హైదరాబాద్: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో గల యాదాద్రి ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. దీంతో శంకర్ నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
సీఎం వస్తుంటే ప్రజా ప్రతినిధులను అరెస్టులు చేస్తారా…
హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేయడం ఏమిటి… టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామిక చర్య. కాంగ్రెస్ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దామరచర్ల కు ఈ రోజు ముఖ్యమంత్రి వస్తే గతంలో ఆయన హామీ ఇచ్చిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత.
భూ నిర్వాసితులకు పరిహారాలు, ఇతర సౌకర్యాలు, స్థానికులకు ఉద్యోగాలు, పోడు భూములకు పట్టాలు, జాబ్ కార్డ్స్ గురించి కాంగ్రెస్ నాయకులు సీఎం ను ఆడిగారు. డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం ముఖ్యమంత్రిని ఆడిగేందుకు వెళ్లడం నేరమా? డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ను, ఆడివిదేవిపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ ప్రాంత నాయకులను అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారు. వారిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలి. దామరచర్ల ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతాం.