బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు… హౌస్ అరెస్ట్ ల పై కేటీఆర్ ఆగ్రహం

మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు

బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు?

దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు…సిగ్గు

సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది

అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరిక

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, గృహ నిర్బంధాలు చేయటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్ నేతలను అర్థరాత్రి వరకు అక్రమ అరెస్ట్ లు చేసి.. ఇవ్వాళ రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా ? అంటూ మండిపడ్డారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవటానికి కూడా అనుమతి లేదా? అని నిలదీశారు.

ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల్ని గృహనిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని… బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు.

అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రశ్నిస్తే చాలు ప్రజాప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు.

తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని… సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ది చెబుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతల్ని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X