వరంగల్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి స్వస్థలం పర్వత గిరిలో వేణుగోపాల స్వామి ఆలయం, పర్వతాల గుడి శివాలయం అభివృద్ధి పనులను పరిశీలన చేసి, అధికారులతో సమీక్ష చేశారు.
పర్వతగిరిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, గుడిని అద్భుతంగా భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వేణుగోపాలస్వామి ఆలయానికి గతంలో స్వామివారి ఊరేగింపు కోసం రథం ఉండేదని… కాలక్రమేనా శిథిలం కావడంతో నూతన రథాన్ని తయారు చేయించాలని సూచించారు. స్థల సేకరణ చేసి కళ్యాణ మంటపం నిర్మించాలని చెప్పారు.
భక్తులు దర్శనం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అన్ని వసతులు కల్పించాలన్నారు. పర్వతగిరిలోని పర్వతాల గుడి శివాలయాన్ని సందర్శించి, పనుల పురోగతిని పర్యవేక్షించారు. దాదాపు 850 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ శివాలయం కోసం ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి గుట్టమీద ఆలయం నిర్మించారు. దేవాదాయ శాఖ నుంచి 70 లక్షల రూపాయలు మంజూరు కావడంతో ఆ నిధులతో భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
2023 జనవరి 26వ తేదీన పర్వతాల గుడి శివాలయం ప్రారంభోత్సవం చేస్తామని… అప్పటిలోగా గుట్ట మీద ఆలయానికి కావలసిన విద్యుత్తు, మంచినీటి వసతి, రవాణా, భక్తుల సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దాదాపు 850 సంవత్సరాల చరిత్ర ఉన్న శివాలయం విశిష్టత వివరించి ప్రారంభోత్సవ మహా కార్యక్రమానికి ఆహ్వానించేందుకు 35 మంది స్వచ్ఛంద కార్యకర్తలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు .
శివాలయం చుట్టుపక్కల ఉన్న దాదాపు 200 గ్రామాల్లో ఈ కార్యకర్తలు పర్యటించి 2023 జనవరి 26వ తేదీన జరిగే ప్రారంభోత్సవ పూజకు ప్రజలను ఆహ్వానిస్తారని తెలిపారు. పర్వతాల గుడి శివాలయానికి ధర్మకర్తగా కల్లెడ రామ్మోహన్ రావు గారు, ఛైర్మన్ గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వ్యవహరిస్తున్నారు. శివాలయానికి వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు విశాలమైన స్థలంలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. విద్యుత్తు, మంచినీటి వసతి ఎలాంటి కొరత లేకుండా కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇన్చార్జి డిపిఓ సంపత్ రావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఏసిపి నరేష్ కుమార్, ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.