బీసీ వర్గాలకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకున్న బిజెపి
దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా బిజెపి రాజ్యాంగం నడుస్తుందా ?
గవర్నర్ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం
హైదరాబాద్: గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమది బీసీ వ్యతిరేక పార్టీ అని భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించుకుందని తేల్చి చెప్పారు.
మంగళవారం నాడు శాసనమండలిలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పంపించిన పేర్లను గవర్నర్ తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా అన్న అనుమానం కలిగే విధంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ప్రతీ రాజ్యాంగబద్ధమైన సంస్థకు ఉండే హక్కులు, పరిధులు వాటికి ఉంటాయనీ, అన్నింటినీ గమనిస్తూ ప్రజలను ఒక్కతాటిపై ముందుకు నడిపించాలన్న దాన్ని పక్కన పెట్టి గవర్నర్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ ఆమోదించే సంప్రదాయం ఉందని, దాన్ని విస్మరించి బీసీ వర్గాలకు నష్టం చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తులు బలహీన వర్గాలకు చెందిన వారిని, ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశాలు రాని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన రెండు పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో భారతీయ జనతా పార్టీ మరోసారి బీసీ వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని స్పష్టం చేశారు. బిజెపి వ్యవహార శైలిని గమనించాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగపరమైన సంప్రదాయాలను పాటించుకుంటూ వెళ్తే అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసే ఆస్కారం కలుగుతుందని, తద్వారా ప్రజలకు స్థిరత్వాన్ని అందించగలుగుతామని అన్నారు. నిరంతరం నెగిటివ్ చర్చను రేకెత్తించడం తప్ప దీనివల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. బీసీ వర్గాలకు బిజెపి ఏ రకంగా అన్యాయం చేస్తుందో మరోసారి గవర్నర్ నిరూపించారని విమర్శించారు. బీసీ వర్గాలను పైకి తీసుకురావడానికి తమ పార్టీ చర్యలు తీసుకుంటుంటే, బిజెపి పార్టీ అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని ఆక్షేపించారు.
చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవితతో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ వెంకటేష్ నేత , బీసి కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
———————————
వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా
అసెంబ్లీ హాల్లో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన శాసన మండలి డిప్యూటీ ఛైర్మెన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, ఎంపి వెంకటేష్ నేత గారు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త గారు, లెజిస్లేచర్ సెక్రటరీ డా. నరసింహచార్యులు గారు, ఎల్ పి సెక్రటరీ రమేష్ రెడ్డిగారు, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ గారు,ప్రముఖులు…
ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండా ప్రకాష్ గారు మాట్లాడుతూ….
తెలంగాణ రైతాంగ పోరాటం లో వీర వనిత గా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నం. జమీందారీ, జాగిర్ధారి వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులలో చాకలి ఐలమ్మ అగ్రగామిగా నిలిచింది. ఫ్యూడలిజానికి వ్యతిరేఖంగా పోరాడిన వ్యక్తి ఐలమ్మ. ఆమె స్ఫూర్తి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఐలమ్మ స్ఫూర్తి బయటకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం పట్ల స్థితిగతుల పట్ల ఉన్న సమగ్ర దృష్టి వలనే ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి అనేకమంది పోరాటయోధుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.
అంతకుముందు ఐలమ్మ పేరు ఉచ్చరించడానికి కూడా గత పాలకులు ఇష్టపడలేదు. నేడు కాళోజీ నారాయణరావు, జయశంకర్ గారి పేర్ల మీద విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమం లో ఆమె పాత్ర గొప్పది ఆనాడు వీరోచిత పోరాటం చేసింది ఐలమ్మ. అందుకే తెలంగాణ వచ్చాక ఆమెను గుర్తుచేసుకుంటూ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
—————————-
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి
తెలంగాణ పోరాటయోదుల్ని ఘనంగా స్మరించుకునే ముఖ్యమంత్రి కేసీఆర్
రవీంధ్రభారతిలో వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
