ ప్రజలకే అని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ రావడం సంతోషంగా ఉందన్నారు.
గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మాట్లాడుతూ…
బాల్కొండ బంగారు కొండ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కి అత్యంత సన్నహితులైన మంత్రి నియోజకవర్గ ప్రజలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారన్నారు. ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు లేరని అన్నారు. బాల్కొండ ను ఇంత గొప్పగా అభివృద్ది చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు నిలబెట్టుకున్నారని అన్నారు.
స్వర్గీయ సురేందర్ రెడ్డి చూపిన బాటలో నడుస్తూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న గొప్ప మనసున్న నాయకుడు అని కొనియాడారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మంత్రికి దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.