కెవిఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల: నవయుగ చక్రవర్తి దళిత కవి గుర్రం జాషువా 129వ జయంతి ఘనంగా నిర్వహణ
కర్నూలు (ఆంధ్ర ప్రదేశ్) : కెవిఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రముఖ దళిత కవి గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి. దేవికా రాణి గారు అధ్యక్షత వహించారు. తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షురాలు డాక్టర్ జి. ప్రమీల ఈ వేడుకలను సమన్వయ కర్తగా వ్యవహరించారు.
వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి. దేవికా రాణి గారు మాట్లాడుతూ గుర్రం జాషువా తెలుగు భాషకు అమూల్యమైన కవిగా, సమాజంలోని మార్పులకు అద్దం పట్టిన సాహితీవేత్తగా పేర్కొన్నారు. ఆయన తన రచనల ద్వారా సమాజంలో మార్పుకు ప్రేరణగా నిలిచారని వివరించారు. నవయుగ కవి చక్రవర్తిగా ప్రసిద్ధి పొందిన జాషువా, కుల వివక్షతను ఎదుర్కొంటూ సాహిత్యంలో సమసమాజ స్థాపనకు కృషి చేశారని అన్నారు.
తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షురాలు డాక్టర్ జి. ప్రమీల గారు మాట్లాడుతూ జాషువా దళిత వర్గాలకు తాను అనుభవించిన కుల వివక్షను తన రచనల ద్వారా ప్రశ్నించారని చెప్పారు. సమాజంలో మార్పులకు దారితీసే రచనలను అందించిన జాషువా, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన సాహితీవేత్తగా కొనియాడారు. తను చేసిన సామాజిక స్పృహ గురించి తెలియజేశారు.
Also Read-
తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ దండబోయిన పార్వతి దేవి గారు మాట్లాడుతూ గుర్రం జాషువా తొలి దళిత కవిగా సాహితీ లోకంలో తన సుదీర్ఘ కవితా సేవలను నిలబెట్టారని, ఆయన రచనలు సమాజంలో పాతుకుపోయిన కులవ్యవస్థను ప్రశ్నించడానికి ఉపయోగపడ్డాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి జయసుశీల గారు పాల్గొని, జాషువా సమాజంలోని కుల వివక్షత రూపుమాపడానికి చేసిన కృషిని కొనియాడారు. ఆయన దళిత సాహిత్యానికి చేసిన సేవలు చారిత్రకంగా ముఖ్యమని చెప్పారు. ఈ వేడుకలకు ఇతర అధ్యాపకులు, విద్యార్థినిలు హాజరై గుర్రం జాషువా సాహిత్య సేవలను ఘనంగా స్మరించుకున్నారు.