హైదరాబాద్: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసే ఇన్ స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైన 50 మంది బీసీ గురుకుల విద్యార్థులను బీసీ సంక్షేమ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అభినందించారు. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న పది నుంచి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 50 మంది బీసీ గురుకుల విద్యారులు ఎంపిక కావడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
విద్యార్థులు తమ తెలివితేటలతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, వారి లోని ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ వారిని ఇన్ స్పైర్ లాంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాని ఆయన సూచించారు. ఇన్ స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైనా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లో పదివేల రూపాయలు జమ అవుతాయని, ఈ డబ్బుతో వారి ఆలోచన మేరకు ప్రాజెక్ట్ ను చేసి ప్రదర్శనలో ఉంచాలని ఆయన సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులను స్కూల్ స్థాయి నుంచే భాగస్వామ్యులను చేసేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా నిలిచిన ప్రాజెక్ట్ ను జాతీయస్థాయిలో ప్రదర్శిస్తారని, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభకు సృజనాత్మకత జోడించి ప్రాజెక్ట్స్ చేయాలని ఆయన సూచించారు. సామాజిక ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ చేయడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్ధి దశ నుంచి సరికొత్త ఆవిష్కరణలతో విద్యార్థులు రాణించినప్పుడే భవిష్యత్ లో వారు గొప్పగొప్ప సైంటిస్ట్ లుగా ఎదుగుతారన్నారు.
Also Read-
విద్యార్థులకు కావల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విజ్ఞానం పెంచుకోవడం, సృజనాత్మకత పెంపొందించుకోవడం ద్వారా తమ భవిష్యత్ ను గొప్పగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు.ఇన్ స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైన 50 మంది విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎంజెపి సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు. భవిష్యత్ లో ఇలాంటివి మరెన్నో సాధించాలని సూచించారు.