బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
హైదరాబాద్ : సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల (డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వెనుబడి ఉన్న ఈ జాతులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్టిఫికెట్లు లేక పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంచార జాతుల సంఘం కోల శ్రీనివాస్ మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సంచార జాతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో సంచార జాతుల అభివృద్ధికి కృషి జరిగిందని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయా పథకాల ప్రయోజనాలు అందడం లేదని, దాంతో వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
Also Read-
మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డీనోటిఫైడ్ జాతుల ఆర్థిక సాధికారత పథకం (సీడ్) కింద ప్రయోజనాలు సంచార జాతులు కోల్పోతున్నారని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డీఎన్టీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మొదలు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎత్తరి మారయ్య, ఆలకుంట్ల హరి, ఆర్వి మహేందర్ రాజమళ్ళ బాలకృష్ణ, డి నరేష్ కుమార్, అశోక్ కుమార్ యాదవ్, డి కుమారస్వామి ప్రవీణ్ వంజరా, గోపు సదానందం, శ్రీధర్ సాగర్ మరియు లంగం పాల్గొన్నారు