అంబేద్కర్ వర్సిటీలో అంబేద్కర్ స్మారక ఉపన్యాసం
ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
హైదరాబాద్ : సమ సమాజ స్థాపనకు రాజ్యంగా నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ చూపిన మార్గాన్ని అందరూ ఆచరించాల్సిందే అని ప్రఖ్యాత కవి, సామాజిక ఉద్యమకారులు, డా. కత్తి పద్మా రావు పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘సామాజిక సాధికారత ఉత్సవాల్లో’ భాగంగా సోమవారం డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతిని సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఉదయం జ్ఞానవనం లోని అంబేద్కర్ విగ్రహం, పరిపాలన భవనం వద్ద ఘనంగా పుష్పాంజలితో నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన డా. బి. ఆర్. అంబేద్కర్ స్మారకోపన్యాసంలో కవి, రచయిత, సామాజిక కార్యకర్త డా.కత్తి పద్మారావు ముఖ్య అతిథిగా హాజారై “అంబేద్కర్ సమకాలిన దర్శనం” అంశంపై (గుంటూర్ జిల్లా పొన్నూర్ నుంచి) ఆన్లైన్ ద్వారా ఉపన్యాసం చేశారు.

డా. పద్మారావు మాట్లాడుతూ అంబేద్కర్ కులవ్యవస్థను చాలా దగ్గర నుంచి చూశారు. కుల వివక్షతకు గురయ్యారు. ఈ రోజు కూడా మనం విద్య, ఉద్యోగాల్లో కులం పేరుతో వివక్షతను చూస్తున్నాం. అంబేద్కర్ చెప్పిన కుల రహిత, కులాల రద్దు సిద్ధాంతం ఇంకా పూర్తి కాలేదు. సమానత్వం కోసం పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. అంబేద్కర్ భావజాలంలో విద్య చాలా కీలకం. విద్య లేకపోతే మనిషి తన హక్కులు, బాధ్యతలు తెలుసుకోలేడని వివరించారు. ఈ ఆధునిక సమాజంలో కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, దళితులు, గిరిజనులు, బాలికలు విద్యకు దూరంగా ఉంటున్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం లోని మౌలిక హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలు ఇప్పటికీ మన ప్రజాస్వామ్య నిర్మాణానికి మూలస్తంభాలు అని ఆయన గుర్తు చేశారు.
Also Read-
మత, కుల, లింగ వివక్ష వంటివి ఈ హక్కులను కాలరాస్తున్నప్పుడు, మనం తిరిగి అంబేద్కర్ చూపిన మార్గాన్నే అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సరిపోదని, ఆర్థిక న్యాయం లేకుంటే ప్రజలకి స్వేచ్ఛ శూన్యం అని హెచ్చరించారు. కొందరికి మాత్రమే సంపద కేంద్రీకృతమవడం, ఆర్ధిక న్యాయం జరగక, వనరులు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవడం శ్రమజీవులను తీవ్ర కలతకు గురిచేస్తుంది అన్నారు. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళల వివాహ, ఆస్తి, విడాకులు వంటి హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఒక్క తరం నాయకుదు కాదని, ఆయన అన్ని తరాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై ఎప్పటికీ వెలిగే దీపస్తంభం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్ర్రంలో ఉన్నత విద్యా వ్యాప్తికి, పేదల అభ్యున్నతికి అంబేద్కర్ ఓపెన్ వర్సీటీ చేస్తున్న కృషిని వివరించారు. పేదల అభివృద్ధికి పాటు పడుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతను అందిస్తోందని, దీంతో తమ భాద్యత మరింత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీ వ్యాప్తికి అవసరమైన చర్యలు చేపట్టి ప్రతీ పేద విద్యార్ధికి అందుబాటులో ఉంటామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిలుగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ డా. ఎల్.వి జయ కృష్ణా రెడ్డి; గుంటూరు లోని పొన్నూర్ నుంచి డా, వెంకటేశ్వర్లు, ప్రొ. బోజు శ్రీనివాస్, పలు విభాగాల డైరక్టర్లు, డీన్లు, ప్రొ. సుధారాణి, ప్రొ. ఆనంద్ పవర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ.పల్లవీ కాబ్డే, ప్రొ. రవీంద్రనాథ్ సోలోమన్, ప్రొ. బోజు శ్రీనివాస్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. ఎన్ రజిని, డా. బానోత్ ధర్మా, డా. రమాదేవి, బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్సే ఎస్టీ ఉద్యోగుల సంఘం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయాలు విద్యా విలువలను పెంపొందించాలి : డా. కె.కేశవ రావు
డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ముగిసిన “సామాజిక సాధికారత ఉత్సవాలు”

