మహిళల అభ్యున్నతికి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట
అనుక్షణం మహిళల బాగోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్
కొత్తగా దేవుని క్యాలెండర్లతో వస్తున్న వారి పట్ల జాగ్రత్త
కరోనా సంక్షోభంలో ఆశా, అంగన్వాడిల సేవలు మరువలేనివి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నియోజకవర్గ స్థాయిలో మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బాల్కొండ నియోజకవర్గంకు సంబంధించి వేల్పూర్ మండలం లక్కోరాలోని ఏ.ఎన్.జి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు బోనాలు, మంగళహారతులతో మంత్రి, కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. మహిళల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి, వాటి ద్వారా చేకూరుతున్న ప్రయోజనాల గురించి లబ్ధిదారులు, స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రభుత్వం మహిళల శ్రేయస్సును కాంక్షిస్తూ అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుక్షణం మహిళల బాగోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మహిళల కోసమే ప్రత్యేకంగా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వింతంతువులకు పెన్షన్లు అందిస్తున్నారని, వృద్ధాప్య పెన్షన్ల పంపిణీలోనూ మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. మానవీయ కోణంతో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అభివృద్ది చెందాలనే తలంపుతో మహిళలను కేంద్రంగా చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలను వారికి వర్తింపజేస్తున్నారని తెలిపారు. ఓట్ల కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పేద కుటుంబాల గర్భిణీలకు కూడా ఆర్ధిక స్థోమత కలిగిన వారి తరహాలోనే పోషక విలువలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశ్యంతో కేసీఆర్ కిట్ పథకం అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన గర్భిణీలకు ఉచిత కాన్పు చేయడమే కాకుండా, ఆడబిడ్డ పుడితే రూ. 13,000 వేలు, మగబిడ్డ పుడితే రూ.12,000 అందిస్తున్నారని, పోషకాహారం ఇతర వస్తువులతో కూడిన కిట్ ను పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మెరుగుపర్చి, ఇతోధికంగా తోడ్పాటును అందిస్తుండడంతో ప్రభుత్వాస్పత్రుల్లో 2014నాటికి 18శాతానికి పరిమితమైన కాన్పులు, నేడు 61శాతానికి పెరిగాయని, సిజేరియన్లు గణనీయంగా తగ్గాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు. మాతా శిశు మరణాల రేటు తగ్గుదలలోనూ తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా మారిందని అన్నారు. గర్భిణీల్లో రక్త హీనతను నివారించేందుకు తాజాగా న్యూట్రీషన్ కిట్ అందిస్తుందని తెలిపారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు అమలు జరగడం లేదన్నారు. మహిళలకు పోలీస్ శాఖలో 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, సఖీ కేంద్రాలను నెలకొల్పి బాధితులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు.
స్వయం సహాయక సంఘాలకు విరివిగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు బాల్కొండ నియోజకవర్గంలో మహిళా సంఘాల సభ్యులు 28000 ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 60,000లకు పెరిగిందని వివరించారు. వీరికి బ్యాంకు లింకేజీ కింద 2014కు ముందువరకు కేవలం రూ. 366 కోట్ల రుణాలు ఇవ్వగా, స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలోనే నాలుగు రెట్లు ఎక్కువగా రూ. 1213 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని తెలిపారు. స్ట్రీనిధి పథకం కింద అప్పట్లో రూ. 28 కోట్లు మాత్రమే ఇవ్వగా, తమ ప్రభుత్వం పది రెట్లు అదనంగా రూ. 259 కోట్లు అందించిందని అన్నారు. గతంలో ఏడు కోట్లతో 2780 మంది మహిళా సంఘాల సభ్యులు వ్యాపారాలు నిర్వహించగా, తెలంగాణ ఏర్పాటు అయిన అనంతరం తమ ప్రభుత్వం సమకూర్చిన రూ. 259 కోట్ల పెట్టుబడితో 21,000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధిస్తున్నారని మంత్రి హర్షం వెలిబుచ్చారు.
