హైదరాబాద్ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి (“ఉపాధ్యాయ దినోత్సవం”) వేడుకల సందర్భంగా, హైదరాబాద్‌లోని మారియట్ హోటల్ సమీపంలో ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు, దేశ రెండో రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
భారతదేశ నిర్మాణంలో, అలాగే విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉపాధ్యాయులకు, విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కనీసం వారి సమస్యలను, ఘోషను ప్రభుత్వం పట్టించుకోవాలి.
Also Read-
ఇప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీచర్లకు సకాలంలో జీతాలు రావడం లేదు. రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులకు పెన్షన్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. సమాజంలో భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతిఒక్కరి ధర్మం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల ప్రగతికి, విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి.
విశ్వవిద్యాలయాలకు వెయ్యి కోట్లు ఇస్తామని కేవలం ప్రకటనలు గుప్పించడం కాదు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. విద్యా సంస్థలను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రాధాన్యత కావాలి.
