Hyderabad: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి కిడ్నాప్ కేసులో 8 మందిని పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నారు. తాను క్షేమంగానే ఉన్నానంటూ తమ తండ్రికి కిడ్నాప్ కు గురైన యువతి ఫోన్ చేసి చెప్పింది. దీంతో యువతి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు ఆమె తండ్రిని తీసుకుని వెళ్లారు. ఈ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాధ్యాహ్నం సమయంలో 100 మందితో వచ్చిన మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి నానా హంగామా చేసి డెంటల్ డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేయటంతో ఈ కేసు నగరమంతా సంచలనంగా మారింది.
ఇదే క్రమంలో మధ్యాహ్నం నుంచి అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు.. ఏం చేశారు.. అంటూ అమ్మాయి తరఫు బంధులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. పోలీసులపై కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. నవీన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. చివరికి వైశాలి తన తండ్రి దామోదర్‌కి ఫోన్ చేసింది. తాను సిటీలోనే ఉన్నానని తెలిపిన వైశాలి, క్షేమంగానే ఉన్నానని చెప్పింది. తన గురించి ఆందోళన చెందవద్దని ధైర్యం కూడా చెప్పింది. ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేయటం మొదలుపెట్టిన పోలీసులు ఆమె ఉన్న చోటును గుర్తించారు. సినిమాల్లో చూపించిన విధంగా హుటాహుటిన వాళ్లున్న ప్లేస్‌కి వెళ్లిన పోలీసులు ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో కిడ్నాపర్లను పట్టుకున్నారు. వైశాలిని కిడ్నాపర్ నుంచి రక్షించారు.
మరోవైపు, డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని రాగన్నగుడాలో నివసిస్తున్న వైశాలి అనే యువతి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తుంది. అయితే ఈ రోజు నవీన్ రెడ్డి వంద మంది యువకులతో కలిసి వైశాలి ఇంటికి వచ్చి నానా హంగామా చేశాడు. ఇంటిలోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన వాళ్లపై దాడి చేసి మరీ వైశాలిని కిడ్నాప్ చేశారు. దీంతో ఈ కిడ్నాప్ స్థానికంగా కలంకలం సృష్టించింది. మిస్టర్ టీ ప్రాంచైజీకి ఓనర్ అయిన నవీన్ రెడ్డితో వైశాలికి వివాహం చేద్దామని గతంలో మాట్లాడుకోగా కొన్ని రోజులు ఇద్దరు స్నేహంగా మెలిగారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ నవీన్ రెడ్డి వైశాలి వెంట పడ్డాడు. వైశాలి ఇంటి ముందున్న స్థలాన్ని లీజుకు తీసుకుని అందులో గ్లాస్ హౌస్ నిర్మించాడు. వైశాలిని ఇంప్రెస్ చేసేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. ఇలా వెంట పడుతుండటంతో పెళ్లి ఇష్టం లేదని అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వైశాలినే స్వయంగా మెజిస్ట్రేట్ ముందు తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ వైశాలి స్టేట్మెంట్ ఇచ్చింది.
Related News:
దీంతో తనను కాదని మరో వ్యక్తితో వైశాలికి వివాహం చేస్తున్నారన్న కోపంతో నవీన్ రెడ్డి కక్షపెంచుకున్నాడు. ఈరోజు వైశాలికి పెళ్లిచూపులు జరుగుతున్నాయని తెలుసుకున్న నవీన్ రెడ్డి 100 మందితో అమ్మాయి ఇంటిపై దాడి చేసి వైశాలిని కిడ్నాప్ చేశాడు. తన టీ స్టాల్‌కు వచ్చే వ్యక్తులు కొంతమంది స్టూడెంట్ లకు డబ్బులు ఇచ్చి పట్టపగలు నవీన్ అమ్మాయి ఇంటిపై దాడి చేసి అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అడ్డు వచ్చిన వారిపై రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లోకి బలవంతంగా చొరబడి సీసీ కెమెరాలు ఇంట్లో సామాన్లు మొత్తం ధ్వంసం చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న కోపంతోనే గత ఆరు నెలలుగా నవీన్ రెడ్డి కక్షపెట్టుకొని అమ్మాయిని వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ దాడి చేసిన వారిలో 40 మందికి పైగా యువకులను రాచకొండ పోలీసులు గుర్తించారు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన అనంతరం యువకులు అమ్మాయిని నవీన్ రెడ్డికి అప్పగించి అక్కడి నుండి పారిపోయారు. ఎటువంటి ఆధారాలు పోలీసులకు దొరకకుండా వైశాలి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా జరుగుతున్న సమయంలోనే వైశాలి తాను క్షేమంగా ఉన్నానంటూ తండ్రికి ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోను ట్రాక్ చేసి వైశాలి కథను సుఖాంతం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల ఇంట్లో పలు చోట్ల రక్తపు మరకలను గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు10 కార్లు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. (Agencies)