చిట్యాల ఐలమ్మ ఏఒక్క కులానికో పరిమితం కాదు, తెలంగాణ ఆస్థి ఐలమ్మ
తెలంగాణ పోరాటాలకు స్పూర్తి ప్రధాత వీరనారి చాకలి ఐలమ్మ
గత పాలకుల నిర్లక్ష్యంతో బిసిలు వెనుకకు నెట్టేయబడ్డారు
వందకోట్లకు ఎకరా ఉన్న ఏరియాలో 87.3 ఎకరాల్లో 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు
19 గురుకులాల నుండి 327 గురుకులాల్లో 1,68,500 మందికి ప్రపంచ స్థాయి విద్య
ఇంటి పెద్ద పనినుండి ఇంటికిరాగానే ఇంగ్లీష్ మాట్లాడే బిడ్డల్ని చూసి గర్వంగా ఉప్పొంగుతున్నారు
పేదవారి కళ్లలో ఈ ఆనందం కోసమే కేసీఆర్ కృషిచేస్తారు
తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని లక్ష సాయంతో బిసిల సాధికారత
5000 కోట్లు కళ్యాణలక్ష్మీ కోసం కేటాయింపు ఇందులో 50శాతం వాటా బీసీలదే
రజకుల సంక్షేమానికి 250 యూనిట్ల ఉచిత కరెంటు, 61వేల కుటుంభాలకు నెల నెలా లబ్దీ
దోబీఘాట్ల నిర్మాణం, హైద్రాబాద్ మేడిపల్లిలో 2 ఎకరాలు, 5 కోట్లతో రజక ఆత్మగౌరవ భవనం
అధికారికంగా ఐలమ్మ జయంతి, వర్థంతి వేడుకలు, రజకులకు ఉచిత 250 యూనిట్ల కరెంట్ బిసి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు- గంగుల కమలాకర్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బిసిల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు బిసి వీరుల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా స్మరించుకుంటుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించిన చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలనం చేసి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం, సభ్యులు ఉపేంద్ర, కిషోర్, జయంతి కమిటీ ఛైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ పెద్ద ఎత్తున రజక సంఘం ప్రతినిధులు, ఐలమ్మ అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 128 ఏళ్ల క్రితం తెలంగాణలో పోరాటాల దీవిటీ జన్మించిందని, చిట్యాల ఐలమ్మ ఏ ఒక్క కులానికో పరిమితం చేయవద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్థి అని కొనియాడారు మంత్రి గంగుల. నాడే భూస్వాములకు ఎదురొడ్డి పోరాడి తన ఆత్మగౌరవం కోసం గొప్ప పోరాటం చేసారని ఘనంగా స్మరించుకున్నారు, అంతటి వీరవనిత చరిత్ర ప్రజలకు తెలియకుండా సమైక్య పాలకులు చేసిన కుట్రలు హేయమన్నారు. మరుగున పడ్డ చాకలి ఐలమ్మ విశిష్ట్యాన్ని తెలిపేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోరాటానికి స్పూర్తిగా ఐలమ్మను నిలిపారన్నారు. 120 ఏళ్ల పాటు గుర్తింపుకు నోచుకోని ఐలమ్మ జయంతి, వర్థంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే జీవోను తన బిసి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల.
బిసిలు అనాదిగా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి గంగుల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో బిసిలకు దొరుకుతున్న సముచిత గౌరవానికి ధన్యవాదాలు తెలిపారు. ఎకరా వందకోట్లు విలువ చేసే కోకాపేట్, ఉప్పల్ భగాయత్ లాంటి చోట్ల వేలకోట్ల విలువైన 87.3 ఎకరాలను 41 బిసి సంఘాలకు కేటాయించారని సంతోషం వ్యక్తం చేసారు. గతంలో ఉమ్మడి పాలకులకు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా 5గుంటల జాగా ఇవ్వలేని నాటి పరిస్థితులను సబికులకు వివరించినప్పుడు సభా ప్రాంగణం గంభీరంగా మారిపోయింది.
నాడు 19 ఉన్న బిసి గురుకులాలను 327కు పెంచి ప్రపంచస్థాయి విద్యను అందిస్తుంటే, కులవ్రుత్తులు చేసుకొనే బిసిలు తమ బిడ్డలు ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఉప్పొంగిపోతున్నారని, ఈ ఆనందం కోసమే సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించి దిగ్విజయంగా అభివ్రుద్ది చేస్తున్నారన్నారు.
బొంబాయి, కొల్ కతా తదితర ప్రాంతాలనుండి వచ్చి అత్యాధునికంగా దోబీనిర్వహిస్తుంటే మనవారు వెనుకబడుతున్నారని, దాన్ని పారద్రోలడానికి బిసి కులవ్రుత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో ప్రోత్సాహమిస్తున్నారన్నారు. కళ్యాణలక్ష్మీ వంటి పథకాలతో బిసిలు అప్పుల ఊబీలో చిక్కకుండా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ సంక్షేమ కార్యక్రమంలో బిసిలకు మెజార్టీ వాటా దక్కుతుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. మనకోసం ఇంత చేస్తున్నవారిని మర్చిపోకూడదని ఎన్నికల సమయంలో వచ్చి అరచేతిలో స్వర్గం చూపించేవారి మాయలో పడకుండా, మన కడుపునింపే కేసీఆర్ గారికి ప్రతీ ఒక్కరం ఎన్నికల ద్వారా దీవెనార్థులియ్యాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం మాట్లాడుతూ అణగారిన