హైదరాబాద్ : డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మహనీయుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన “సామాజిక సాధికారత వారోత్సవాల” ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వా సలహాదారు (ప్రజాపాలన), మాజీ రాజ్యసభ సభ్యులు, డా. కె. కేశవ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డా. కె. కేశవ రావు మాట్లాడుతూ… నైపున్యతలేని కార్మికులకు నైపుణ్యత ఇచ్చే ప్రాధమిక లక్ష్యంతో సార్వత్రిక విద్య వ్యవస్థ, విశ్వవిద్యాలయానికి ఆ నాటి మంత్రి హోదాలో రూపకల్పన చేసామని గుర్తు చేసారు. విద్యా విలువలను పెంపొందిస్తూ అందరికీ ఉన్నత విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించాలని సూచించారు. 43 సంవత్సరాల క్రితం సార్వత్రిక విద్యను అంకురార్పణ చేసే క్రమంలో భాగాస్వమ్యమైన తాను, ఈ రోజు అంబేద్కర్ వర్సీటీ ఎదిగిన క్రమం చూసి చాలా గర్వపడుతున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత విస్తరించి సాంకేతిక విద్యా కోర్సు లతో ముందుకు వెళ్లాలని, నైపుణ్య కోర్సులు విద్యార్ధులకు ఉపాధి కల్పించడమే కాకుండా వారిని గొప్ప పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 5 నుండి ఈ రోజు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించమని పేర్కొన్నారు. ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ విశ్వవిద్యాలయాన్ని మరో మూడు దశాభ్దాలకు సరిపడే విధంగా మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించామని వాటికి ప్రభుత్వం ఆమోదం వేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతో తమ భాద్యత మరింత పెరిగిందని, రానున్న రోజుల్లో నైపుణ్య కోర్సులను అందించేలా రూపకల్పన చేశామని కొన్ని ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నట్లు, తద్వారా ప్రతీ సంవత్సరం 10 వేల మంది విద్యార్ధులను నైపుణ్య విద్యావంతులుగా తయారు చేయనున్నట్లు ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు.
కార్యక్రమంలో గౌరవ అతిథిలుగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ డా.ఎల్. విజయ కృష్ణా రెడ్డి; పలు విభాగాల డైరక్టర్లు, డీన్లు, ప్రొ. ఆనంద్ పవర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ.పల్లవీ కాబ్డే, ప్రొ. రవీంద్రనాథ్ సోలోమన్, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. ఎన్ రజిని, డా. బానోత్ ధర్మా, విశ్వవిద్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. డా. కె. కేశవ రావు ను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు కలిసి తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించేలా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించాలని కోరారు. ఆయన స్పందిస్తూ సమస్యను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లుతానని సానుకూలంగా మాట్లాడారు.
అంతకు ముందు “సామాజిక సాధికారత వారోత్సవాలలో” భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ‘ప్రగతిలో భాగస్వాములు’ (అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం – తెలంగాణ ప్రభుత్వం మధ్య సహకారం), ‘అభ్యాస వారసత్వం’ (విశ్వవిద్యాలయ విద్యార్ధుల విజయగాథలు) అనే రెండు డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. సాంస్కృతిక క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.
ఓపెన్ యూనివర్సిటీలో గోరటి వెంకన్న పాట
వెంకన్న ఆట, పాటలతో దద్దరిల్లిన యూనివర్సిటీ ప్రాంగణం

హైదరాబాద్ : డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మహనీయుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన “సామాజిక సాధికారత వారోత్సవాల” ముగింపు కార్యక్రమంలో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పూర్వ విద్యార్ధుల సంఘం, యారో అడ్వర్టయిజింగ్ సంస్థ సంయుక్తంగా సోమవారం సాయంత్రం ప్రజాకవి, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆధ్వర్యంలో ‘గోరటి పాట’ సంగీత సంధ్య కార్యక్రమాన్ని యూనివర్సిటీ లోని భవనం వెంకట్రాం ఆడిటోరియం లో నిర్వహించారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్ర జ్యోతి పూర్వ సంపాదకులు, ప్రఖ్యాత జర్నలిస్ట్ డా. కె. శ్రీనివాస్, కవులు, సాహిత్యవేత్తలు అపర్ణ తోట, మొర్తాల విమల, తెలుగు సాహిత్యవేత్త యాకుబ్, యారో అడ్వర్టయిజింగ్ సంస్థ ఎండి జగన్మోహన్ రెడ్డి, ప్రఖ్యాత కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
