हैदराबाद : महाशिवरात्रि के मौके पर तेलंगाना भर के प्रसिद्ध शैवक्षेत्र सज गये हैं। मंदिरों में शुक्रवार से श्रद्धालुओं की भीड़ उमड़ रही है। महाशिवरात्रि उत्सव तीन दिनों तक जारी रहेगा। मंदिर समितियों और अधिकारियों ने सभी व्यवस्थाएं की हैं ताकि मंदिरों में आने वाले भक्तों को किसी भी तरह की असुविधा का सामना न करना पड़े। मंदिरों को रंग-बिरंगे बिजली के दीयों से सजाया गया है।
तेलंगाना में महाशिवरात्रि वेमुलावाड़ा राजन्ना मंदिर, तेलंगाना में एक प्रसिद्ध शिव मंदिर, एडुपायला वनदुर्गभवनिमाता मंदिर, मेडचल जिले में कीसरगुट्टा, श्रीशैलम, जोगुलम्बा गडवाला जिले में जोगुलम्बा मंदिर, जयशंकर भूपलपल्ली जिले में कालेश्वर-मुक्तिस्वर स्वामी, कोटगुल्लू, मुलुगु जिले में रामप्पा, महबूबाबाद जिले में कुरवी वीरभद्र स्वामी, हनुमकोंड के हजार स्तंभ रुद्रेश्वरालयम, मेट्टुगुट्टा रामलिंगेश्वर स्वामी, जनगांव जिले में पलकुर्ती सोमेश्वर स्वामी, वरंगल में स्वयंभू शंभूलिंगेश्वर स्वामी और काशीबुग्गा में काशीविश्वेश्वर मंदिरों को बिजली की रोशनी से जगमगा रहे हैं।
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. భక్తులు శుక్రవారం నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనుండటంతో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట, శ్రీశైలం, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్నాయి.
నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలంలోని వాడపల్లి శైవాలయం, నల్లగొండలోని పానగల్లు చాయా సోమేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే శివనామస్మరణతో మార్మోగుతున్నది. శివాలయాల్లో భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, చోరీలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వెల్లివిరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.
వేములవాడకు భక్తజన ప్రవాహం
వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మొదటి రోజు శుక్రవారం శివనామస్మరణతో పట్టణం మార్మోగింది. స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను రద్దు చేశారు. శని, ఆదివారాల్లో భక్తులందరికీ లఘు దర్శనమే కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు.
శుక్రవారం వేములవాడ శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామి గుడి చెరువు వేదిక వద్ద దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శివార్చన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి శనివారం శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
నేటి నుంచి హెలికాప్టర్ సేవలు
మహాశివరాత్రి జాతర కోసం హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచారు. నేరుగా రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలో దిగేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజులు పాటు జరిగేవేడుకలకు వచ్చే భక్తులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది.
ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో రాత్రి సమయంలో ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ధర్మగుండంలో కొత్త నీటిని నింపడమే కాకుండా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన రహదారుల వెంబడి స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలం వైపు నుంచి ధర్మగుండానికి కొత్తగా గేట్లు పెట్టడమే కాకుండా.. జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను వివిధ డిపోల నుంచి నడుపుతున్నారు.
భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ నుంచి కట్ట కింద బస్టాప్ వరకు 14 ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులు జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. పార్కింగ్ స్థలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాలకు నల్లాలు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా మొబైల్ మూత్రశాలలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు శుద్ధజలం, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో సుందరీకరించారు.
వేములవాడ గుడిచెరువులో రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు శివార్చన కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో మంత్రితో పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేనీ రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి.శ్రీనివాస్ రావు, సీపీఓ పిబి శ్రీనివాస చారి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవిల పాల్గొన్నారు. మొదటి రోజు నిర్వహించిన శివార్చన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వందలాది కళాకారులు ప్రదర్శించిన ఒగ్గుడోలు ప్రదర్శనలు, శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనలు, జానపద కళాప్రదర్శనలు, కోలాటాలు భక్తులందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో వేములవాడలో మహాశివరాత్రి జాతరను కన్నుల పండువగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక రూ.20-30 కోట్లతో వేములవాడ నియోజకవర్గంలో చిన్న దేవాలయాల అభివృద్ధి జరిగిందన్నారు. వేములవాడ ప్రాంతం కళలకు పుట్టినిల్లు అని, సినారె పుట్టిన గడ్డని పేర్కొన్నారు. వేములవాడ వెన్నెల వాడగా ప్రసిద్ధంకాబడ్డ ఈ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు గొప్పగా జరగడం ఆనందంగా ఉందన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ కు వేములవాడ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసిఆర్ మార్గదర్శనంలోనే గుడిచెరువును ముందుకు జరిపి 35 ఎకరాల స్థలాన్ని పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలకు అనువుగా మార్చారని చెప్పారు. భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో చేపట్టిన శివార్చన కార్యక్రమం చాలా గొప్పగా ఉందని.. కళా క్షేత్రాన్ని పర్మనెంట్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆలోచన చేస్తున్నారని.. దానిని సాకారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. (ఏజెన్సీలు)