వర్గాలనుండి పేదరికం నుండి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ దాన్నేప్పుడూ మర్చిపోలేదని, మూలాలను మరవకుండా అనునిత్యం తన చుట్టూ బిసి వర్గాలను మంచిగా చూసుకుంటారన్నారు, కరీంనగర్ని దేశంలోనే ఆధర్శంగా తీర్చిదిద్దుతూ నాడే ప్రతీ బిసి కులానికి స్థలాలు కేటాయించారన్నారు. ఈ క్రుషిని గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రిని చేసారని, అది బిసి కులాల అధ్రుష్టమన్నారు. నేడు భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మను ఘనంగా స్మరించుకొనే అవకాశం కేవలం కేసీఆర్ గారి వల్లే దక్కిందన్నారు. సీఎం, మంత్రి క్రుషితో బిసిలు సంఘటితం అవుతున్నారని, దాన్ని కొనసాగించానలని ఐక్యంగా ఉంటేనే గుర్తింపు ఉంటుందన్నారు వకుళాభరణం కృష్ణమోహన్ రావ్,
ఈ కార్యక్రమానికి ఛైర్మన్గా అధ్యక్షత వహించిన అక్కరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరీంనగర్లోనే మాడ్రన్ దోబీఘాట్ల నిర్మాణానికి తొలుత చొరవ చూపిన మంత్రి గంగుల కమలాకర్ గారని ధన్యవాదాలు తెలిపారు. చాకలి ఐలమ్మనే తెలంగాణ ఉధ్యమానికి స్పూర్తని ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం గుర్తించుకోవాలని, కులంతో పాటు ఉద్యమానికి గుర్తింపు తెచ్చిన చిట్యాల ఐలమ్మ జీవితాన్ని పాఠ్యాంశంలో చేర్చి గౌరవించారని, బిసిల కోసం ముఖ్యంగా రజకుల కోసం తెలంగాణ ప్రభుత్వం 250 యూనిట్ల ఉచితకరెంట్, దోబీఘాట్లు, ఆత్మగౌరవ భవనం తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు.
———————————————
కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి
కాంగ్రెస్,బీజేపీ వి మోసపు మాటలు
వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ ఇవ్వరు..ఇక్కడ మాత్రం అన్ని ఇస్తారట
ఓట్లు డబ్బాల పడ్డాక మొహం చాటేసే రకాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…మోస పోతే గోస పడతాం
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్, మెండోరా మండలాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ప్రజలు డప్పు చప్పుళ్లతో,మహిళలు మంగళ హారతులతో అఖండ స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం ముప్కాల్ మండల కేంద్రంలో 1.95 కోట్లతో ముప్కాల్ నుండి మెండోరా వరకు బిటి రోడ్ రిన్వల్ పనుల శంకుస్థాపన, మెండోరా మండలం సొన్ పెట్ గ్రామంలో సొన్ పెట్ నుండి అప్రోచ్ రోడ్ కాకతీయ కెనాల్ బ్రిడ్జ్ వరకు 35 లక్షల వ్యయం,మెండోరా మండలం దూదిగాం గ్రామంలో సర్వీస్ రోడ్ NH 44 నుండి శివాజీ విగ్రహం వరకు 55 లక్షల వ్యయంతో,దూదిగాం నుండి మేండోరా వరకు వయా కాకతీయ కెనాల్ 1.30 కోట్ల వ్యయంతో,పోచంపాడ్ గ్రామంలో 1.30 కోట్లతో NH 44 నుండి SRSP డ్యామ్ వరకు సెంట్రల్ లైటింగ్ పనుల శంకుస్థాపన,
మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో వెల్కటూర్ నుండి వెల్కటూర్ తండా వరకు బిటి రోడ్ రిన్వల్ 1.60 కోట్ల వ్యయంతో, వెల్కటూర్ వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణం (NH 16 TO NH7 వయా రేంజర్ల,దోన్కల్ రోడ్) 2.50 కోట్ల వ్యయంతో, మెండోరా మండలం సావేల్ గ్రామంలో స్లాబ్ కల్వర్టు నిర్మాణం (NH 16 TO NH7 వయా రేంజర్ల,దోన్కల్ రోడ్) 80 లక్షల వ్యయంతో,మేండోరా మండల కేంద్రంలో స్లాబ్ కల్వర్టు నిర్మాణం మేండోరా దూదిగాం రోడ్డు పై 80 లక్షల వ్యయంతో,మెండోరా మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు,మరియు సెంట్రల్ లైటింగ్,డ్రైన్స్ పొడిగింపు పనులు 2.00 కోట్లతో ,మెండోరా శుక్రవారం దేవి టెంపుల్ రోడ్ రూ.1 కోటి వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేశారు.
కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమయ్యింది మంత్రి వేముల స్పష్టం చేశారు. వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. కొత్తగా ఏర్పడిన ముప్కాల్, మెండోరా మండలాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేసుకున్నామని వివరించారు.
ఇక అర్రాసు పాట లెక్క హామీలు ఇస్తున్న కాంగ్రెస్ ను,ఓట్లు వేసుకున్నాక మొహం చాటేసే బీజేపీ ని ప్రజలు నమ్మొద్దని అన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ ఇవ్వరు..ఇక్కడ మాత్రం అన్ని ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఓట్లు అయితే డబ్బాల పడనీ, తర్వాత చూద్దాం అనే రకాలని అన్నారు. వారి మభ్యపెట్టే హామీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ,మోస పోతే గోస పడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు,స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.