స్వయం సహాయక సంఘాలకు గతంలో ఐదు లక్షల వరకే రుణపరిమితి ఉండేదని, దానిని తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలకు పెంచిందని, వ్యక్తిగత రుణాలను కూడా 50 వేల నుండి 3 లక్షల వరకు పెంచడం జరిగిందని వివరించారు. 43 లక్షల రూపాయల ప్రభుత్వ పెట్టుబడితో వేల్పూర్ మండలంలో నియోజకవర్గ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పసుపు ఉత్పత్తుల ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయిస్తానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు దీని నిర్వహణతో వచ్చే లాభాలను మహిళా సమాఖ్య అందజేస్తామని అన్నారు. వేల్పూర్ లో విజయవంతంగా కొనసాగితే నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయిస్తానని మంత్రి తెలిపారు. కాగా, మహిళా సంఘ సభ్యుల కోసం ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే రెండు కోట్ల 81 లక్షలు వెచ్చిస్తూ 51 మహిళా సంఘ భవనాలను నిర్మించామన్నారు.
కరోనా సంక్షోభంలో ఆశా, అంగన్వాడిల సేవలు మరువలేనివి
కరోనా సంక్షోభ సమయంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఏ.ఎన్.ఎంలు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో ధైర్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవనందించి సమాజాన్ని బతికించుకున్నారని కొనియాడారు. ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, వివోఏలకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు అందిస్తోందన్నారు. 2014లో ఆశ వర్కర్లకు వారి పనితీరును బట్టి నెలకు 2000 రూపాయల వేతనం ఇచ్చేవారని, ప్రస్తుతం దానిని తమ ప్రభుత్వం 9750 రూపాయలకు పెంచిందన్నారు. ఆశలకు రాజస్థాన్లో 3000 , గుజరాత్ లో 6700 , కర్ణాటకలో 4000 , హర్యానాలో 4000 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు.
అదేవిధంగా ఏఎన్ఎంలకు 2014 లో రూ. 10200లకే పరిమితమైన వేతనాన్ని 27,599 పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఏఎన్ఎంలకు మహారాష్ట్రలో 17,000 , తమిళనాడులో 15000 , యూపీ, గుజరాత్లో 22,000 చొప్పున చెల్లిస్తున్నారని తెలిపారు. అంగన్వాడి టీచర్లకు తెలంగాణలో 13650 రూపాయల వేతనం ఇస్తుండగా, యూపీలో 7000 , రాజస్థాన్లో 7500 , మహారాష్ట్రలో 8325 రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. వి ఓ ఎల కు కూడా ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణాలో మూడు రెట్లు ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువు లకు అందిస్తున్న ఆసరా పెన్షన్లు కూడా తెలంగాణలో మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, సరైన నిర్ణయం తీసుకొని మరింత సంక్షేమ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జనాభాలో సగభాగం ఉన్న మహిళలు, సమాజ, దేశాభివృద్దిలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళా భద్రతా, వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఆర్ధిక ప్రగతి దిశగా మహిళలను ముందడుగు వేస్తున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 30 వేల మహిళా స్వయం సహాయక సంఘాలలో మూడు లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారని తెలిపారు. వీరంతా 12 వేల కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకుని ఆర్ధిక లావాదేవీలతో ప్రగతి దిశగా ముందుకు సాగుతున్నారని అన్నారు.
షాదిముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల ద్వారా జిల్లాలో 64 వేల మందికి 650 కోట్ల రూపాయలను అందించడం జరిగిందన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ప్రాక్త్యేకంగా సఖి, భరోసా సెంటర్ లను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులను ఈ సందర్భంగా సత్కరించారు. మహిళలకు మంత్రి చీరలను పంపిణీ చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. మండల సమాఖ్య వారు మంత్రికి తాము తయారు చేసిన పిండి వంటలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.